Tuesday, 21 July 2020

బీరకాయ పచ్చడి

కావలసినవి.
  
లేత బీరకాయలు --  మూడు.
పచ్చిమిరపకాయలు  -- 6 
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత .
కొత్తిమీర   --  ఒక చిన్న కట్ట
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 

పోపునకు .

నూనె --  ఐదు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  --  6
మినపప్పు  --  స్పూను. 
మెంతులు --  పావు స్పూను 
ఆవాలు --  అరస్పూను
జీలకర్ర  --  పావు స్పూను 
ఇంగువ  --  కొద్దిగా 
కరివేపాకు  --  మూడు రెమ్మలు

తయారుచేయు  విధానము .

పదినిముషాల ముందు చింతపండు  విడదీసి కొద్దిగా  నీళ్ళలో  తడిపి ఉంచుకోవాలి .

బీరకాయలు పై చెక్కు  తీసుకుని  ముక్కలుగా తరిగి  ఉంచుకోవాలి.

స్టౌ  వెలిగించి బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  బీరకాయ ముక్కలు, కొద్దిగా  పసుపు ,   మరియు పచ్చిమిరపకాయలు  వేసి  మూతపెట్టి  బీరకాయలను  బాగా  మగ్గనివ్వాలి .

బీర కాయ ముక్కలు మగ్గిన తరువాత వాటిని  వేరే ప్లేటులో  తీసుకోవాలి .

మరల స్టౌ వెలిగించి బాండి పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు పెట్టుకోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు , పచ్చిమిరపకాయలు , మరియు తగినంత  ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి . 

తర్వాత  బీరకాయముక్కలు , మిగిలిన  పోపు  మరియు కొత్తిమీర  వేసి  ఒకసారి  మిక్సీ  వేసుకోవాలి.

పచ్చి మిరపకాయల కారం

కావలసినవి .

పచ్చిమిరపకాయలు  -   150 గ్రా
చింతపండు   -  40  గ్రా
ఉప్పు   --  తగినంత 
బెల్లం   -   చిన్న ముక్క (  ఇష్టం  లేని వారు  మానేయవచ్చు . ) 
పసుపు  -   కొద్దిగా 
నూనె  --   అయిదు  స్పూన్లు 

పోపుకు .

పొట్టు  మినపప్పు /  లేదా 
చాయమినపప్పు   --    స్పూనున్నర  .
ఆవాలు  -   అర స్పూను 
మెంతులు  --  పావు  స్పూను 
ఇంగువ  --   మరి  కాస్త 

తయారీ  విధానము .

పచ్చిమిర్చి   తొడిమలు  తీసి  కడిగి తడి లేకుండా   ఆర నివ్వాలి .

స్టౌ  మీద  బాండీ పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా  కాగగానే   పచ్చిమిర్చి   మరియు  పసుపు  వేసి  మూత పెట్టు  కోవాలి.

మూత  పెట్టకపోతే  పచ్చిమిర్చి   పేలతాయి.
 
మూడువంతులు  పైగా  మగ్గాక   దింపుకోవాలి.

చింతపండు   విడదీసుకుని  ఉంచుకోవాలి .

తర్వాత  స్టౌ  మిద  బాండీ  పెట్టి మిగిలిన  రెండు  స్పూన్లు  నూనె  వేసి 
మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  వేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  కారం  కాబట్టి  పోపులో  ఎండుమిర్చి   వేయనక్కరలేదు .

ఇప్పుడు  మిక్సీ లో  మగ్గబెట్టిన  పచ్చిమిర్చి , చింతపండు ,  సరిపడా ఉప్పు మరియు చిన్న బెల్లం ముక్క( ఇష్టమైన వారు  ) వేసి   మరీ మెత్తగా  కాకుండా  కొంచెం  కచ్చా పచ్చాగా మిక్సీ  వేసుకోవాలి.

చివరగా  పోపు కూడా  వేసి  పచ్చడి  మరోసారి మిక్సీ  వేసుకోవాలి .

ఇష్టమైన వారు  తిరిగి  పైన పోపు  వేసుకొనవచ్చు.

