ఆషాఢ మాసంలో మునగాకు తప్పని సరిగా తినాలని పెద్దలు చెప్తారు.
కారణం ఎండాకాలం వెళ్ళి వానాకాలం ప్రవేశిస్తుంది .
మునగాకు లో వ్యాధి నిరోధక శక్తి ఉంది .
కడుపు లోని క్రిములను హరిస్తుంది.
కంటికి చూపును కూడా మెరుగవుతుంది.
కావలసినవి .
మునగాకు -- లేత వొలిచిన మునగాక ఆకు మూడు కప్పులు .
నువ్వుపప్పు -- పావు కప్పు .
మినపప్పు --- మూడు చెంచాలు.
జీలకర్ర -- పావు స్పూను .
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
పసుపు -- కొద్దిగా
ఎండుమిరపకాయలు -- పది .
చింతపండు --- విడదీసి మూడు రెబ్బలు సిద్ధంగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
ఉప్పు --- తగినంత .
నూనె --- మూడు స్పూన్లు .
కొత్తిమీర -- చిన్న కట్ట .
తయారీ విధానము .
ముందుగా నువ్వుపప్పు బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకొని చల్లారగానే రోటిలో పచ్చడి బండతో మెత్తని పొడిగా వేసుకోవాలి .
ఈ పొడిని పక్కన ఉంచుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి స్పూనున్నర నూనె వేసి నూనె బాగా కాగగానే మునగాకు ను పచ్చి వాసన పోయి ఆకు మెత్తగా అయ్యే వరకు వేయించుకొని , వేరే ప్లేటులో పక్కన ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె పోసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
ఇప్పుడు రోటి లో ముందుగా ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పువేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత మిగిలిన పోపు వేసి మినపప్పు మెత్తగా అయ్యేవరకు పచ్చడి బండతో దంపు కోవాలి.
తర్వాత మగ్గించిన మునగాకు , నువ్వుపప్పు పొడి మరియు కొత్తిమీర వేసి కూడా వేసి, చాలా కొద్దిగా నీరు చల్లుకుని పచ్చడి బండతో మెత్తగా నూరుకోవాలి .
ఆ తర్వాత ప్లేటులోకి తీసుకొని చేతితో బాగా కలుపుకుని వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు పచ్చడి అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
No comments:
Post a Comment