Friday 29 December 2017

సేమ్యా దోశ

సేమ్యా 3కప్పులు
బొంబాయిరవ్వ 1 కప్పు
బియ్యపిండి 1,1/2కప్పు
గోధుమపిండి 1కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,అల్లం,పచ్చిమిర్చికొత్తిమీర
కరివేపాకు 2రెమ్మలు
జీలకర్ర1చెంచా
మిరియాలు 10గింజలు
మజ్జిగ (కొంచం పుల్లటిదైనా బావుంటుంది)
ఉప్పు
మజ్జిగలో పైన చెప్పిన పదార్ధాలు వేస్తూ రవ్వదోశ పిండిలా పల్చగ కలుపుకొని పెనం అంచులనుండి మద్యలోకి పోస్తు దోశలు వేసుకోవాలి ఒక పక్కన కాల్చుకుంటే చాలు ఈ అట్లు తిరగేసి కాల్చక్కర్లేదు.
ఉల్లిపాయ వేయకపోయినా బాగుంటుంది.

Sunday 24 December 2017

ఉసిరికాయ పచ్చడి

ఉసిరికాయ పచ్చడి . (  రోటి పచ్చడి )

మామూలుగా   సీజన్  లో  ఉసిరికాయ ముక్కలు గా   మెత్తగా   రోటిలో  దంపుకుని  గింజలను తీసి తొక్కిన ముక్కలను  ఒక జాడీలో  బాగా  నొక్కి పెట్టి , మూడు రోజులు  అలాగే   కదపకుండా  ఉంచి  నాలుగవ  రోజు  ఒక  బేసిన్  లోకి   తీసుకుని   సరిపడా  ఉప్పు  మరియు  పసుపు  వేసి  తిరిగి  జాడీలోకి  తీసుకుని  నొక్కి   పెట్టుకుంటాము.

దానిని  ఉసిరికాయ  నూరని  పచ్చడి  అంటాము .

ఈ  పచ్చడి  పూర్తిగా  సంవత్సరం  నిల్వ ఉంటుంది .

ఎవరికైన  పొరపాటున   జాడిపై  పొర  లాగా  కట్టినా , అది  బూజు  అనుకుని  పచ్చడి  మొత్తము   పారేయవద్దు .

అది  ఉసిరికాయ  పచ్చడి  సహజ  లక్షణం .

ఆ  పై  పొర  తీసేస్తే  లోపల  పచ్చడి  అంతా  Fresh  గా  ఉంటుంది .

ఇక  ఉసిరికాయ  రోటి  పచ్చడి  తయారీ  విధానము

కావలసినవి.

నూరని  ఉసిరి కాయ  పచ్చడి  --  ఒక   కప్పు .
ఎండుమిరపకాయలు  --  10 .
మెంతులు  ---  పావు  స్పూను
మినపప్పు  --   స్పూను
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి   నూనె మొత్తము వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు  , మినపప్పు  , మెంతులు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .

పోపు  చల్లారగానే  రోటి లో  ముందుగా   ఎండుమిరపకాయలు  వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి .

తర్వాత  మిగిలిన పోపు  , మరియు  ఉసిరి కాయ  పచ్చడి  కూడా  వేసి  బండతో  నూరుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  పచ్చడి  తీసుకోవాలి .

నిల్వ  పచ్చడి  పెట్టే సమయంలో నే  సరిపడా  ఉప్పు వేసుకుంటాము  కనుక  ఇంక   మరలా ఉప్పు  వేయనవసరం  లేదు.

అంతే  పుల్ల  పుల్ల గా  ఎంతో  రుచిగా  ఉండే  ఉసిరి కాయ  పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం .

ఈ నూరిన పచ్చడి  నాలుగు  రోజులు  నిల్వ  ఉంటుంది .

భోజనము లో  మొట్టమొదట గా  ముందు  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని  కలుపుకు  తినాలి .

అద్భుతమైన   రుచిగా  ఉంటుంది .

