Tuesday 21 November 2017

పచ్చి మిరపకాయల కారం

కావలసినవి .

పచ్చి మిరపకాయలు  --  100  గ్రాములు .
చింతపండు  --  నిమ్మకాయంత
పదినిముషాలు  తడిపి  ఉంచుకోవాలి .
కొత్తిమీర  --  ఒక  కట్ట  బాగు చేసుకోవాలి .
ఉప్పు  -- తగినంత

పోపుకు .

నూనె  --  అయిదు  స్పూన్లు .
ఎండుమిరపకాయలు  --  4  ముక్కలు గా  చేసుకోవాలి
మెంతులు  --  పావు  స్పూను
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
బెల్లం  --  చిన్న ముక్క. కారం తగ్గుతుంది .
ఇష్టపడని వారు మానేయవచ్చును.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు .
పసుపు  --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  పచ్చిమిరపకాయలు  తొడిమలు  తీసుకోవాలి .

స్టౌ  మీద  బాండి  పెట్టి రెండు  స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే   పావు స్పూను   మెంతులు  వేసి  వేయించుకుని  విడిగా  పెట్టుకోవాలి .

ఆ తర్వాత  అదే  బాండీలో  పచ్చిమిరపకాయలు  వేసి  మూత పెట్టి  మగ్గనివ్వాలి .

తర్వాత  మళ్ళీ  బాండీ  పెట్టి  మూడు   స్పూన్లు  నూనె వేసి  వరుసగా ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  వేయించుకుని  పక్కన  పెట్టుకోవాలి .

ఇప్పుడు  రోటిలో లో  ఒకసారి  వేయించిన  మెంతులు వేసుకుని  మెత్తగా  పచ్చడి బండతో నూరుకోవాలి .

ఆ తర్వాత  మగ్గపెట్టిన  పచ్చిమిర్చి , చింతపండు , కొద్దిగా  పసుపు, చిన్న బెల్లం  ముక్క  మరియు సరిపడా ఉప్పు వేసి  మెత్తగా  బండతో దంపుకుని నూరుకోవాలి.

ఆ తర్వాత  శుభ్రం చేసిన  కొత్తిమీర  వేసి   బండతో నూరుకోవాలి..

తర్వాత ఒక  గిన్నెలో కి  తీసుకోవాలి .

తర్వాత  ఫోటోలో  చూపిన విధంగా  పైన  పోపు  వేసుకుని  పచ్చడిలో  స్పూను తో కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  పచ్చిమిరపకాయల  కారం  రెడీ .

ఈ పచ్చడి నాలుగు  రోజులు  నిల్వ ఉంటుంది.

ఇడ్లీ, దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము  లోకి చాలా రుచిగా  ఉంటుంది .

No comments:

Post a Comment