బెంగుళూరు వంకాయ తో పచ్చడి .
కావలసినవి .
బెంగుళూరు వంకాయలు -- రెండు
పచ్చి మిరపకాయలు -- 8
కొత్తిమీర -- ఒక కట్ట
పసుపు --కొద్దిగా
ఉప్పు -- తగినంత
కరివేపాకు -- రెండు రెమ్మలు.
చింతపండు -- చిన్న నిమ్మకాయంత . కొద్ది నీటిలో తడిపి ఉంచుకోవాలి .
పోపునకు .
నూనె -- నాలుగు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 8
మెంతులు -- పావు స్పూను
మినపప్పు -- స్పూనున్నర
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా బెంగుళూరు వంకాయలు కడిగి చెక్కు తీసి ముక్కలుగా తరుగు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే తరిగిన వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా పసుపు , కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ముక్కలను బాగా మగ్గనిచ్చి దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
ఇప్పుడు మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే దింపు కోవాలి .
పోపు చల్లారగానే ముందుగా రోటిలో ఎండుమిరపకాయలు , చింతపండు మరియు ఉప్పు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత బెంగుళూరు వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మరోసారి మెత్తగా బండతో నూరుకోవాలి .
చివరలో మిగిలిన పోపు మరియు కొత్తిమీర వేసి ఒకే ఒకసారి నూరుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే . ఎంతో రుచిగా ఉండే బెంగుళూరు వంకాయలతో రోటి పచ్చడి సర్వింగ్ కు సిద్ధం. ఈ పచ్చడి చపాతీలు , దోశెలు మరియు అన్నం లోకి రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment