Friday 27 July 2018

దబ్బకాయ కారం

కావలసినవి .

పసుపు పచ్చని దబ్బకాయ --    ఒకటి 

కాయను మధ్యకు  తరిగి  ఒక గిన్నెలో  రసం పిండుకోవాలి .

గింజలను  తీసేసు కోవాలి.

పోపునకు .

ఎండుమిరపకాయలు   --  పదిహేను.
ఆవాలు  ---  స్పూను
మెంతులు  --  స్పూను
ఇంగువ  --  పావు స్పూను
నూనె  --  మూడు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత
పసుపు   --  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే , వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు  మరియు ఇంగువ  వేసి పోపును   వేయించుకోవాలి.

చల్లారిన తర్వాత  రోటిలో  ఈ   పోపు , కొద్దిగా  పసుపు , సరిపడా ఉప్పు వేసి  పచ్చడి  బండతో  మెత్తగా  దంపుకోవాలి.

తర్వాత  ముందుగా  తీసి వుంచుకున్న  దబ్బ కాయ రసం రోటిలో  వేసి  పచ్చడి  బండతో  బాగా  నూరుకోవాలి .

అలా  నూరిన  దబ్బ కాయ  కారం  వేరే గిన్నె లోకి  తీసుకోవాలి.

కొద్దిగా  పలుచగా  ఉన్నట్లుగా  అన్పించినా  తరువాత  కారం రసాన్ని పీల్చుకుని  గట్టి  పడుతుంది .

అంతే  పుల్ల పుల్లగా  ఇంగువ ఘుమ ఘుమ లతో , ఇడ్లీ , దోశెలు , గారెలు  మరియు  భోజనము  లోకి  దబ్బ  కాయ కారం  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ కారం పది రోజులు నిల్వ ఉంటుంది .

Thursday 19 July 2018

మునగాకు కూర

ఆషాఢ మాసంలో మునగాకుతో తయారు చేసే వంటకాలను తప్పక తినాలని అంటారు .

కారణం ఋతువులు మారుతాయి కనుక మునగాకు లో కడుపులోని క్రిములను నశింపచేసే శక్తి ఉంది .కంటికి కూడా చాలా మంచిది.

మునగ కాయలు ఆరోగ్యానికి  ఎంత మంచివో  మునగ ఆకు కూడా  ఆహారంలో తీసుకోవడం రెట్టింపు  మంచిది .

తమిళనాడు వాళ్ళు బాగా ఎక్కువగా  మునగాకు  వాడతారు .

తమిళనాడు మార్కెట్లలో మునగాకు ఆకు ఒక ఆకు కూరగా  ప్రతిరోజూ అమ్ముతారు .

మన వాళ్ళు ఆషాఢమాసం మునగాకు వాడాలని , కార్తీక మాసం నేతి బీరకాయ తినాలని ,  శ్రావణమాసంలో  నేరేడు పళ్ళు తినాలని  , వేసవి కాలంలో  ముంజెలు  తినాలని  చెప్తారు .

మునగ ఆకుతో  పప్పు కూర .

మునగ ఆకు  --  మూడు కప్పులు .
            
లేత మునగ ఆకులు శుభ్రంగా  విడి విడిగా వలుచుకోవాలి.

చాయపెసరపప్పు  -- పావు కప్పు .

కూర చేయబోయే ఒక గంట ముందు  తగిన నీళ్ళు పోసి నానబెట్టుకుని  నీళ్ళు వడకట్టు కోవాలి .

పచ్చి కొబ్బరి తురుము  -  అర కప్పు .
కరివేపాకు  -  రెండు రెమ్మలు.
పసుపు  --  కొద్దిగా
కారం  --  స్పూను
ఉప్పు  --  తగినంత

పోపునకు.

నూనె --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  - 3  ముక్కలు గా చేసుకోవాలి.
చాయమినపప్పు  --  స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు  వేసుకోవాలి .

తర్వాత  మొత్తము  మునగాకు  ఆకు పళంగా వేసి , సరిపడ ఉప్పు మరియు  పసుపు వేసి  మూత పెట్టి  ఆకును  పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత  నానబెట్టిన చాయ పెసరపప్పును  మరియు స్పూను కారం కూడా వేసి మరో అయిదు నిముషాలు  ఆకు  మరియు  పెసరపప్పు రెండూ కలిసే విధముగా  మగ్గనివ్వాలి .

తర్వాత  పచ్చి కొబ్బరి తురుము కూడా  వేసి అట్లకాడతో బాగా కలిపి మరో  మూడు నిముషాలు  ఉంచి దింపి  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మునగాకు  పప్పు కూర  భోజనము  లోకి సర్వింగ్ కు సిద్ధం.

మునగ ఆకును కందిపప్పుతో కలిపి ఉడికించి తదుపరి పోపులో వేసుకుని తగినంత  ఉప్పు మరియు కారము వేసుకుని  పప్పు కూరగా కూడా చేసుకొనవచ్చును .

Sunday 15 July 2018

మునగాకు పచ్చడి

ఆషాఢ మాసంలో  మునగాకు తప్పని సరిగా  తినాలని పెద్దలు చెప్తారు.

కారణం ఎండాకాలం వెళ్ళి వానాకాలం ప్రవేశిస్తుంది .

మునగాకు  లో  వ్యాధి  నిరోధక   శక్తి  ఉంది .

కడుపు లోని క్రిములను హరిస్తుంది.

కంటికి  చూపును కూడా మెరుగవుతుంది.

కావలసినవి .

మునగాకు  --  లేత వొలిచిన మునగాక   ఆకు  మూడు  కప్పులు .
నువ్వుపప్పు  --   పావు కప్పు .
మినపప్పు   ---  మూడు  చెంచాలు.
జీలకర్ర  --  పావు స్పూను .
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
పసుపు  -- కొద్దిగా
ఎండుమిరపకాయలు  --  పది .
చింతపండు  ---  విడదీసి  మూడు  రెబ్బలు  సిద్ధంగా  నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
ఉప్పు  ---  తగినంత .
నూనె  ---  మూడు స్పూన్లు .
కొత్తిమీర  --  చిన్న కట్ట .

తయారీ  విధానము .

ముందుగా  నువ్వుపప్పు   బాండీలో  నూనె  వేయకుండా  కమ్మని  వాసన వచ్చేదాకా   వేయించుకొని  చల్లారగానే  రోటిలో  పచ్చడి బండతో  మెత్తని   పొడిగా   వేసుకోవాలి .

ఈ  పొడిని  పక్కన  ఉంచుకోవాలి .

స్టౌ మీద  బాండీ  పెట్టి  స్పూనున్నర   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   మునగాకు  ను  పచ్చి వాసన పోయి  ఆకు  మెత్తగా  అయ్యే వరకు  వేయించుకొని , వేరే  ప్లేటులో  పక్కన  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు  , మినపప్పు ,  జీలకర్ర , ఆవాలు , ఇంగువ  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

ఇప్పుడు   రోటి లో  ముందుగా  ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు  , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పువేసి   మెత్తగా   పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత  మిగిలిన  పోపు  వేసి   మినపప్పు   మెత్తగా   అయ్యేవరకు  పచ్చడి  బండతో దంపు  కోవాలి.

తర్వాత  మగ్గించిన  మునగాకు ,  నువ్వుపప్పు పొడి మరియు కొత్తిమీర  వేసి  కూడా  వేసి, చాలా కొద్దిగా  నీరు చల్లుకుని  పచ్చడి  బండతో  మెత్తగా  నూరుకోవాలి .

ఆ  తర్వాత  ప్లేటులోకి  తీసుకొని   చేతితో  బాగా  కలుపుకుని  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మునగాకు పచ్చడి అన్నం లోకి  సర్వింగ్  కు  సిద్ధం .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

Friday 13 July 2018

వంకాయ పచ్చి పులుసు

వంకాయ పచ్చి పులుసు .

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత
పసుపు  --  కొద్దిగా

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసి వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క తీసిన వంకాయలు  తొడిమలు  తీసి  అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి   కాంబినేషన్  గా  కందిపచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Wednesday 11 July 2018

వాక్కాయ పచ్చడి

వాక్కాయ పచ్చడి

కావలసిన పదార్ధములు:
వాక్కాయలు 100గ్రాములు
ఎండుమిర్చి 6
పోపు దినుసులు
ఉప్పు 1స్పూన్

తయారీ విధానం:
ముందుగా వాక్కాయలను కడిగి ఆరబెట్టాలి.తరువాత వాక్కాయలను మథ్యకి కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసివేయాలి.ఇక స్టౌవు వెలిగించి దాని మీద బాండిలో ఒక స్పూన్ నూనె వేసి ,కాగిన తరువాత ఎండుమిర్చి, మెంతులు, మినపప్పు, ధనియాలు, నువ్వులు, ఆవాలు ,ఇంగువ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బాండిలో వాక్కాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గబెట్టుకోవాలి.

ఇక పెరట్లో రోటి దగ్గరకు పదండి.

రోటి లో ఎండుమిర్చి, తగినంత ఉప్పు, వేయించిన పప్పులు వేసి మెత్తగా నూరాలి. తరువాత మగ్గబెట్టిన వాక్కాయలను వేసి నూరాలి.అంతే వాక్కాయ పచ్చడి రెడీ.

వేడి వేడి అన్నములో కమ్మని నేతితో వాక్కాయ పచ్చడి కలుపుకుని తింటే అద్బుతః.
 
ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Monday 9 July 2018

ఖస్థా (Khastha)

ఇది ఖస్థా, మైదా లో కొంచు ఉప్పు వేడి నూని లేదా డాల్డా , నీళ్లు వాము వేసి చపాతీ పిండి లా కొంచు గట్టిగా కలిపి చిన్న పూరి లా వొత్రి  త్రికోణం ఆకారం లో మడత పెట్టి  డీప్ ఫ్రై బాగా బ్రౌన్ కలర్ లో వేచాలి , పిక్ లో కొంచు వేపు తక్కువ ,,బట్ బాగా వేచి తీసి చతనీ లి ముంచుకొని తింటాము , చట్నీ విధానము , చింత పండు ముగ్గు లో ఉప్పు ,కారం పొడి , బెల్లం లేదా పంచదార కలిపి కావాలంటే ఆవాలు పోపు ,, ఈ చట్నీ సమీసా , బోండా , అలు టికీ తో కూడా చాలా  బాగుంటుంది ,