Sunday 2 August 2020

వంకాయ పచ్చడి పులుసు

 పచ్చి పులుసు .

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత 
పసుపు  --  కొద్దిగా 

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు 
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసి వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క తీసిన వంకాయలు  తొడిమలు  తీసి  అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి కాంబినేషన్  గా  కందిపచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది.

No comments:

Post a Comment