Tuesday 15 June 2021

మజ్జిగ పులుసు

మజ్జిగ పులుసు.

తయారు చేయు విధానము .

ముందుగా అర లీటరు పెరుగు చక్కగా కవ్వంతో గిలకొట్టి గడ్డలు లేకుండా చూసుకుని అందులో తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన పెట్టి ఉంచుకోవాలి,

పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు. నాకైతే కమ్మని పెరుగుతో మజ్జిగ పులుసు ఇష్టం. మీ మీ అభిరుచి ప్రకారము చేసుకొనవచ్చును .

అందులో పావు స్పూన్ పసుపు కలిపి గరిటతో బాగా కలుపుకోండి . అప్పుడే stove మీద పెట్టవద్దు.

ఒక గంట ముందు చిన్న గిన్నెలో మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు , పావు స్పూను ఆవాలు , పావు స్పూనులో సగం జీలకఱ్ర, చిన్న అల్లంముక్క మరియు చిన్న పచ్చి కొబ్బరిముక్క, వేసి ఒక గంట సేపు కాసిని నీళ్ళు పోసి నానబెట్టి , ఆతర్వాత ఆనీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకోండి .

 ఆ ముద్దని మజ్జిగ లో కలపండి.

నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని నిలువుగా చీలికలు గా తరిగి మజ్జిగ లో వేయండి. 

కరివేపాకు రెండు రెమ్మలు తీసుకుని ఆకులు దూసి కడిగి మజ్జిగ లో వేయండి.

తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.

ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటెను పెట్టి రెండు స్పూన్లు నూనెను వేసి నూనె బాగా కాగగానే , అందులో రెండు ఎండు మిరపకాయలు . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకఱ్ర . ఆవాలు అర స్పూను వేసి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టి , ఆ పోపును మజ్జిగ లో కలపండి.

ముందుగానే ఆనపకాయ ( సొరకాయ ) ముక్కను మరియు రెండు క్యారెట్లు తీసుకుని , వాటి పై చెక్కును తీసుకుని , ముక్కలు చిన్నవిగా తరిగి ఉంచుకొని విడిగా ఒక గిన్నెలో లేదా కుక్కర్ లో వేసుకుని మెత్తగా ఉడికించి ముక్కలు బాగా చల్లారాక మజ్జిగ లో కలుపు కోవాలి .

ఇప్పుడు రెండు టమోటాలు కూడా పులుసులో తరిగి వేసుకోవాలి.

ఇప్పుడు అన్నీ వేసిన మజ్జిగ పులుసును Stove మీద పెట్టి పొంగకుండా చూసుకుంటూ గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వాలి.

మజ్జిగ పులుసు పొంగకుండా గరిటతో కలుపుతూ ఉండండి . పొంగితే పై సారం నేల పాలయ్యి మజ్జిగ పులుసు రుచి ఉండదు .

బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి మజ్జిగ పులుసు లో వేసుకోవాలి .

అన్నీ వేసాక మాత్రమే మజ్జిగ పులుసును stove మీద ఎందుకు పెట్టమన్నానంటే ముందుగా నే వేడి పెడితే మజ్జిగ విరిగిపోతుంది.

పనీర్, పనీర్ బటర్ మసాల, శ్రీఖండ్

1) పన్నీర్..

పాలు చిక్కగా వుంటే పన్నీర్ ఎక్కువ వస్తుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడితే బాగుంటుంది.

మరో చిట్కా.. స్కిమ్డ్ మిల్క్ అయితే పాలు మరుగుతూండగా అముల్ క్రీమ్ కలుపవచ్చు.
పాలు మరుగుతూండగా  కొంచెం నీరు కలిపిన నిమ్మరసం కొద్ది ,కొద్దిగా కలిపి కలయపెడుతూ వుండాలి.

డైరెక్ట్ నిమ్మరసం అంత స్ట్రాంగ్ అవసరం లేదు.
లేదా పుల్ల మజ్జిగ వాడచ్చు. వెనిగర్.. కెమికల్. నాకిష్టం లేదు. సిట్రిక్ యాసిడ్ లో నీళ్ళు కలిపి వాడచ్చు.

పూర్తిగా విరిగిన తర్వాత స్ట్రైనర్ లో బట్ట వేసి వడకట్టాలి.నీరంతా పిండి ,చల్లటి నీళ్ళతో 2,3 సార్లు కడగాలి.
అప్పుడు నిమ్మకాయ పులుపు, వాసన  పోతుంది.
మళ్ళీ గట్టిగా పిండి, చదునుగాచేసి  మూటగట్టి  పైన బరువు పెట్టాలి.నేను మార్బుల్ చపాతీ పీట పెడతాను.

ఒక గంట వదిలేయాలి. గట్టిగా, షేప్ గా వస్తుంది. ఇప్పుడు కత్తితో ముక్కలు కోసుకోవాలి.

