Thursday, 19 July 2018

మునగాకు కూర

ఆషాఢ మాసంలో మునగాకుతో తయారు చేసే వంటకాలను తప్పక తినాలని అంటారు .

కారణం ఋతువులు మారుతాయి కనుక మునగాకు లో కడుపులోని క్రిములను నశింపచేసే శక్తి ఉంది .కంటికి కూడా చాలా మంచిది.

మునగ కాయలు ఆరోగ్యానికి  ఎంత మంచివో  మునగ ఆకు కూడా  ఆహారంలో తీసుకోవడం రెట్టింపు  మంచిది .

తమిళనాడు వాళ్ళు బాగా ఎక్కువగా  మునగాకు  వాడతారు .

తమిళనాడు మార్కెట్లలో మునగాకు ఆకు ఒక ఆకు కూరగా  ప్రతిరోజూ అమ్ముతారు .

మన వాళ్ళు ఆషాఢమాసం మునగాకు వాడాలని , కార్తీక మాసం నేతి బీరకాయ తినాలని ,  శ్రావణమాసంలో  నేరేడు పళ్ళు తినాలని  , వేసవి కాలంలో  ముంజెలు  తినాలని  చెప్తారు .

మునగ ఆకుతో  పప్పు కూర .

మునగ ఆకు  --  మూడు కప్పులు .
            
లేత మునగ ఆకులు శుభ్రంగా  విడి విడిగా వలుచుకోవాలి.

చాయపెసరపప్పు  -- పావు కప్పు .

కూర చేయబోయే ఒక గంట ముందు  తగిన నీళ్ళు పోసి నానబెట్టుకుని  నీళ్ళు వడకట్టు కోవాలి .

పచ్చి కొబ్బరి తురుము  -  అర కప్పు .
కరివేపాకు  -  రెండు రెమ్మలు.
పసుపు  --  కొద్దిగా
కారం  --  స్పూను
ఉప్పు  --  తగినంత

పోపునకు.

నూనె --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  - 3  ముక్కలు గా చేసుకోవాలి.
చాయమినపప్పు  --  స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు  వేసుకోవాలి .

తర్వాత  మొత్తము  మునగాకు  ఆకు పళంగా వేసి , సరిపడ ఉప్పు మరియు  పసుపు వేసి  మూత పెట్టి  ఆకును  పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత  నానబెట్టిన చాయ పెసరపప్పును  మరియు స్పూను కారం కూడా వేసి మరో అయిదు నిముషాలు  ఆకు  మరియు  పెసరపప్పు రెండూ కలిసే విధముగా  మగ్గనివ్వాలి .

తర్వాత  పచ్చి కొబ్బరి తురుము కూడా  వేసి అట్లకాడతో బాగా కలిపి మరో  మూడు నిముషాలు  ఉంచి దింపి  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మునగాకు  పప్పు కూర  భోజనము  లోకి సర్వింగ్ కు సిద్ధం.

మునగ ఆకును కందిపప్పుతో కలిపి ఉడికించి తదుపరి పోపులో వేసుకుని తగినంత  ఉప్పు మరియు కారము వేసుకుని  పప్పు కూరగా కూడా చేసుకొనవచ్చును .

No comments:

Post a Comment