Saturday 18 July 2020

తెలగపిండి కూర

తెలగ పిండి అంటే  నువ్వులు గానుగ లో  నూనె  ఆడాక  వచ్చే  పిండిని  తెలగ పిండి  అంటారు .

నువ్వులను  శుభ్రం  చేసి  గానుగలో  నూనె ఆడితే , తెలగపిండిలో  ఇసుక తగలదు .

అందువలన  శుభ్రం   చేసి  నూనె  ఆడిన   గానుగల్లో  తెలగ పిండి   తెచ్చుకుంటే  కూర  చాలా రుచిగా  ఉంటుంది .
ఇందులో ఫైబర్  అధికంగా ఉంటుంది.

సాధారణంగా  గానుగ లో నూనె ఆడిన కొట్లలో ఇది దొరుకుతుంది.

బాలింతలకు  పాలు బాగా పడతాయని ఈ కూరను  బాలింతలతో బాగా తినిపిస్తారు.
 
పత్యానికి, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

తయారీ విధానం
 
1కప్పు తెలగపిండి కి 1.5 కప్పు నీరు తీసుకోవాలి.

నీటిలో చిటికెడు మెంతులు, చిన్న బెల్లం ముక్క, అర చెంచా కారం, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి. 

మరుగుతున్న నీటిలో తెలగపిండి వేసి, బాగా కలిపి, సిమ్ లో మూత పెట్టి, పిండి విరవిరలాడుతూ విడిపోయే దాకా ఉడకనివ్వాలి. 

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసి, అందులో అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, స్పూనున్నర మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి ముక్కలు గా చేసుకుని  కాగిన నూనెలో వేసి, పోపు వేగాక మూడు రెమ్మలు కరివేపాకు వేసి, వేగనిచ్చి, అందులో ఉడికిన తెలగపిండి వేసి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.

చక్కని సువాసనలతో తెలగపిండి కూర సిద్ధం.

********

మునగాకు తెలగపిండితో కరోనా దూరం !
అనంతసాహితి -ఆయుర్వేదం జీవన వేదం-001

‘‘ఆషాఢమాసం ఆషాఢభూతిగాడు పోవాలంటే మునగాకు తెలగపిండి కలిపి తినాలి.‘‘ ఇది మా గురుపత్నిగారు ప్రతి ఏడాదీ చెప్పేవారు. ఆమె ఆషాఢమాసంలో ప్రయత్నించేవారు కూడా. అయితే రెండూ దొరికేవి కావు. 
గానుగ నుంచీ వచ్చే తెలగపిండిలో అనేక పోషక విలువలు ఉండేవి. ముఖ్యంగా ఫైబర్ అనే పీచుపదార్థం ఉంటుంది. నూనె ఆడించేటప్పుడు వచ్చిన తెలగపిండిని ఏడాది పొడవునా అనేక వంటల్లో వాడేవారు. నేడు మిల్లు నూనెలల వలన కేవలం పిప్పి మాత్రమే తెలగపిండిలో వస్తోంది. కేవలం పిప్పి మాత్రమే కనుక దాన్ని పశువులకు వేస్తున్నారు. చెక్క దొరక్కపోవడంతో, మునగాకు కూడా ఉనికి కోల్పోయింది. మునగాకు, తెలగపిండి గతి తప్పడంతో సర్వరోగాలూ మనల్ని చుట్టుముడుతున్నాయి.

ఆషాఢమాసంలో ఆకలి ఎక్కువ వేస్తుందని అరుగుదల బలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మునగాకు, నువ్వుల తెలగచెక్క వండుకొని తినేవారు.  ఆయుర్వేదంలో నువ్వులలో ఉన్న పోషకాల విలువలు మరే వస్తువులోనూ ఇవ్వలేదు. వస్తుగుణదీపిక ఎప్పుడూ కంచిపరమాచార్య నాలుకపై ఉండేది.  అలాగే ఆకుకూరల్లో మునగాకు మహత్తరమైందని ప్రపంచాన్ని దోచుకుతింటున్న ఆంగ్ల వైద్యులు గుర్తించారు. కానీ వీటిని తింటే తమ లక్షల కోట్లాది రూపాయల విటమిన్ల మాత్రలు ఎవరు కొంటారు. కనుక ఈ ప్రచారాన్ని తొక్కిపెట్టారు. మా గురుపత్ని వంటి పూర్వతరాలు పోవడంతో నేడు ఈ ఆరోగ్య రహస్యం తెలిసిన వారు కూడా లేకుండాపోయి మునగాకు తింటారా? ఎలా వండాలనే తరాలు బయల్దేరాయి.
 
హిందీ ప్రాంతాల్లో  నువ్వులతో చేసిన అనేక తినుబండారాలు షాపుల్లో, తోపుడు బళ్ళమీదా ఉంటాయి. చిన్నపిల్లల నుంచీ ముసలి వారు వరకూ వాటిని చిరుతిళ్ళ రూపంలో తింటారు. ఇనుము ఉందని రక్తధాతువుకు ముఖ్యమని చాలా మంది ఆయుర్వేద వైద్యులు అనేవారు. కనుకనే బాలికలు యుక్తవయస్కులు అయ్యే తరుణంతో పనిగట్టుకొని చిమ్మిలి తినిపించేవారని ఇది తినని వారు శూలలకు గురై జీవితాంతం బాధపడతారని గతించిపోయిన బామ్మలు చెప్పేవారు. ఈ అలవాటు తప్పడంతో అసలు యుక్తవయస్సు రావడంలోనే సమస్యలు మొదలు అవుతున్నాయనే వారు లేకపోలేదు. నువ్వులు సేవించే బాలికలు 100 శాతం ఆరోగ్యంగా ఉండడం పల్లెటూళ్ళలో నేటికీ ఉంది. ప్రభుత్వం పాఠశాల బాలికలకు నువ్వులు బెల్లంతో తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించడం శాస్త్ర రీత్య, ఆరోగ్యరీత్యా మంచిదే. చేయడం కూడా తేలిక.

ఆయుర్వేదం ఉపదేశించిన నువ్వుల నూనె, తెలగపిండి, మునగాకు సేవించే వారిని రోగాలు సోకవు. అద్భుతమైన రోగనిరోధక శక్తి రోగాలు చుట్టుముట్టే ఆషాఢాది వర్షాకాలాలలో కలుగుతుంది. 

మునగాకు పొడి రూపంలో ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతోంది. దీన్ని కూరల్లో వాడితే మంచిఫలితం ఉంటుంది. మునగాకు దొరికితే, నువ్వుల వేయించుకొని పొడి చేసుకొని వాడినా మంచి రుచిగా, అంతులేని ఆరోగ్యం ఇస్తుంది. 

*********

No comments:

Post a Comment