ఫ్రిజ్ లో  గిన్నెలో నీళ్ళు పోసి వుంచితే 2 వారాలపైనే బావుంటుంది. నొక్కిచూస్తే స్పాంజ్ లా వుంటుంది.
ఒకటి, రెండు సార్లు చేస్తే...అదే వస్తుంది.
అదేం బ్రహ్మవిద్యా..
                   ........

పనీర్ బటర్ మసాలా..

మనం చేసుకున్న నార్త్ ఇండియన్ మదర్ సాస్ వుందిగా.
ఒక ఉల్లిపాయ  ,ఒక వెల్లుల్లి గర్భం సన్నగా తరిగి .. నూనెలో వేయించి ,మనం చేసుకున్న మదర్ సాస్ 2, 3 గరిటలు (2, 3 స్పూన్స్ కాదు) వేసి కొద్దిగా వేగనిచ్చి, కావలసిన నీరు పోసి వుడకనివ్వాలి.
మీకు కావలసిన చిక్కదనం వచ్చాక, పన్నీర్ ముక్కలు వేసి కొద్ది సేపు ఉడకనిచ్చి ,చివరగా కసూరి మెంతి నలిపి వేసి స్టౌ కట్టేయాలి.కొత్తిమీర మీ ఇష్టం.
                      ###
     
మాంగో శ్రీఖండ్..

చిక్కటి ఒక లీటరు  పాలతో పెరుగు తోడు పెట్టుకోవాలి.
మర్నాడు ఒక బట్టలో పెరుగును వేసి నీరంతా వడకట్టుకోవాలి.
గంటా, రెండు గంటలు అలా జాలీలో వదిలేస్తే.. నీరంతా పోయి గట్టి ముద్ద మిగులుతుంది.
దీనిని "చెక్కా" అంటారు. ఇప్పుడు  ఆ చెక్కాని (hung curd)  5 నిమిషాలు చేతితో బాగా కలపాలి. అందులో 3 Tb sp  పాల మీగడ వేసి బాగా క్రీమీగా అయ్యేదాకా కలపాలి.

మామిడి పండు  మిక్సీలో మెత్తగా గుజ్జు చేసుకోవాలి.
స్మూద్ గా చేసుకున్న పెరుగులో మామిడి గుజ్జు వేసి కలిపి, కుంకుమపువ్వు పాలు పోసి కలపితే..రంగు, సువాసన వస్తుంది.

ఇష్టమైన వారు యాలకులపొడి వేయచ్చు.

మహారాష్ట్రియన్స్.. కొద్దిగా జాజికాయ పొడి వేస్తారు.
3, 4 గంటలు ఫ్రిజ్ లో పెట్టి .. మామిడి పండు సన్నటి ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
అంతే.

Monday 24 August 2020

పెసరపచ్చడి

 విధానము .

100  గ్రాముల పెసర పప్పును ఒక  గిన్నెలోకి తీసుకుని ఒకసారి  నీటితో  కడిగి , అందులో  పప్పు మునిగే  వరకు  నీళ్ళను పోసి  రెండు గంటల  సేపు  నాన బెట్టుకోవాలి.

తర్వాత  నీటిని  పారబోసి   పప్పును  వడగట్టు కోవాలి.

ఇప్పుడు  మిక్సీ లో  పది ఎండుమిరపకాయలు ,  ముప్పాను స్పూను జీలకర్ర , పావును స్పూనులో సగం ఇంగువను మరియు తగినంత  ఉప్పును   వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  అందులో  నానబెట్టిన పెసరపప్పును మరియు  కొద్దిగా  నీళ్ళు  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఈ పచ్చడిని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

పెసరపప్పు  అంటే ఏమిటని  కొందరు అడుగుతున్నారు. పై పొట్టు తీసిన పెసర పప్పును  చాయపెసరపప్పు  అని కూడా అంటారు.

అంతే. భోజనము లోకి ఎంతో  రుచిగా ఉండే పెసరపప్పు పచ్చడి రెడీ. కొందరు  ఈ పచ్చడితో  అట్టు వేసుకుని  వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  నంచుకుని  తింటారు. ఇంగువ వాసనతో  ఈ దోశెలు కూడా  భోజనము లోకి  చాలా రుచిగా  ఉంటాయి

Wednesday 19 August 2020

కందిపొడి

స్టౌ  మీద  బాండీ పెట్టుకుని అందులో ఒక పావు కిలో కందిపప్పు , 20 ఎండుమిరపకాయలు , రెండు స్పూన్లు  జీలకర్ర  వేసుకుని , నూనె  వేయకుండా  కంది పప్పు  మాడకుండా అట్లకాడతో  కదుపుతూ, కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

చల్లారగానే మిక్సీ లో ఈ మిశ్రమమును వేసుకుని  అందులో  పావు స్పూను ఇంగువను మరియు  తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత ఈ పొడిని  ఒక బేసిన్ లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకుని  ఒక సీసాలోకి  తీసుకోవాలి .

