కొత్తిమీర నిల్వ పచ్చడి .
కావలసినవి .
కొత్తిమీర -- రెండు పెద్ద కట్టలు .
వేర్లు కట్ చేసుకుని కాడలతో సహా ఆకును శుభ్రంగా కడిగి ఒక గుడ్డమీద వేసి తడి లేకుండా రెండు గంటల సేపు ఎండ బెట్టు కోవాలి .
ఆ తర్వాత కాడలతో సహా కత్తిరించుకోవాలి .
ఆ తర్వాత ఆ మొత్తము ఆకును నూనె వేయకుండా బాండీలో మొత్తము ఆకు ముద్దగా దగ్గర పడే వరకు వేయించుకోవాలి .
తర్వాత కొత్తిమీర ముద్ద తొక్కులుగా ఉండకుండా ఈ వేయించిన ముద్దను రోటిలో వేసుకుని కొంచెం మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
చింతపండు -- 75 గ్రాములు తీసుకుని ఒక ముప్పావు గ్లాసు నీళ్ళు పోసుకుని స్టౌ మీద పెట్టి బాగా చిక్కపడేంత వరకు ఉడికించి చిక్కగా రసము వేరే గిన్నెలో కి తీసుకుని మిగిలిన పిప్పి పార వేయాలి .
పై కొత్తిమీర మరియు చింతపండు రసము బాగా చల్లారనివ్వాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి ఒక 100 గ్రాముల నువ్వుల నూనె కాని , వేరు శనగ నూనె కాని పోసుకుని నూనె బాగా కాగగానే అందులో నాలుగు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మెంతిపిండి , స్పూను జీలకర్ర , స్పూనున్నర ఆవాలు వేసుకుని పోపు వేగగానే రసము తీసి ఉడికించి ఉంచుకున్న చింతపండు రసము పోపులో వేయాలి .
అందులో చెంచా పసుపు , నాలుగు స్పూన్లు కారం, తగినంత ఉప్పు ( షుమారు నాలుగు స్పూన్లు ఉప్పు ) మరియు 75 గ్రాముల బెల్లపు పొడి అందులో వేయాలి .
అట్ల కాడతో బాగా అన్నీ కలిసి దగ్గర పడేంతవరకు కలుపుకుని , సిద్ధంగా ఉంచుకున్న కొత్తిమీర ముద్దను ఆ పోపులో వేసి బాగా కలుపుకోవాలి .
బాగా చల్లారగానే తీసుకుని వేరేగా ఒక జాడీలో గాని , ఒక సీసాలో కానీ తీసుకోవాలి .
అంతే అద్భుతమైన రుచిగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి సిద్ధం.
ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , చపాతీలు , రోటీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే అద్భుతమైన , రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి సిద్ధం.
ఈ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉంటుంది .
ఇంట్లో కొత్తిమీర లేనప్పుడు ఒక స్పూను ఈ కొత్తిమీర పచ్చడి చారు కాని , పులుసుల్లో కాని వేసుకుంటే అదే మామూలు కొత్తిమీర వేసుకున్న రుచి వస్తుంది .
No comments:
Post a Comment