Thursday 21 December 2017

హాట్ కేక్ Egg less

గుడీవినింగ్ ఫ్రెండ్స్..
హాట్ కేక్ లా...అంటారు కదా..
       ఇదిగో అదే నేను చేసిన హాట్ హాట్ కేక్.
ఎగ్లెస్ నట్టీ చాక్లెట్ కేక్.
           తెలియని వారి కోసం రెసిపీ:
మైదా :2 కప్పులు
సుగర్ పౌడర్ 1/2 కప్పు
కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు.
రెగ్యులర్ మిల్క్ 1, కప్పు.
కోకో పౌడర్1/2 కప్పు
బేకింగ్ పౌడర్ పావు చెంచా,బేకింగ్ సోడా పావుచెంచా..నట్స్ మనకిష్టమైనన్ని.
నెయ్యి అరకప్పు(బటర్ కూడా వాడచ్చు)
         ముందుగా సుగర్ పౌడర్ ,నెయ్యి బాగా కలిపి క్రీం లా చెయ్యాలి.  మైదా , కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ కలిపి జల్లించుకొని
సుగర్ పౌడర్ మిశ్రమం లో కొద్ది కొద్దిగా వేస్తూ..
పాలూ,కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి.
డ్రైఫ్రూట్స్ కొన్ని కలిపాలి.గిన్నెకి నెయ్యి రాసి   కొంచెం మైదా తో డస్టింగ్ చేసి కలుపుకున్న కేక్ మిశ్రమం సగం వరకూ నింపి  ముగిలిన నట్స్ పైన వేసి బేక్ చెయ్యాలి.
         అన్నట్టు నేనిది కుక్కర్ లో నే చేసానండీ..
కుక్కర్ లో అడుగున ఉప్పు వేసి దానిమీద మనం టేబుల్ మీద పెట్టే స్టీల్ స్టాండ్ పెట్టి దానిమీద గిన్నె పెట్టాలి.కుక్కర్ మూత కి గేస్కెట్ ,విజిల్ పెట్టకూడదు.
  మీడియం ఫ్లేమ్ లో నలభై నిమిషాలు పడుతుంది .

Wednesday 20 December 2017

తొక్కుడు లడ్డూ

లడ్డు తయారీ:

అన్ని ఒక కప్పు కొలత అండీ.

౧. ముందుగా సెనగపిండి జల్లించుకొని, పొయ్యి మీద pan sim లో పెట్టుకొని నెయ్యి వేసుకొని, ఆ పిండిని కొంచెం కొంచెం గా వేసుకుంటూ దోరగా  వేయించుకున్నాను. (మంచి వేగిన వాసన వచ్చే వరకు)
౨. అందులో కొంచెం యాలకుల పొడి కలిపాను.
౩. మూకుడు తీసుకొని , పొయ్యి మీద పెట్టుకొని అందులో పంచదార వేసి అది తడిసే వరకు నీరు పోసి , తీగపాకం(మొదటి దశ) రానివ్వాలి.
౪. ఇప్పుడు వేయించిన శనగపిండి మిశ్రమాన్ని అందులో క్రమంగా కలుపుకోవాలి.
౫. మరికొంచెం నెయ్యి వేసినా బాగుంటుంది. నాకు నెయ్యి అంటే అమితముగా ఇష్టమండీ, అందుకే కొంచెం ఎక్కువ వేసాను.
౬. శనగపిండి ,పాకం కలిసి చక్కగా మూకుడుకు అంటుకోకుండా ఉంటుంది.
౭. అలా అయిందంటే, లడ్డు చేయడానికి మిశ్రమం తయారయినట్లు.
౮. కాసేపు ఆ మిశ్రమాన్ని చల్లారనిచ్చి, గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవడమే 🙂🙂

Monday 18 December 2017

కొత్తిమీర నిల్వ పచ్చడి

కొత్తిమీర  నిల్వ పచ్చడి .

కావలసినవి .

కొత్తిమీర  --  రెండు పెద్ద కట్టలు .

వేర్లు కట్ చేసుకుని  కాడలతో సహా ఆకును  శుభ్రంగా  కడిగి  ఒక గుడ్డమీద వేసి తడి లేకుండా రెండు గంటల సేపు  ఎండ బెట్టు కోవాలి .

ఆ తర్వాత కాడలతో సహా  కత్తిరించుకోవాలి .

ఆ తర్వాత  ఆ మొత్తము  ఆకును  నూనె వేయకుండా  బాండీలో  మొత్తము  ఆకు  ముద్దగా  దగ్గర  పడే వరకు వేయించుకోవాలి .

తర్వాత  కొత్తిమీర  ముద్ద  తొక్కులుగా  ఉండకుండా ఈ వేయించిన  ముద్దను  రోటిలో  వేసుకుని కొంచెం  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .

చింతపండు  --  75 గ్రాములు తీసుకుని  ఒక ముప్పావు  గ్లాసు నీళ్ళు పోసుకుని  స్టౌ మీద పెట్టి  బాగా  చిక్కపడేంత వరకు  ఉడికించి  చిక్కగా రసము  వేరే గిన్నెలో కి తీసుకుని   మిగిలిన  పిప్పి  పార వేయాలి .

పై  కొత్తిమీర  మరియు చింతపండు  రసము బాగా చల్లారనివ్వాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ  పెట్టి ఒక 100  గ్రాముల నువ్వుల నూనె కాని , వేరు శనగ  నూనె కాని పోసుకుని  నూనె  బాగా  కాగగానే  అందులో నాలుగు  ఎండుమిరపకాయలు , స్పూనున్నర  మెంతిపిండి  , స్పూను జీలకర్ర , స్పూనున్నర  ఆవాలు   వేసుకుని పోపు  వేగగానే  రసము తీసి ఉడికించి ఉంచుకున్న  చింతపండు  రసము పోపులో  వేయాలి .

అందులో చెంచా  పసుపు , నాలుగు  స్పూన్లు కారం, తగినంత  ఉప్పు  (  షుమారు  నాలుగు స్పూన్లు  ఉప్పు  ) మరియు  75  గ్రాముల  బెల్లపు పొడి  అందులో వేయాలి .

అట్ల కాడతో  బాగా  అన్నీ కలిసి దగ్గర  పడేంతవరకు కలుపుకుని ,  సిద్ధంగా  ఉంచుకున్న  కొత్తిమీర  ముద్దను  ఆ పోపులో  వేసి  బాగా  కలుపుకోవాలి .

బాగా  చల్లారగానే  తీసుకుని  వేరేగా  ఒక జాడీలో గాని , ఒక  సీసాలో కానీ   తీసుకోవాలి .

అంతే  అద్భుతమైన  రుచిగా  ఉండే  కొత్తిమీర   నిల్వ పచ్చడి సిద్ధం.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , చపాతీలు , రోటీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా ఉండే   అద్భుతమైన , రుచికరమైన  కొత్తిమీర  నిల్వ పచ్చడి  సిద్ధం.

ఈ పచ్చడి  ఏడాది అంతా  నిల్వ  ఉంటుంది .

ఇంట్లో  కొత్తిమీర   లేనప్పుడు  ఒక  స్పూను  ఈ కొత్తిమీర  పచ్చడి  చారు కాని , పులుసుల్లో కాని  వేసుకుంటే  అదే  మామూలు కొత్తిమీర   వేసుకున్న  రుచి వస్తుంది .

Saturday 16 December 2017

చుక్కకూర పచ్చడి

చుక్కకూర  పచ్చడి .

కావలసినవి .

చుక్కకూర  --  రెండు కట్టలు.
పచ్చిమిర్చి  --  8
నూనె  --  అయిదు  స్పూన్లు
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

పోపునకు.

ఎండుమిరపకాయలు  --  6
చాయమినపప్పు -- స్పూనున్నర
మెంతులు  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా  చుక్కకూరలో ముదురు కాడలు  తీసి వేసి శుభ్రం చేసుకుని సిద్ధంగా  ఉంచుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  చుక్కకూర , పచ్చిమిర్చి , పసుపు వేసి మూత పెట్టి  ఆకును మగ్గ నివ్వాలి .

తర్వాత  మగ్గిన ఆకును విడిగా ప్లేటులో తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు, మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి  పోపు వేసుకోవాలి .

ఈ  వేయించిన పోపును  రోటిలో వేసి , తగినంత  ఉప్పును వేసి  పచ్చడి బండతో  మెత్తగా  దంపు కోవాలి .

తర్వాత  మగ్గిన చుక్క కూర , పచ్చిమిర్చి  వేసి బండతో నూరుకోవాలి .

తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.

ఇష్టమైన వారు  మినపప్పు  , ఆవాలు  మరియు ఎండుమిర్చి  వేసి తిరిగి పైన పోపు  వేసుకోవచ్చు .

ఈ చుక్కకూర పచ్చడిలో  ఆకులో  పులుపు ఉంటుంది  కనుక  చింతపండు  వేయనవసరము లేదు.

ఈ పచ్చడి దోశెలు, చపాతీలు మరియు భోజనము  లోకి ఎంతో రుచిగా  ఉంటుంది .

Friday 8 December 2017

బియ్యపు పిండి సగ్గుబియ్యం చక్రాలు

ఉత్త బియ్యప్పిండి, జీలకర్ర, ధనియాలు, నానేసిన సగ్గుబియ్యం.. ఇంగువ, మిరియాల తో చక్రాలు.. పొరపాటున నాలుగు మెంతి గింజలు పడ్డాయ్.. చిరుచేదు... మొత్తానికి బాగున్నాయి

Wednesday 6 December 2017

పండు మిరపకాయ కారం (పచ్చడి)

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా రోటిలో పొత్రముతో  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

చెగోడీలు

మాంచి చేగోడీ అనగా :
(1) గుల్లగా ఉండియూ, కరకర లాడునంత మాత్రము గట్టిగా ఉండుట
(2) అందులోని వెన్నపూస, నువ్వుల వలన నమలగా కరకరలాడి, ఆ పిదప నోటిలో కరిగిపోవుటా
(3) రావలసిన ఘుమ ఘుమలు: జీలకర్రా, వామూ, స్వల్పం గా పుదినా సైతం!

చెడ్డ చేగోడీ అనగా:
(1) రాయి వలె ఉండి, నమిలిన పళ్ళు ఊడిఫోవుటా
(2) ఏ ఘుమ ఘుమా లేక బియ్యప్పిండి నమిలినట్లు ఉండుటా

Tuesday 5 December 2017

రైస్ కట్లెట్స్

ఒక బౌల్ అన్నంలో మీడియమ్ సైజ్ ఉడకబెట్టిన ఆలుా వేయాలి. రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి వేశాను. రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, సన్నగా కట్ చేసి వేశాను. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, పావు స్పుాన్ జీరా పౌడర్, పావు స్పుాన్ ధనియా పౌడర్, కాస్త గరం మసాలా పొడి, కాస్త చాట్ మసాలా పొడి, కొద్దిగా కారం, ముాడు టేబుల్ స్పూన్లు శనగపిండి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గట్టిగా ముద్దలాగా కలపాలి. ఆ ముద్ద చిన్న ఉండలుగా తీసుకుని కాస్తమందంగా రౌండ్ గా కానీ, ఓవల్ షేప్ లో కానీ ఒత్తుకోవాలి. వీటిని బ్రెడ్ పౌడర్లో రెండువైపులా అద్దుకోవాలి. పాన్ లో రెండుముాడు స్పుాన్స్ నుానె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉన్నాయి. క్రిస్పీగా బావున్నాయి. నాకే ఇలా కుదిరాయంటే, మీరంతా ఇంకా బాగా చేస్తారు.
మీడియం సైజ్ బౌల్ రైస్ కి 14 కట్లెట్స్ తయారయ్యాయి. నలుగురం తిన్నాం!!
తప్పకుండా చేయండి!

అశోకా హల్వా

అశోకా హల్వా.

కావలసినవి .

చాయ పెసరపప్పు -- ఒక కప్పు
గోధుమ పిండి --  రెండు స్పూన్లు
యాలకులు  -- 5 మెత్తగా  పొడి చేసుకోవాలి.
పంచదార --  ఒక కప్పున్నర
నెయ్యి  --  ఒక కప్పు
జీడిపప్పు  --  15  పలుకులు .

తయారీ  విధానము .

స్టౌ వెలిగించి  బాండీ  పెట్టి  కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు  కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .

తర్వాత కుక్కర్లో  గిన్నె పెట్టి  వేయించిన  పప్పు వేసి  సరిపడా  నీళ్ళు పోసి  మూడు విజిల్స్  వచ్చే వరకు  ఉంచాలి .

తర్వాత  మెత్తగా  పప్పును యెనపాలి .

తర్వాత బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  విడిగా  ప్లేటులో తీసుకుని  ఉంచుకోవాలి .

తర్వాత  అదే బాండీలో  మరో స్పూను  నెయ్యి వేసి  గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకుని పక్కన  పెట్టు కోవాలి .

తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు  నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న  పెసర పప్పు  మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.

రెండూ దగ్గర  పడి  ఉడుకుతుండగానే  పది నిముషాల  తర్వాత  వేయించిన  గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని    మిఠాయి రంగు కొద్దిగా  పాలల్లో  కలుపుకుని   ఉడుకుతున్న హల్వాలో  పోసి గరిటతో  బాగా కలుపుకోవాలి .

తర్వాత  మిగిలిన  నెయ్యి  , జీడిపప్పు పలుకులు  వేసి  గరిటతో  బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  తమిళనాడు  స్పెషల్ అశోకా హల్వా  సర్వింగ్  కు సిద్ధం.

Sunday 3 December 2017

వంకాయ పులుసు పచ్చడి

వంకాయ కాల్చి గుజ్జుగా చేసుకొని. వేయించిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చీ , కరివేపాకు వేసి,చింతపండు రసం వేసి సెమీ సోలిడ్ గా ఉండేలా చూస్కోవాలి.
నువ్వులపప్పు ఓ రెండు చెంచాలు వేయించుకొని పౌడర్ చేసుకొనీ , ఆ పౌడర్, అల్లం తురుము కూడా వెయ్యాలి సరిపడిన ఉప్పు కలపాలి .
చివరగా ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి, ఇంగువ తో పోపు పెట్టుకోవాలి  కొత్తిమీర వేస్కోవాలి 
కొందరు ఇందులో రుచికి కొద్దిగా బెల్లం వేస్తారు.

Friday 1 December 2017

నారింజ కారం

నారింజ  కాయ కారం.

కావలసినవి .

నారింజ కాయలు  --  రెండు.
ఎండుమిరపకాయలు  --  15
మెంతులు   ---  స్పూనున్నర 
ఆవాలు  ---  రెండు  స్పూన్లు
ఉప్పు   --  తగినంత
నూనె  ---  మూడు స్పూన్లు

పోపునకు .

నూనె  ---  రెండు  స్పూన్లు
ఆవాలు  ---   అర  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

నారింజ కాయలు  పై  తొక్క తీసుకుని  తొనల  లోపల  ముత్యాలను  చేదు  రాకుండా  ఒలుచుకొని  ఒక  గిన్నెలోకి  రసంతో సహా తీసుకోవాలి .

స్టౌ మీద బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు మరియు  ఇంగువ   వేసి  ఎరుపు రంగు  వచ్చే  వరకు  వేయించుకోవాలి.

చల్లారగానే అందులో  సరిపడా  ఉప్పు వేసి  రోటిలో వేసుకుని పచ్చడి బండతో మెత్తగా పొడిగా దంపుకోవాలి.

ఇప్పుడు  ఆ పొడిని  ఒక గిన్నెలో  వేసి  ఒలిచిన ముత్యాలను  వచ్చిన రసంతో సహా వెయ్యాలి .

స్పూనుతో బాగా కలుపుకోవాలి.

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  రెండు ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , ఆవాలు మరియు  కొంచెం ఇంగువ వేసి  పోపు  పచ్చడిలో  కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  నారింజ  కాయల కారం ఇడ్లీ , దోశెలు మరియు  అన్నం లోకి  సర్వింగ్ కు సిద్ధం .

తాళింపులో ప్రొటోకాల్

ఇది తిండి యావ కాదు.

'వంట చేయడం పెద్ద కళా ? లేక పెద్ద విద్యా? ఎవరైనా చేస్తారు.' అనే వ్యాఖ్యలు తరచు వింటూనే ఉంటాం.
వెనుకటి తరం భోజన అలవాట్లకు, ఈ తరం అలవాట్లకు చాల తేడాలు వ్యత్యాసాలు కనిపిస్తాయి.  పాత తరం వంటలు మంచి రుచిగా ఉంటాయని గాని ఇప్పటి తరం వారు చేసే  వంటలు బాగుండవనిగాని  చెప్పడం నా ఉద్దేశం కాదు. " పురాణ మిత్యేవ న సాధు సర్వం" అన్న  కాళిదాసు మాట కవిత్వానికి కాదు వంటలకు అన్వయమే.

అయితే పాత వంటలైనా గాని, కొత్త వంటలలో కాని  వంట చేసే విధానంలో కొన్ని సామాన్య ధర్మాలు, , కొన్ని  protocols ఉంటాయి.  ఏ కూర ఏ విధంగా చేసినా  తగినంత ఉప్పు వేయడం  సామాన్య ధర్మం. అలాగే పోపు లేదా తాలింపు / తిరగమోత వేసే విధానం లో కొన్ని protocols ఉంటాయి.వాటిని విధిగా పాటించాలి.  వాటిని అలా పాటించినప్పుడు వ్యంజనం యొక్క రుచి ఇనుమడిస్తుంది. కొన్ని దినుసులు  కొన్ని వంటలలో వాడకూడదు. అలా వాడ క పోవడం వలన ఆ పదార్థం రుచి హితవుగా ఉంటుంది.  వాడ కూడని దినుసులు వాడక పోవడం వలన కూడ పదార్థాలు రుచులు పెరుగుతాయి.
ఈ సులువులు, అనాదిగా వస్తున్న పద్ధతులు  అనుభవాల వలన పుట్టినవి. వాటినే recipe అంటాం.
ఇప్పటి తరాల వారికి  కొన్ని విధానాలు చెప్పినపుడు , లేదా ఫలానా దినుసు ఈ వంటలో వాడితే బాగుండదని చెప్పినప్పుడు , " ఆఁ  సింగి నాదం . అలా అని ఎక్కడైనా శాస్త్రం ఉందా?  అది వాడితే ఏమవుతుంది?  అంతా చాదస్తం కాని?" అని నిరసనగా మాట్లాడడం చూస్తాం.
చాల మందికి ఏ ఏ వంటలలో ఏ ఏ దినుసులు వాడితే బాగుంటుందో తెలుసును. కాని వాటిని ఒక క్రమం లో ముందు వెనుకలుగా ఎలా వాడాలో తెలియదు. అలా వాడక పోవడం వలన ఆ పదార్ధానికి రుచి పోతుంది. . మెత్తగా ఉడక వలసినవి ఉడకక పోవడం, లేదా  ఒక మాదిరిగా వేగవలసినవి మాడి పోవడం లాంటివి ఏర్పడి పదార్ధం తినడానికి రుచించదు.
ఉదాహరణకు పోపు వేసేటపుడు సెనగ మినప పప్పులు ముందర వేసి సగం వేగుతూండగా ఎండు మిరపకాయలు వేసి ఆ తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర లాంటివి వేసి చిటపటలాడుతున్నప్పుడు చివరిలో పచ్చిమిర్తి, కరివేపాకు వేయడం ఒక పద్ధతి. ఇది సామాన్యంగా పాటించే protocol.  " అః ఇలాగే చేయాలని ఎక్కడుంది. అని ముందర పచ్చిమిర్చి కరివేపాకుతో పోపు .మొదలు పెట్టి తే  ఏమనాలి? నచ్చ చెప్పడానికి యత్నిస్తే ' ఈ పెద్దవాళ్లకు తిండి యావ ఎక్కువ' అని విసుగు కోవడం జరుగుతుంది.
దోసకాయ ముక్కలతో పచ్చడి చేస్తాం.  ఇందులో కొత్తి మీరి పచ్చిమిర్చి తప్పక వేయాలి.
మినప్పప్పు , ఆవాల పోపు అందులో కలిపితే రుచి పెరుగుతుంది. ఈ పచ్చడిలో ఉల్లి పాయలు వేయడం బాగుండదు.
"  వేస్తే ఏమవుతుంది ?" అని అడ్డంగా  నారాయణాస్త్రం లాంటి ప్రళ్న వేస్తే నమస్కారమే దానికి సమాధానం.
పాయసంలో పోపు పెట్టం.  కాని పెట్తానంటే అది నా ఉద్దేశం లో మహ పాపమే.  
ముక్కల పులుసులు, ధప్పళాలు, పప్పు పులుసు( సాంబార్), మజ్జిగ పులుసులు  అందరూ చేస్తారు. కాని  చాల మంది ఇళ్లల్లో ముక్కలు ఉడుకుతాయి కాని  పులుపు, ఉప్పు వాటికి అంటక చప్పగా ఉంటాయి. కారణం protocol పాటించక పోవడం వలన.  పులుసులో ఉప్పు కారం పడ్డాక కూడ రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడక నివ్వాలి.

ఇదంతా చదివి ' తిండి రంధి ' అనుకోరు కదా!

పచ్చి మిరపకాయల పచ్చడి, దోసకాయ మెంతి కారం

మిర్చి 1/2 చంచా నూనె లో వేయించి చల్లార్చి వుప్పు వేసి రుబ్బి నిమ్మరసంపిడాలి. (10 పచ్చి మిరపకాయలకు 1 నిమ్మకాయ రసం పడుతుంది. మిరపకాయలు కారం లేనివి వాడాలి) 1 గరిటడు నూనెలో పోపు 1 చంచామినపప్పు, 1 చంచా శనగపప్పు 1/2 చంచా ఆవాలు1/2 చంచ జీలకఱ్ఱ , చంచా పచ్చి మెంతిపిండ, ఇంగువ వేసి వేయించి పచ్చడిని పోపు లో వేయాలి. చల్లారాక పొడిసీసా లో వుంచాలి.

