కొబ్బరి పచ్చడి .
కావలసినవి .
కొబ్బరి కాయ - 1 కాయను పగుల గొట్టి రెండు చిప్పలు పచ్చి కొబ్బరి కోరాముతో తురుము కోవలెను .
ఎండుమిరపకాయలు -- 8
పచ్చిమిరపకాయలు -- 5
చింతపండు -- ఉసిరి కాయంత . విడదీసుకుని నీటితో తడిపి ఉంచుకోవలెను.
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
బెల్లం -- చిన్న ముక్క ఇష్టం లేని వారు మానేయ వచ్చును .
పోపునకు --
నూనె -- మూడు స్పూన్లు
మినపప్పు -- స్పూను
మెంతులు -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా .
తయారీ విధానము .
కొబ్బరి కోరాముతో కోరుకుని సిద్ధంగా ఉంచుకోవాలి .
దాని పైన కొద్దిగా పసుపు వేయండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేగగానే తొడిమలు తీసిన పచ్చిమిర్చి కూడా వేసి ఒక నిముషం ఉంచి దింపుకోవాలి .
ఇప్పుడు రోటి లో ఎండుమిర్చి , పచ్చిమిర్చి , తడిపిన చింతపండు , చిన్న బెల్లం ముక్క మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.
తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మెత్తగా రుబ్బుకోవాలి.
చివరగా పోపు కూడా పచ్చడిలో వేసుకుని పోపు మరీ నలగకుండా ఒకసారి రుబ్బుకుని తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి భోజనము లోకే కాకుండా దోశెలు , పూరీలు మరియు చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది .
No comments:
Post a Comment