Friday, 1 December 2017

తాళింపులో ప్రొటోకాల్

ఇది తిండి యావ కాదు.

'వంట చేయడం పెద్ద కళా ? లేక పెద్ద విద్యా? ఎవరైనా చేస్తారు.' అనే వ్యాఖ్యలు తరచు వింటూనే ఉంటాం.
వెనుకటి తరం భోజన అలవాట్లకు, ఈ తరం అలవాట్లకు చాల తేడాలు వ్యత్యాసాలు కనిపిస్తాయి.  పాత తరం వంటలు మంచి రుచిగా ఉంటాయని గాని ఇప్పటి తరం వారు చేసే  వంటలు బాగుండవనిగాని  చెప్పడం నా ఉద్దేశం కాదు. " పురాణ మిత్యేవ న సాధు సర్వం" అన్న  కాళిదాసు మాట కవిత్వానికి కాదు వంటలకు అన్వయమే.

అయితే పాత వంటలైనా గాని, కొత్త వంటలలో కాని  వంట చేసే విధానంలో కొన్ని సామాన్య ధర్మాలు, , కొన్ని  protocols ఉంటాయి.  ఏ కూర ఏ విధంగా చేసినా  తగినంత ఉప్పు వేయడం  సామాన్య ధర్మం. అలాగే పోపు లేదా తాలింపు / తిరగమోత వేసే విధానం లో కొన్ని protocols ఉంటాయి.వాటిని విధిగా పాటించాలి.  వాటిని అలా పాటించినప్పుడు వ్యంజనం యొక్క రుచి ఇనుమడిస్తుంది. కొన్ని దినుసులు  కొన్ని వంటలలో వాడకూడదు. అలా వాడ క పోవడం వలన ఆ పదార్థం రుచి హితవుగా ఉంటుంది.  వాడ కూడని దినుసులు వాడక పోవడం వలన కూడ పదార్థాలు రుచులు పెరుగుతాయి.
ఈ సులువులు, అనాదిగా వస్తున్న పద్ధతులు  అనుభవాల వలన పుట్టినవి. వాటినే recipe అంటాం.
ఇప్పటి తరాల వారికి  కొన్ని విధానాలు చెప్పినపుడు , లేదా ఫలానా దినుసు ఈ వంటలో వాడితే బాగుండదని చెప్పినప్పుడు , " ఆఁ  సింగి నాదం . అలా అని ఎక్కడైనా శాస్త్రం ఉందా?  అది వాడితే ఏమవుతుంది?  అంతా చాదస్తం కాని?" అని నిరసనగా మాట్లాడడం చూస్తాం.
చాల మందికి ఏ ఏ వంటలలో ఏ ఏ దినుసులు వాడితే బాగుంటుందో తెలుసును. కాని వాటిని ఒక క్రమం లో ముందు వెనుకలుగా ఎలా వాడాలో తెలియదు. అలా వాడక పోవడం వలన ఆ పదార్ధానికి రుచి పోతుంది. . మెత్తగా ఉడక వలసినవి ఉడకక పోవడం, లేదా  ఒక మాదిరిగా వేగవలసినవి మాడి పోవడం లాంటివి ఏర్పడి పదార్ధం తినడానికి రుచించదు.
ఉదాహరణకు పోపు వేసేటపుడు సెనగ మినప పప్పులు ముందర వేసి సగం వేగుతూండగా ఎండు మిరపకాయలు వేసి ఆ తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర లాంటివి వేసి చిటపటలాడుతున్నప్పుడు చివరిలో పచ్చిమిర్తి, కరివేపాకు వేయడం ఒక పద్ధతి. ఇది సామాన్యంగా పాటించే protocol.  " అః ఇలాగే చేయాలని ఎక్కడుంది. అని ముందర పచ్చిమిర్చి కరివేపాకుతో పోపు .మొదలు పెట్టి తే  ఏమనాలి? నచ్చ చెప్పడానికి యత్నిస్తే ' ఈ పెద్దవాళ్లకు తిండి యావ ఎక్కువ' అని విసుగు కోవడం జరుగుతుంది.
దోసకాయ ముక్కలతో పచ్చడి చేస్తాం.  ఇందులో కొత్తి మీరి పచ్చిమిర్చి తప్పక వేయాలి.
మినప్పప్పు , ఆవాల పోపు అందులో కలిపితే రుచి పెరుగుతుంది. ఈ పచ్చడిలో ఉల్లి పాయలు వేయడం బాగుండదు.
"  వేస్తే ఏమవుతుంది ?" అని అడ్డంగా  నారాయణాస్త్రం లాంటి ప్రళ్న వేస్తే నమస్కారమే దానికి సమాధానం.
పాయసంలో పోపు పెట్టం.  కాని పెట్తానంటే అది నా ఉద్దేశం లో మహ పాపమే.  
ముక్కల పులుసులు, ధప్పళాలు, పప్పు పులుసు( సాంబార్), మజ్జిగ పులుసులు  అందరూ చేస్తారు. కాని  చాల మంది ఇళ్లల్లో ముక్కలు ఉడుకుతాయి కాని  పులుపు, ఉప్పు వాటికి అంటక చప్పగా ఉంటాయి. కారణం protocol పాటించక పోవడం వలన.  పులుసులో ఉప్పు కారం పడ్డాక కూడ రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడక నివ్వాలి.

ఇదంతా చదివి ' తిండి రంధి ' అనుకోరు కదా!

No comments:

Post a Comment