చింతపండు   సమంగా  పడకపోతే  కారంగా  ఉంటుంది . అందువలన చింతపండు  సరిపడా  చూసి వేసుకోండి .

ఇది  అచ్చంగా  పచ్చి మిరపకాయల  కారం  కాబట్టి   కొత్తిమీర , కరివేపాకు వంటివి   వెయ్యము. కావాలనుకుంటే  వేసుకోవచ్చు.

Saturday, 18 July 2020

తెలగపిండి కూర

తెలగ పిండి అంటే  నువ్వులు గానుగ లో  నూనె  ఆడాక  వచ్చే  పిండిని  తెలగ పిండి  అంటారు .

నువ్వులను  శుభ్రం  చేసి  గానుగలో  నూనె ఆడితే , తెలగపిండిలో  ఇసుక తగలదు .

అందువలన  శుభ్రం   చేసి  నూనె  ఆడిన   గానుగల్లో  తెలగ పిండి   తెచ్చుకుంటే  కూర  చాలా రుచిగా  ఉంటుంది .
ఇందులో ఫైబర్  అధికంగా ఉంటుంది.

సాధారణంగా  గానుగ లో నూనె ఆడిన కొట్లలో ఇది దొరుకుతుంది.

బాలింతలకు  పాలు బాగా పడతాయని ఈ కూరను  బాలింతలతో బాగా తినిపిస్తారు.
 
పత్యానికి, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

తయారీ విధానం
 
1కప్పు తెలగపిండి కి 1.5 కప్పు నీరు తీసుకోవాలి.

నీటిలో చిటికెడు మెంతులు, చిన్న బెల్లం ముక్క, అర చెంచా కారం, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి. 

మరుగుతున్న నీటిలో తెలగపిండి వేసి, బాగా కలిపి, సిమ్ లో మూత పెట్టి, పిండి విరవిరలాడుతూ విడిపోయే దాకా ఉడకనివ్వాలి. 

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసి, అందులో అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, స్పూనున్నర మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి ముక్కలు గా చేసుకుని  కాగిన నూనెలో వేసి, పోపు వేగాక మూడు రెమ్మలు కరివేపాకు వేసి, వేగనిచ్చి, అందులో ఉడికిన తెలగపిండి వేసి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.

చక్కని సువాసనలతో తెలగపిండి కూర సిద్ధం.

********

మునగాకు తెలగపిండితో కరోనా దూరం !
అనంతసాహితి -ఆయుర్వేదం జీవన వేదం-001

‘‘ఆషాఢమాసం ఆషాఢభూతిగాడు పోవాలంటే మునగాకు తెలగపిండి కలిపి తినాలి.‘‘ ఇది మా గురుపత్నిగారు ప్రతి ఏడాదీ చెప్పేవారు. ఆమె ఆషాఢమాసంలో ప్రయత్నించేవారు కూడా. అయితే రెండూ దొరికేవి కావు. 
గానుగ నుంచీ వచ్చే తెలగపిండిలో అనేక పోషక విలువలు ఉండేవి. ముఖ్యంగా ఫైబర్ అనే పీచుపదార్థం ఉంటుంది. నూనె ఆడించేటప్పుడు వచ్చిన తెలగపిండిని ఏడాది పొడవునా అనేక వంటల్లో వాడేవారు. నేడు మిల్లు నూనెలల వలన కేవలం పిప్పి మాత్రమే తెలగపిండిలో వస్తోంది. కేవలం పిప్పి మాత్రమే కనుక దాన్ని పశువులకు వేస్తున్నారు. చెక్క దొరక్కపోవడంతో, మునగాకు కూడా ఉనికి కోల్పోయింది. మునగాకు, తెలగపిండి గతి తప్పడంతో సర్వరోగాలూ మనల్ని చుట్టుముడుతున్నాయి.

