Wednesday, 27 June 2018

కొత్తిమీర పచ్చడి

కొంచెం  వెరైటీగా పచ్చిమిర్చి  కొత్తిమీర  పచ్చడి .

తయారీ విధానము.

చిన్నవి అయితే రెండు కట్టలు , పెద్దది  ఒక  కట్ట కొత్తిమీర  శుభ్రం చేసుకుని  వలుచుకుని  ఉంచుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు  పదిహేను నిముషాల  ముందు  కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టకుని  అర గ్లాసు రసం చిక్కగా  తీసుకోవాలి .

ఒక  15  పచ్చిమిరపకాయలు  తొడిమలు  తీసుకుని  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె  వేసి  స్పూను  చాయమినపప్పు , పావు స్పూను  మెంతులు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ వేసి పోపు వేగగానే  పోపులో పచ్చిమిరపకాయలు  , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు మరియు  చింతపండు  రసం  వేసి మూత పెట్టి  అయిదు నిముషాలు  చింతపండు  రసంలో పచ్చిమిరపకాయలు  మగ్గనివ్వాలి .

తర్వాత  కొత్తిమీర  కూడా  పోపులో వేసి మూడు నిముషాలు  వేసి  మగ్గనిచ్చి  దింపుకోవాలి .

చల్లారగానే  ఈ మిశ్రమము మొత్తము  రోటిలో  వేసి పచ్చడి బండతో మెత్తగా నూరుకోవాలి .

ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు .

ఈ పచ్చడి  ఇడ్లీ , దోశెలు, గారెలు  మరియు  భోజనము  లోకి  కూడా చాలా రుచిగా  ఉంటుంది .

No comments:

Post a Comment