Wednesday, 8 July 2020

పనస పొట్టు కూర

కూర కాయలు  మరియు  పండు కాయలు  రెండూ  వేరుగా  ఉంటాయి. కూరకు  పనికి  వచ్చే  పనస కాయల  కణుపులు  దగ్గరగా  ఉంటాయని , అదే  పండుకు పనికి  వచ్చే  కాయల కణుపులు  కాస్త  ఎడంగా  దూరంగా  ఉంటాయని అంటారు.

పొట్టు  కొట్టగానే  పనస పొట్టు పైన  వెంటనే  కొద్దిగా  నూనె , పసుపు  మరియు  కొద్దిగా  ఉప్పును  వేసుకుని  చేతితో  పొట్టు  అంతటికీ  బాగా పట్టించాలి. అలా పట్టించకపోతే  పనసపొట్టు  వెంటనే  కనరు  వస్తుంది.  కూరకు  పనికి  రాదు. చేసుకున్నా  బాగుండదు.
ఇళ్ళ వద్దకు  వచ్చి అమ్మే వాళ్ళు   గిద్దలు  లెక్కన  అమ్ముతారు. షుమారుగా  గిద్ద రూ. 15 /- లకు  అమ్ముతారు. మనం ఇంటి వరకు  అయితే ,  రెండు గిద్దలు  పొట్టు  కొంటే  కూర  చేసుకున్నాక  చాలా  అవుతుంది. రెండు  గిద్దల  పొట్టు  ఈనాటి  కొలతల ప్రకారము  షుమారుగా  పావుకిలో  అనగా  250 గ్రాములు  ఉండవచ్చును.

కూర పనసకాయను  తెచ్చుకుని , పనస కాయ జిగురు అంటకుండా  చేతికి  నూనె  రాసుకుని  కత్తిపీటతో  పైన  చెక్కు తీసేసి  చిన్న చిన్న ముక్కలుగా  తరుగుకుంటాము. వెంటనే  ఈ ముక్కలకు  కనరు రాకుండా  పసుపు , నూనె  మరియు కొద్దిగా  ఉప్పు పట్టిస్తాము.

వెంటనే  ముక్కలను  మిక్సీలో  వేసుకుని  మరీ  మెత్తగా  కాకుండా   కచ్చాపచ్చాగా మిక్సీ  వేసుకుంటాము.

పనస పొట్టు  కూర.
*****************
కావలసినవి .
పనస పొట్టు  -  250 గ్రాములు.
చింతపండు  -  40 గ్రాములు.
చింతపండును  విడదీసుకుని , గింజలను మరియు ఈనెలను  తీసి వేసుకుని , ఒక పావుగంట సేపు  వేడి నీళ్ళలో  నానబెట్టుకుని , ఒక అర కప్పు చిక్కని  రసం తీసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పనస పొట్టు  కూర  తయారు  చేయబోయే  ముందే  కూరలో  పెట్టుకోవడానికి  ఆవ ను  సిద్ధం  చేసుకోవాలి . పనస పొట్టు  కూరకు  ఆవ పెడితేనే  కూరకు  అసలు సిసలు  రుచి  వస్తుంది.

ముందుగా  అన్నీ సిద్ధం చేసుకున్నాకే  పనస పొట్టుకూర తయారు చేసుకోవాలి .

ఆవ  తయారు  చేసుకోవడం.
*************************

ఆవాలు  ఒక స్పూను , పచ్చిమిర్చి  ఒకటి , ఎండు మిర్చి  ఒకటి , పసుపు కొద్దిగా , ఉప్పు కొద్దిగా  మిక్సీలో  మెత్తగా  వేసుకుని తర్వాత అందులోనే  కొద్దిగా  నీళ్ళు పోసుకుని మిక్సీలో  మెత్తగా  తిప్పుకుని  ఆవను  సిద్ధం  చేసుకుని ,  ఒక కప్పు లోకి  తీసుకోవాలి .

ఇక  పనస పొట్టు కూర తయారు చేసుకునే  ముందు  సిద్ధం  చేసుకోవలసిన  మిగిలినవి .

మినప్పిండి చిన్న వడియాలు -  ఒక అర కప్పు తీసుకుని ,  నూనెలో మాడకుండా బంగారు రంగులో వేయించుకుని  విడిగా  ఉంచుకోవాలి .

పచ్చిమిరపకాయలు  - 6
తొడిమలు  తీసి  నిలువుగా  ముక్కలు  తరిగి  ఉంచుకోవాలి ,

కరివేపాకు  -  నాలుగు  రెమ్మలు .
ఆకు  దూసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పోపునకు:

ఎండుమిరపకాయలు -  8
ముక్కలుగా చేసుకోవాలి .
నూనె  -  ఆరు  స్పూన్లు.
పచ్చిశనగపప్పు - మూడు  స్పూన్లు.
చాయమినపప్పు - స్పూనున్నర.
ఆవాలు  -  స్పూను.
ఇంగువ  -  పావు  స్పూను లో సగం.
కారము  -  స్పూను .
పసుపు  -  పావు స్పూను.
ఉప్పు  -  తగినంత .

ముందుగా  పనస పొట్టులో  కొద్దిగా  నూనె , కొద్దిగా  పసుపు  మరియు  కొద్దిగా ఉప్పు  వేసుకోవాలి.  చేతితో  బాగా కలుపు కోవాలి.

పనసపొట్టులో  తగినన్ని  నీళ్ళు పోసి స్టౌ  మీద పెట్టి  మెత్తగా  ఉడికేవరకు  ఉడకబెట్టుకోవాలి .

తర్వాత  ఉడికిన పనస పొట్టును  వార్చుకోవాలి.  పొట్టులో  నీళ్ళు  లేకుండా  పైన  పళ్ళెం పెట్టి  గట్టిగా  నొక్కుకోవాలి.

ఈ  ఉడికిన పనస పొట్టును  వేరుగా  ఒక  పళ్ళెంలోకి  తీసుకోవాలి .

పైవన్నీ  సిద్ధం చేసుకున్న తర్వాత  --

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టుకుని  మొత్తము  నూనెను  వేసుకుని  నూనెను  బాగా  కాగనివ్వాలి.

నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండు మిరపకాయల  ముక్కలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు   మరియు కరివేపాకును  వేసుకుని  పోపు  వేయించుకోవాలి.

వేయించిన  పోపులోనే  చింతపండు  రసము , పసుపు  , తగినంత  ఉప్పు  మరియు  కారమును  వేసుకుని  అందులోనే  ఉడికించిన  పనస పొట్టును కూడా వేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిముషాలు పాటు కూరను  మగ్గ నివ్వాలి.

ఇప్పుడు  స్టౌ ఆపి  నూరి  సిద్ధముగా  ఉంచుకున్న ఆవ ,  కూర  మీద వేసుకుని  , ఆవపై  ఒక  స్పూను  పచ్చి నూనె  వేసుకోవాలి . తర్వాత  గరిటెతో  ఆవ కూరంతటికీ  పట్టే  విధముగా  బాగా  కలుపుకోవాలి.

అంతే . మీకు  ఇప్పుడు  ఎంతో  రుచిగా  ఉండే  పనసపొట్టు  కూర  సిద్ధమైంది.

వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న  చిట్టి  మినప వడియాలు  కూర వడ్డించుకునే  ముందు  కూరలో  వేసుకుని  ఒకసారి  గరిటెతో  కలుపుకుని  వడ్డించుకుంటే , తింటున్నప్పుడు  వడియాలు  మెత్తపడకుండా  కర కర లాడుతూ  చాలా రుచిగా  ఉంటాయి.

మినప వడియాలకు బదులుగా జీడిపప్పును  నేతిలో  వేయించి  కూరలో  కలుపుకోవచ్చు.. 

వేరు శనగ గుళ్ళు వేస్తే మాత్రము  పనసపొట్టు కూరలో  బాగుండదు.

No comments:

Post a Comment