ఆషాఢమాసంలో ఆకలి ఎక్కువ వేస్తుందని అరుగుదల బలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మునగాకు, నువ్వుల తెలగచెక్క వండుకొని తినేవారు.  ఆయుర్వేదంలో నువ్వులలో ఉన్న పోషకాల విలువలు మరే వస్తువులోనూ ఇవ్వలేదు. వస్తుగుణదీపిక ఎప్పుడూ కంచిపరమాచార్య నాలుకపై ఉండేది.  అలాగే ఆకుకూరల్లో మునగాకు మహత్తరమైందని ప్రపంచాన్ని దోచుకుతింటున్న ఆంగ్ల వైద్యులు గుర్తించారు. కానీ వీటిని తింటే తమ లక్షల కోట్లాది రూపాయల విటమిన్ల మాత్రలు ఎవరు కొంటారు. కనుక ఈ ప్రచారాన్ని తొక్కిపెట్టారు. మా గురుపత్ని వంటి పూర్వతరాలు పోవడంతో నేడు ఈ ఆరోగ్య రహస్యం తెలిసిన వారు కూడా లేకుండాపోయి మునగాకు తింటారా? ఎలా వండాలనే తరాలు బయల్దేరాయి.
 
హిందీ ప్రాంతాల్లో  నువ్వులతో చేసిన అనేక తినుబండారాలు షాపుల్లో, తోపుడు బళ్ళమీదా ఉంటాయి. చిన్నపిల్లల నుంచీ ముసలి వారు వరకూ వాటిని చిరుతిళ్ళ రూపంలో తింటారు. ఇనుము ఉందని రక్తధాతువుకు ముఖ్యమని చాలా మంది ఆయుర్వేద వైద్యులు అనేవారు. కనుకనే బాలికలు యుక్తవయస్కులు అయ్యే తరుణంతో పనిగట్టుకొని చిమ్మిలి తినిపించేవారని ఇది తినని వారు శూలలకు గురై జీవితాంతం బాధపడతారని గతించిపోయిన బామ్మలు చెప్పేవారు. ఈ అలవాటు తప్పడంతో అసలు యుక్తవయస్సు రావడంలోనే సమస్యలు మొదలు అవుతున్నాయనే వారు లేకపోలేదు. నువ్వులు సేవించే బాలికలు 100 శాతం ఆరోగ్యంగా ఉండడం పల్లెటూళ్ళలో నేటికీ ఉంది. ప్రభుత్వం పాఠశాల బాలికలకు నువ్వులు బెల్లంతో తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించడం శాస్త్ర రీత్య, ఆరోగ్యరీత్యా మంచిదే. చేయడం కూడా తేలిక.

ఆయుర్వేదం ఉపదేశించిన నువ్వుల నూనె, తెలగపిండి, మునగాకు సేవించే వారిని రోగాలు సోకవు. అద్భుతమైన రోగనిరోధక శక్తి రోగాలు చుట్టుముట్టే ఆషాఢాది వర్షాకాలాలలో కలుగుతుంది. 

మునగాకు పొడి రూపంలో ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతోంది. దీన్ని కూరల్లో వాడితే మంచిఫలితం ఉంటుంది. మునగాకు దొరికితే, నువ్వుల వేయించుకొని పొడి చేసుకొని వాడినా మంచి రుచిగా, అంతులేని ఆరోగ్యం ఇస్తుంది. 

*********

Wednesday, 8 July 2020

పనస పొట్టు కూర

కూర కాయలు  మరియు  పండు కాయలు  రెండూ  వేరుగా  ఉంటాయి. కూరకు  పనికి  వచ్చే  పనస కాయల  కణుపులు  దగ్గరగా  ఉంటాయని , అదే  పండుకు పనికి  వచ్చే  కాయల కణుపులు  కాస్త  ఎడంగా  దూరంగా  ఉంటాయని అంటారు.

పొట్టు  కొట్టగానే  పనస పొట్టు పైన  వెంటనే  కొద్దిగా  నూనె , పసుపు  మరియు  కొద్దిగా  ఉప్పును  వేసుకుని  చేతితో  పొట్టు  అంతటికీ  బాగా పట్టించాలి. అలా పట్టించకపోతే  పనసపొట్టు  వెంటనే  కనరు  వస్తుంది.  కూరకు  పనికి  రాదు. చేసుకున్నా  బాగుండదు.
ఇళ్ళ వద్దకు  వచ్చి అమ్మే వాళ్ళు   గిద్దలు  లెక్కన  అమ్ముతారు. షుమారుగా  గిద్ద రూ. 15 /- లకు  అమ్ముతారు. మనం ఇంటి వరకు  అయితే ,  రెండు గిద్దలు  పొట్టు  కొంటే  కూర  చేసుకున్నాక  చాలా  అవుతుంది. రెండు  గిద్దల  పొట్టు  ఈనాటి  కొలతల ప్రకారము  షుమారుగా  పావుకిలో  అనగా  250 గ్రాములు  ఉండవచ్చును.

కూర పనసకాయను  తెచ్చుకుని , పనస కాయ జిగురు అంటకుండా  చేతికి  నూనె  రాసుకుని  కత్తిపీటతో  పైన  చెక్కు తీసేసి  చిన్న చిన్న ముక్కలుగా  తరుగుకుంటాము. వెంటనే  ఈ ముక్కలకు  కనరు రాకుండా  పసుపు , నూనె  మరియు కొద్దిగా  ఉప్పు పట్టిస్తాము.

వెంటనే  ముక్కలను  మిక్సీలో  వేసుకుని  మరీ  మెత్తగా  కాకుండా   కచ్చాపచ్చాగా మిక్సీ  వేసుకుంటాము.

పనస పొట్టు  కూర.
*****************
కావలసినవి .
పనస పొట్టు  -  250 గ్రాములు.
చింతపండు  -  40 గ్రాములు.
చింతపండును  విడదీసుకుని , గింజలను మరియు ఈనెలను  తీసి వేసుకుని , ఒక పావుగంట సేపు  వేడి నీళ్ళలో  నానబెట్టుకుని , ఒక అర కప్పు చిక్కని  రసం తీసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పనస పొట్టు  కూర  తయారు  చేయబోయే  ముందే  కూరలో  పెట్టుకోవడానికి  ఆవ ను  సిద్ధం  చేసుకోవాలి . పనస పొట్టు  కూరకు  ఆవ పెడితేనే  కూరకు  అసలు సిసలు  రుచి  వస్తుంది.

ముందుగా  అన్నీ సిద్ధం చేసుకున్నాకే  పనస పొట్టుకూర తయారు చేసుకోవాలి .

ఆవ  తయారు  చేసుకోవడం.
*************************

ఆవాలు  ఒక స్పూను , పచ్చిమిర్చి  ఒకటి , ఎండు మిర్చి  ఒకటి , పసుపు కొద్దిగా , ఉప్పు కొద్దిగా  మిక్సీలో  మెత్తగా  వేసుకుని తర్వాత అందులోనే  కొద్దిగా  నీళ్ళు పోసుకుని మిక్సీలో  మెత్తగా  తిప్పుకుని  ఆవను  సిద్ధం  చేసుకుని ,  ఒక కప్పు లోకి  తీసుకోవాలి .

ఇక  పనస పొట్టు కూర తయారు చేసుకునే  ముందు  సిద్ధం  చేసుకోవలసిన  మిగిలినవి .

మినప్పిండి చిన్న వడియాలు -  ఒక అర కప్పు తీసుకుని ,  నూనెలో మాడకుండా బంగారు రంగులో వేయించుకుని  విడిగా  ఉంచుకోవాలి .

పచ్చిమిరపకాయలు  - 6
తొడిమలు  తీసి  నిలువుగా  ముక్కలు  తరిగి  ఉంచుకోవాలి ,

కరివేపాకు  -  నాలుగు  రెమ్మలు .
ఆకు  దూసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పోపునకు:

ఎండుమిరపకాయలు -  8
ముక్కలుగా చేసుకోవాలి .
నూనె  -  ఆరు  స్పూన్లు.
పచ్చిశనగపప్పు - మూడు  స్పూన్లు.
చాయమినపప్పు - స్పూనున్నర.
ఆవాలు  -  స్పూను.
ఇంగువ  -  పావు  స్పూను లో సగం.
కారము  -  స్పూను .
పసుపు  -  పావు స్పూను.
ఉప్పు  -  తగినంత .

ముందుగా  పనస పొట్టులో  కొద్దిగా  నూనె , కొద్దిగా  పసుపు  మరియు  కొద్దిగా ఉప్పు  వేసుకోవాలి.  చేతితో  బాగా కలుపు కోవాలి.

పనసపొట్టులో  తగినన్ని  నీళ్ళు పోసి స్టౌ  మీద పెట్టి  మెత్తగా  ఉడికేవరకు  ఉడకబెట్టుకోవాలి .

తర్వాత  ఉడికిన పనస పొట్టును  వార్చుకోవాలి.  పొట్టులో  నీళ్ళు  లేకుండా  పైన  పళ్ళెం పెట్టి  గట్టిగా  నొక్కుకోవాలి.

ఈ  ఉడికిన పనస పొట్టును  వేరుగా  ఒక  పళ్ళెంలోకి  తీసుకోవాలి .

పైవన్నీ  సిద్ధం చేసుకున్న తర్వాత  --

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టుకుని  మొత్తము  నూనెను  వేసుకుని  నూనెను  బాగా  కాగనివ్వాలి.

నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండు మిరపకాయల  ముక్కలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు   మరియు కరివేపాకును  వేసుకుని  పోపు  వేయించుకోవాలి.

వేయించిన  పోపులోనే  చింతపండు  రసము , పసుపు  , తగినంత  ఉప్పు  మరియు  కారమును  వేసుకుని  అందులోనే  ఉడికించిన  పనస పొట్టును కూడా వేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిముషాలు పాటు కూరను  మగ్గ నివ్వాలి.

ఇప్పుడు  స్టౌ ఆపి  నూరి  సిద్ధముగా  ఉంచుకున్న ఆవ ,  కూర  మీద వేసుకుని  , ఆవపై  ఒక  స్పూను  పచ్చి నూనె  వేసుకోవాలి . తర్వాత  గరిటెతో  ఆవ కూరంతటికీ  పట్టే  విధముగా  బాగా  కలుపుకోవాలి.

అంతే . మీకు  ఇప్పుడు  ఎంతో  రుచిగా  ఉండే  పనసపొట్టు  కూర  సిద్ధమైంది.

వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న  చిట్టి  మినప వడియాలు  కూర వడ్డించుకునే  ముందు  కూరలో  వేసుకుని  ఒకసారి  గరిటెతో  కలుపుకుని  వడ్డించుకుంటే , తింటున్నప్పుడు  వడియాలు  మెత్తపడకుండా  కర కర లాడుతూ  చాలా రుచిగా  ఉంటాయి.

మినప వడియాలకు బదులుగా జీడిపప్పును  నేతిలో  వేయించి  కూరలో  కలుపుకోవచ్చు.. 

వేరు శనగ గుళ్ళు వేస్తే మాత్రము  పనసపొట్టు కూరలో  బాగుండదు.

Monday, 6 July 2020

మెంతికాయ


కావలసినవి.

పుల్లని గట్టి  పచ్చి మామిడి కాయ  --   ఒకటి.
ఎండుమిరపకాయలు  -  15
మెంతులు  -   స్పూనున్నర 
ఆవాలు  -  స్పూను
ఇంగువ  -  కొద్దిగా
పసుపు  -  పావు స్పూను 
ఉప్పు  -   తగినంత
నూనె  -   ఐదు  స్పూన్లు .

తయారీ విధానము.

ముందుగా  మామిడి  కాయను కడిగి శుభ్రంగా  తుడిచి  పై చెక్కు  తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.

స్టౌ మీద  బాండీ పెట్టి  మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు వేసి వేగ నివ్వాలి . తర్వాత అందులోనే  ఎండుమిరపకాయలు  , ఆవాలు  మరియు ఇంగువను  వేసుకుని పోపు  కమ్మని  వాసన వచ్ఛే వరకు  వేయించుకోవాలి.

చల్లారగానే  ఈ పోపును  మిక్సీ లో వేసుకుని , అందులోనే  తగినంత   ఉప్పును  వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఈ పొడిని  ఒక గిన్నెలోకి  తీసుకుని అందులోనే  పావు స్పూను  పసుపు ,  తరిగిన  మామిడి కాయ ముక్కలు  మరియు  రెండు స్పూన్లు  పచ్చి నూనెను వేసుకుని  స్పూనుతో  బాగా కలుపుకోవాలి.  మూతపెట్టి ఒక గంట సేపు కదలకుండా  ఉంచాలి. ముక్కలకు    కారం పట్టి  ఊరతాయి.