దోసకాయ మెంతికారం:
1 గట్టి దోసకాయ సన్న ను ముక్కలు గా కోయండి.మెంతులు1 పెదచంచా ఆవాల 2 TVs వేయించ పొడి చేయండి.1/4 cup red mirchi powder కంచెంతక్కవగా వుప్పు  తీసుకొని (4 రకాలు)ముక్కలలో కలపండి. ఒక కప్పు నూనె వేసి బాగాలకు జాడీ లో వుంచండ. పక్కరోజు కలియతిప్పి తినండి

Thursday 30 November 2017

పాఠోళి

ఇది తెలుగు వాళ్ళదే. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది.
Authentic version: కందిపప్పు నానబెట్టి సరిపడ ఎండుమిర్చి , ఇంగువ, జీలకఱ్ఱ, వుప్పు వేసి కచ్త్చపచ్చ రుబ్బి నూనెబాగా వేసి రుబ్బిన పిండిని వాయలు వాయలు గా బంగారు రంగు వచ్చి కరకర వాడు వరకు వేయిస్తారు. అన్నంలో ఆధరువుగా తింటారు.
Kamala’ recipe ( పాఠోలీ)
రుబ్బటం వరకు పై విధంగానే.
తరువాత పిండిని కుక్కర్ గిన్నె( నూనె రాసిన) లోఆవిరిమీద వుడికించి
చల్లారాక చిదిపి నూనె బాగా వేసి పోపు చేసి ( కరివేపాకు పచ్చిమిర్చిముక్కలు, వుల్లి ముక్కలు కూడా వేసి) చదివిన పప్పును బాగా వేయించాలి. ఇది పలహారంలాగా కూడా తినవచ్చు.

Wednesday 29 November 2017

పాలపొడి అటుకుల గులాబ్ జాం

పాలపొడి ఇంకా అటుకులు కలిపి గులాబ్ జాం

ఎప్పుడు చూసిన గులాబ్ జాం పొస్ట్స్ పెడుతుంది అనుకోకండి ఎందుకంటే అందరికి అన్ని రకాల వంటల గురించి తెలియాలి కదా.

తయారీ విధానం
ముందుగా 1కప్ అటుకులని కడిగి ఒక అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి తరువాత దీనిలో అరకప్పు పాలపొడి వేసుకుని వంటసోడా వేసుకుని 2స్పూన్స్ పాలు వేసుకుని ముద్దలా కలుపుకుని ఉండలా చుట్టుకుని నూనేలో వేసుకుని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని తరువాత పాకంలో వేసుకోవాలి.
అటుకుల ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే పాకంలో ఇలాచి వేసుకోవాలి
ఇది ఎంత రుచిగా ఉంటుంది అంటే తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది
ఇందులో అటుకులు వేసాం కాబట్టి పాకాన్ని కూడా త్వరగానే పీల్చుకుంటుంది

చారుపొడి

చారుపొడి....
చారుపొడి చాలా రకాలుగా చేస్తారు నేను కర్ణాటక లో నేర్చుకున్నా చాలా రుచిగా పిల్లలు కూడా ఇష్టపడతారు తెలియని వారికోసం
ధనియాలు - 2కప్స్
మెరపకాయలు - 20
మెంతులు - 3 స్పూన్స్
జీలకర్ర - 3 స్పూన్స్
మిరియాలు - 2 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్ , ఇంగువ కొద్దిగా నూనే
మెరపకాయలు ఇంగువ కొద్దిగా నూనె లో వేయించుకోవాలి మిగిలినవి అన్నీ నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి చల్లారేక అన్నీ కలిపి మెత్తగా మిక్సీలో పొడి చేయాలి కర్వేపాకు కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు.

ఒక లీటరు నీళ్ళలో వుప్పు పసుపు చింతపండురసం, కర్వేపాకు ఒక స్పూన్ చారుపొడి వేసి బాగా మరగించి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ మెరపకాయ వేసి పోపు వేసి దింపేయండి