Wednesday, 5 August 2020

కొబ్బరితురుము పెరుగు పచ్చడి

కావలసినవి.
కొబ్బరి  కాయ -- ఒకటి  పగుల కొట్టి  రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి తురుముతో  తురుము కోవాలి .
పెరుగు  --  అర  లీటరు .

పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగు , పచ్చడి  కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగు వాడు కోవచ్చును. 

పచ్చి మిరపకాయలు  --  8
అల్లం  -- చిన్న ముక్క ఒకటి 
కొత్తిమీర  --  చిన్న కట్టలు రెండు .
ఉప్పు  --  తగినంత .

పోపునకు.
నెయ్యి --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  4 .   చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
చాయమినపప్పు  --  స్పూను .
జీలకర్ర  --  పావు స్పూను .
ఆవాలు --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా 
కరివేపాకు  --  మూడు రెమ్మలు .

తయారీ విధానము
పచ్చిమిరపకాయలు తొడిమలు  తీసి ఉంచుకోవాలి.
అల్లం  చెక్కు  తీసి , ముక్కలుగా చేసుకోవాలి .
కొత్తిమీర  విడదీసి శుభ్రం చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరపకాయలు , తరిగిన  అల్లం  ముక్కలు , కొత్తిమీర లో మూడు వంతులు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఇప్పుడు  ఒక గిన్నెలో సిద్ధంగా  ఉంచుకున్న  పెరుగు, తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి తురుము , మిగిలిన ఒక వంతు కొత్తిమీర  మరియు  మిక్సీ  వేసుకున్న మిశ్రమము వేసి  గరిటతో బాగా కలుపుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి  మొత్తము  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు, చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు పెట్టి , కొబ్బరి పెరుగు పచ్చడి లో కలుపుకోవాలి .

అద్భుతమైన  కొత్తిమీర  సువాసనతో  రుచిగా ఉండే ఈ కొబ్బరి తురుము పెరుగు పచ్చడి  భోజనము లోకి ఎంతో బాగుంటుంది 

No comments:

Post a Comment