ఆలూరుకృష్ణప్రసాదు .
తెలగ పిండి అంటే నువ్వులు గానుగ లో నూనె ఆడాక వచ్చే పిండిని తెలగ పిండి అంటారు .
గోదావరి జిల్లాలలో దాదాపుగా ప్రతి ఇంటిలో ఈ తెలగ పిండితో కూర చేసుకుంటారు .
నువ్వులు శుభ్రం చేసి గానుగలో నూనె ఆడితే , తెలగపిండిలో ఇసుక తగలదు .
అందువలన శుభ్రం చేసి నూనె ఆడిన గానుగల్లో తెలగ పిండి తెచ్చుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది .
మరి ఈ తెలగ పిండి కూర ఏ విధముగా తయారు చేస్తారో తెలుసుకుందాం .
తెలగపిండి కూర .
నువ్వుల నూనె తీసాక వచ్చిన నువ్వుల పొట్టును తెలగపిండి అంటారు.
ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.
సాధారణంగా గానుగ లో నూనె ఆడిన కొట్లలో ఇది దొరుకుతుంది.
బాలింతలకు పాలు బాగా పడతాయని ఈ కూరను బాలింతలతో బాగా తినిపిస్తారు.
పత్యానికి, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.
ఈ కూర తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము.
1కప్పు తెలగపిండి కి 1.5 కప్పు నీరు తీసుకోవాలి.
నీటిలో చిటికెడు మెంతులు, చిన్న బెల్లం ముక్క, అర చెంచా కారం, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి.
మరుగుతున్న నీటిలో తెలగపిండి వేసి, బాగా కలిపి, సిమ్ లో మూత పెట్టి, పిండి విరవిరలాడుతూ విడిపోయే దాకా ఉడకనివ్వాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసి, అందులో అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, స్పూనున్నర మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి ముక్కలు గా చేసుకుని కాగిన నూనెలో వేసి, పోపు వేగాక ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు, మూడు రెమ్మలు కరివేపాకు వేసి, వేగనిచ్చి, అందులో ఉడికిన తెలగపిండి వేసి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.
చక్కని సువాసనలతో తెలగపిండి కూర సిద్ధం.
వెల్లుల్లి వాడని వారు మరియు ఇష్టపడని వారు వెల్లుల్లి వేయకుండా చేసుకొనవచ్చును .
అంతే ఎంతో రుచిగా ఉండే తెలగపిండి కూర సర్వింగ్ కు సిద్ధం.