ఈ కందిపొడి  మూడు నెలలు  నిల్వ ఉంటుంది.

వేడి వేడి  అన్నంలో  నెయ్యి కాని , పప్పు నూనె కాని  వేసుకుని  తింటే  చాలా రుచిగా ఉంటుంది.

ఈ పొడికి  కాంబినేషన్ గా దోసావకాయ కాని , కొత్తావకాయ  కాని , పచ్చి పులుసు కాని  చాలా రుచిగా  ఉంటుంది.

Monday 10 August 2020

కొబ్బరి వాక్కాయ పచ్చడి

కావలసినవి

కొబ్బరి కాయ  -- ఒకటి .  పగుల కొట్టి  పచ్చి కొబ్బరి  కోరాముతో  తురుము కోవాలి.

వాక్కాయలు --  100 గ్రాములు
శుభ్రం చేసుకుని  లోపల గింజను తీసి వేసుకుని  ముక్కలుగా తరుగు కోవాలి.

ఎండుమిరపకాయలు  -- 8
పచ్చి మిరపకాయలు  --  6
మినపప్పు  --  స్పూనున్నర 
ఆవాలు  --  అర స్పూను 
మెంతులు  --  పావు స్పూను 
జీలకర్ర  --  పావు  స్పూను
ఇంగువ  --  కొద్దిగా 
పసుపు --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
నూనె  --  మూడు స్పూన్లు 
కరివేపాకు  --  రెండు రెమ్మలు .

తయారీ  విధానము .
 
ముందుగా  కొబ్బరి  తురుము ,  వాక్కాయ ముక్కలు  సిద్ధం చేసుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ  మరియు కరివేపాకు వేసి  పోపు వేయించుకొని   పోపు వేగగానే  అందులో  పచ్చి మిరపకాయలు  కూడా  వేసి రెండు నిముషములు మగ్గనిచ్చి   దింపుకోవాలి .

ఇప్పుడు ముందుగా  మిక్సీ లో ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు మరియు పోపు వేసి పచ్చడి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత వాక్కాయ ముక్కలు , పచ్చిమిర్చి , పసుపు వేసి  మరి మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

ఇపుడు  చివరగా  కొబ్బరి  తురుము కూడా  వేసి   మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత పచ్చడి వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  పుల్ల పుల్లగా  ఇంగువ వాసనతో ఎంతో రుచిగా  ఉండే  కొబ్బరి  వాక్కాయ పచ్చడి రెడీ.

Wednesday 5 August 2020

కొబ్బరితురుము పెరుగు పచ్చడి

కావలసినవి.
కొబ్బరి  కాయ -- ఒకటి  పగుల కొట్టి  రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి తురుముతో  తురుము కోవాలి .
పెరుగు  --  అర  లీటరు .

పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగు , పచ్చడి  కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగు వాడు కోవచ్చును. 

పచ్చి మిరపకాయలు  --  8
అల్లం  -- చిన్న ముక్క ఒకటి 
కొత్తిమీర  --  చిన్న కట్టలు రెండు .
ఉప్పు  --  తగినంత .

పోపునకు.
నెయ్యి --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  4 .   చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
చాయమినపప్పు  --  స్పూను .
జీలకర్ర  --  పావు స్పూను .
ఆవాలు --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా 
కరివేపాకు  --  మూడు రెమ్మలు .

తయారీ విధానము
పచ్చిమిరపకాయలు తొడిమలు  తీసి ఉంచుకోవాలి.
అల్లం  చెక్కు  తీసి , ముక్కలుగా చేసుకోవాలి .
కొత్తిమీర  విడదీసి శుభ్రం చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరపకాయలు , తరిగిన  అల్లం  ముక్కలు , కొత్తిమీర లో మూడు వంతులు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఇప్పుడు  ఒక గిన్నెలో సిద్ధంగా  ఉంచుకున్న  పెరుగు, తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి తురుము , మిగిలిన ఒక వంతు కొత్తిమీర  మరియు  మిక్సీ  వేసుకున్న మిశ్రమము వేసి  గరిటతో బాగా కలుపుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి  మొత్తము  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు, చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు పెట్టి , కొబ్బరి పెరుగు పచ్చడి లో కలుపుకోవాలి .

అద్భుతమైన  కొత్తిమీర  సువాసనతో  రుచిగా ఉండే ఈ కొబ్బరి తురుము పెరుగు పచ్చడి  భోజనము లోకి ఎంతో బాగుంటుంది 

Sunday 2 August 2020

వంకాయ పచ్చడి పులుసు

 పచ్చి పులుసు .

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత 
పసుపు  --  కొద్దిగా 

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు 
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసి వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క తీసిన వంకాయలు  తొడిమలు  తీసి  అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి కాంబినేషన్  గా  కందిపచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది.