వంకాయ , దొండకాయ మరియు బెండకాయ వంటి కూరల్లో వెరైటీగా ఆ కాయలలో పొడిని పెట్టుకుని కాయలపళంగా కూర చేసుకుంటాము .
ఈ కూర పొడి కొద్దిగా మార్పులు చేసుకుని కొట్టుకోవచ్చు.
అదేవిధంగా ఒకసారే కొట్టుకుని సీసాలో భద్రపరచుకుంటే నాలుగైదు సార్లకు వస్తుంది.
ఈ విధముగా కొట్టుకున్న పొడి సీసాలో భద్రపర్చుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మూడు నెలల వరకు తాజాగా ఉంటుంది .
మొదటి విధానము .
ఈ పొడి మసాలా టచ్ లేకుండా మామూలుగా ఉంటుంది .
ఎండుమిరపకాయలు -- 25
పచ్చిశనగపప్పు -- 50 గ్రాములు
చాయమినపప్పు -- 50 గ్రాములు
జీలకర్ర -- మూడు స్పూన్లు .
నూనె -- నాలుగు స్పూన్లు .
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి , నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు ( తొడిమలు తీసి ) , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు మరియు జీలకర్ర వేసుకుని మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .
కొద్దిగా చల్లారగానే తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .
రోటి సౌకర్యము ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో దంపుకుంటే రెట్టింపు రుచిగా ఉంటుంది.
తర్వాత సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .
అవసరయయినప్పుడు ఫ్రిజ్ లో నుండి తీసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు కలుపుకుని , కూరల్లో పెట్టుకుని , కాయలను నూనెలో వేయించుకోవాలి.
రెండవ విధానము .
కొద్దిగా మసాలా కూరలా చేసుకోవాలంటే ----
కావలసినవి .
ఎండుమిరపకాయలు -- 25
పచ్చిశనగపప్పు -- 50 గ్రాములు
చాయమినపప్పు -- 50 గ్రాములు
ధనియాలు -- 20 గ్రాములు
జీలకర్ర -- రెండు స్పూన్లు
ఎండుకొబ్బరి -- పావు చిప్ప . చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
కరివేపాకు -- అయిదు రెమ్మలు .
నూనె -- నాలుగు స్పూన్లు
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు, జీలకర్ర , ఎండుకొబ్బరి ముక్కలు మరియు కరివేపాకు వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకుని చల్లారగానే మిక్సీ లో వేసి , తగినంత ఉప్పువేసి మరీ మెత్తగా కాకుండా పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .
రోటి సౌకర్యం ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో పప్పులు తగిలే విధముగా దంపుకుంటే ఈ మసాలా కూర పొడి చాలా రుచిగా ఉంటుంది .
తర్వాత సీసాలో భద్రపర్చుకుని , ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .
అవసరమైనప్పుడు ఫ్రిజ్ లోనుండి తీసుకుని అవసరమైన యెడల కొద్ది ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టుకోవాలి .
ఈ కూరపొడి కూడా రెండు నెలల పైన నిల్వ ఉంటుంది .
మనం కూరల్లో కూరే ముందు పొడి నాలుక పై వేసుకుని రుచి చూస్తే ఉప్పగా తగిలితే వేగిన కూరలో సరిపోతుంది .
No comments:
Post a Comment