Tuesday 15 June 2021

మజ్జిగ పులుసు

మజ్జిగ పులుసు.

తయారు చేయు విధానము .

ముందుగా అర లీటరు పెరుగు చక్కగా కవ్వంతో గిలకొట్టి గడ్డలు లేకుండా చూసుకుని అందులో తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన పెట్టి ఉంచుకోవాలి,

పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు. నాకైతే కమ్మని పెరుగుతో మజ్జిగ పులుసు ఇష్టం. మీ మీ అభిరుచి ప్రకారము చేసుకొనవచ్చును .

అందులో పావు స్పూన్ పసుపు కలిపి గరిటతో బాగా కలుపుకోండి . అప్పుడే stove మీద పెట్టవద్దు.

ఒక గంట ముందు చిన్న గిన్నెలో మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు , పావు స్పూను ఆవాలు , పావు స్పూనులో సగం జీలకఱ్ర, చిన్న అల్లంముక్క మరియు చిన్న పచ్చి కొబ్బరిముక్క, వేసి ఒక గంట సేపు కాసిని నీళ్ళు పోసి నానబెట్టి , ఆతర్వాత ఆనీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకోండి .

 ఆ ముద్దని మజ్జిగ లో కలపండి.

నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని నిలువుగా చీలికలు గా తరిగి మజ్జిగ లో వేయండి. 

కరివేపాకు రెండు రెమ్మలు తీసుకుని ఆకులు దూసి కడిగి మజ్జిగ లో వేయండి.

తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.

ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటెను పెట్టి రెండు స్పూన్లు నూనెను వేసి నూనె బాగా కాగగానే , అందులో రెండు ఎండు మిరపకాయలు . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకఱ్ర . ఆవాలు అర స్పూను వేసి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టి , ఆ పోపును మజ్జిగ లో కలపండి.

ముందుగానే ఆనపకాయ ( సొరకాయ ) ముక్కను మరియు రెండు క్యారెట్లు తీసుకుని , వాటి పై చెక్కును తీసుకుని , ముక్కలు చిన్నవిగా తరిగి ఉంచుకొని విడిగా ఒక గిన్నెలో లేదా కుక్కర్ లో వేసుకుని మెత్తగా ఉడికించి ముక్కలు బాగా చల్లారాక మజ్జిగ లో కలుపు కోవాలి .

ఇప్పుడు రెండు టమోటాలు కూడా పులుసులో తరిగి వేసుకోవాలి.

ఇప్పుడు అన్నీ వేసిన మజ్జిగ పులుసును Stove మీద పెట్టి పొంగకుండా చూసుకుంటూ గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వాలి.

మజ్జిగ పులుసు పొంగకుండా గరిటతో కలుపుతూ ఉండండి . పొంగితే పై సారం నేల పాలయ్యి మజ్జిగ పులుసు రుచి ఉండదు .

బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి మజ్జిగ పులుసు లో వేసుకోవాలి .

అన్నీ వేసాక మాత్రమే మజ్జిగ పులుసును stove మీద ఎందుకు పెట్టమన్నానంటే ముందుగా నే వేడి పెడితే మజ్జిగ విరిగిపోతుంది.

No comments:

Post a Comment