Wednesday, 1 November 2017

ఉసిరికాయ పచ్చడి

మా ప్రాంతాలలో ఉసిరిక పచ్చడి చేస్తారు. మరి ఉప్పుకలిపి ఉంచిన ఊరగాయ మడికి ఎట్లా పనికి వస్తుందని సందేహమా? దానికి కూడా మార్గాలు కనిపెట్టారు పెద్దవాళ్ళు.

కాయలను తరిగో దంచో మెత్తగా చేస్తాము కదా, అవి మూడవనాటికి బాగా మెత్తబడతాయి అప్పుడు ఆ మెత్తటి ముద్దను పెద్దపెద్ద వడియాలలాగా చేసి ఎండబెడతారు.

ఎండబెట్టే ముందరే మధ్యలో ఒక పురికొస పట్టేటంత రంధ్రం చేసి మరీ ఎండలో పెట్టి వడియాలలాగా గలగల ఎండేదాకా ఉంచి అప్పుడు ఆ ఎండిన ఉసిరి వడియాలను తాడులో గుచ్చి దండలాగా చేసి గోడకు వేళ్ళాడతీస్తారన్న మాట. పచ్చడి చేసుకొనే గంట ముందు ఆ వడియం చిదిపి నీళ్ళల్లో వేస్తే మెత్తగా అయిపోతుంది.

అందులో ఇంగువ మెంతులతో తిరగమాత వేస్తే........ ఆహా నోట్లో నీరూరుతుంది కదా. పెళ్ళయి వచ్చిన కొత్తల్లో వంటింట్లో సీలకు వేళ్ళాడేసిన వడియం దండను చూసి, ఇదేమిటి పిడకలు వంటింట్లో పెట్టుకున్నారు అని బోల్డు హాశ్చర్యపోయాను.

మరొక మినహాయింపు. కార్తికమాసంలో ద్వాదశి రోజు ఉసిరిక కాయ సగానికి కోసి తులసి దగ్గర దీపాలు పెట్టటం కొమ్మ తులసికోటలో పెట్టి పూజచేయటం మీకందరికీ తెలిసిందే కదా!. కాని........ ఆ రాత్రి తప్పనిసరిగా ఉసిరిక పచ్చడితో భోజనం చేయాలట. ఆ రోజు కూడా ఈ వడియాంతోనే పచ్చడి.

సరే ఉపోద్ఘాతం అయింది కదా!  ఓస్ ఇంతేనా, మాక్కూడా తెలుసోయ్ అని అంటారు కాని తెలియని వాళ్ళ కోసం.

1. ఒకప్పుడు........ ఉసిరిక్కాయలను కడిగి ఆరిన తరువాత రోట్లో వేసి ఇనప పొన్ను ఉన్న రోకలితో చాలా జాగ్రత్తగా గింజ నలక్కుండా దంచి, చేటలో చెరిగి గింజలు ఏరి అంటుకున్న తొక్కు ఊడే దాకా మళ్ళీమళ్ళీ ఇదే ప్రొసీజరు. మధ్యమధ్యలో ఇనప పొన్ను నీలంగా అవుతుంటుంది. అంటే తుప్పొస్తుందన్నమాట. మాటిమాటికి ఆ పొన్ను శుభ్రమైన బట్టతో తుడవాలి. ఎంత తలకాయ నొప్పో కదా.
2. మా తరం...... రోలూ రోకలి అవతల పారేసి కత్తిపీట నుండి కత్తి దాకా ఏదైనా ఫరవాలేదు, గింజకు అంటుకున్న పెచ్చు చివరంటా తరిగేసి మొత్తమంతా మిక్సీలో తిప్పేయటమే. ఖతం.
3. ఈ తరం.......... అయిదేళ్ళ క్రితం అట్లా చాకుతో తరుగుతుంటే, అవి నాటు కాయలు, ఈ రోజుల్లో వచ్చే హైబ్రిడ్ నిమ్మకాయంత సైజువి కాదు. తరుగుతూ...తూ...తూఉంటే, వేలుకు బొబ్బరావటం చితికి పుండవటం నరకం చూపించింది.

ఇహ అట్లా కాదని ఒక చిన్న ట్రయల్ వేసా. ఓ పదికాయలు, బౌల్ లో వేసి మైక్రోవేవ్ లో పెట్టి నాలుగు నిమిషాలకు తీసేటప్పటికి చక్కగా మెత్తబడ్డాయి. చల్లారితే మళ్ళీ గట్టి పడతాయి. వేడి మీదనే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి గుండ్రాయిలాంటి పరికరంతో దెబ్బకొట్టగానే, నా సామిరంగా ఎంచక్కా ముక్కలకు ముక్కలు, గింజ విడిపోయాయి.

ఇంక ఆనందం పట్టలేక మిగిలిన కాయలన్ని డిటో. కాని.........ఉడికీ ఉడకనట్టున్న ఉసిరికతో పచ్చడి నిలువ ఉంటుందా అని భయంతో విడిగానే పెట్టాను. ఆహా ఏం రుచి అనిపించేలా వచ్చింది పచ్చడి. అప్పటి నుండి అదే పద్ధతి. ఐదు కిలోల కాయలు అరగంటలో జాడీకెక్కేసాయి.

నూనెలో వూరబెట్టే ఉసిరి ఆవకాయకు కూడా ఎక్కువగా నూనె పట్టకుండా ఉండాలంటే కూడా ఇదే చిట్కా. ముందుగా మైక్రోవేవ్ లో మెత్తబడ్డాక నూనెలో వేస్తే అట్టే నూనె పీల్చదు.

అట్లా గింజలు సులభంగా విడదీసి ముక్కలతో ఎంచక్కా ఆవకాయ పెట్టేసుకోవచ్చు.

No comments:

Post a Comment