అంతే. ఎంతో రుచిగా ఉండే  మెంతి బద్దలు సర్వింగ్  కు సిద్ధం .

వారం రోజులు నిల్వ ఉండే ఈ మెంతి  బద్దలు భోజనం  లోకే  కాకుండా  చపాతీలు , దోశెలు , గారెలు మొదలైన అల్పాహారముల లోకి  కూడా చాలా రుచిగా ఉంటాయి.

Sunday, 5 July 2020

కూర పొడి

వంకాయ , దొండకాయ మరియు  బెండకాయ  వంటి కూరల్లో  వెరైటీగా   ఆ కాయలలో పొడిని  పెట్టుకుని  కాయలపళంగా  కూర  చేసుకుంటాము .

ఈ కూర పొడి  కొద్దిగా  మార్పులు  చేసుకుని  కొట్టుకోవచ్చు.

అదేవిధంగా  ఒకసారే  కొట్టుకుని  సీసాలో భద్రపరచుకుంటే  నాలుగైదు సార్లకు  వస్తుంది. 

ఈ విధముగా  కొట్టుకున్న పొడి  సీసాలో భద్రపర్చుకుని  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  మూడు నెలల వరకు తాజాగా  ఉంటుంది .

 మొదటి  విధానము .

ఈ పొడి  మసాలా  టచ్  లేకుండా  మామూలుగా  ఉంటుంది .

ఎండుమిరపకాయలు  --  25 
పచ్చిశనగపప్పు  --  50  గ్రాములు 
చాయమినపప్పు  --  50  గ్రాములు 
జీలకర్ర  --  మూడు స్పూన్లు .
నూనె  --  నాలుగు  స్పూన్లు .
ఉప్పు -- తగినంత 

తయారీ విధానము .

స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి , నూనె బాగా కాగగానే  ఎండుమిరపకాయలు (  తొడిమలు  తీసి  ) , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు  మరియు  జీలకర్ర  వేసుకుని  మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి .

కొద్దిగా  చల్లారగానే  తగినంత  ఉప్పు వేసి  మరీ మెత్తగా  కాకుండా  కొద్దిగా  పప్పులు  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

రోటి సౌకర్యము  ఉన్నవారు  రోటిలో  పచ్చడి బండతో  దంపుకుంటే  రెట్టింపు  రుచిగా ఉంటుంది.

తర్వాత  సీసాలో  భద్రపరుచుకుని  ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .

అవసరయయినప్పుడు ఫ్రిజ్ లో నుండి  తీసుకుని  అవసరమైతే  కొద్దిగా ఉప్పు కలుపుకుని ,   కూరల్లో  పెట్టుకుని , కాయలను  నూనెలో వేయించుకోవాలి.

రెండవ  విధానము .

కొద్దిగా  మసాలా  కూరలా  చేసుకోవాలంటే  ----

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --  25
పచ్చిశనగపప్పు  --  50  గ్రాములు 
చాయమినపప్పు  -- 50  గ్రాములు 
ధనియాలు  -- 20    గ్రాములు  
జీలకర్ర  --  రెండు స్పూన్లు 
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప . చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .
కరివేపాకు  --  అయిదు  రెమ్మలు .
నూనె  --  నాలుగు  స్పూన్లు 
ఉప్పు  --  తగినంత 

తయారీ విధానము .

ముందు  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె  వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు, జీలకర్ర , ఎండుకొబ్బరి ముక్కలు మరియు  కరివేపాకు  వేసి  కమ్మని  వాసన వచ్చేవరకు  వేయించుకుని  చల్లారగానే  మిక్సీ  లో వేసి , తగినంత  ఉప్పువేసి   మరీ మెత్తగా  కాకుండా  పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .

రోటి సౌకర్యం  ఉన్నవారు  రోటిలో  పచ్చడి  బండతో పప్పులు  తగిలే విధముగా దంపుకుంటే  ఈ మసాలా కూర పొడి   చాలా రుచిగా  ఉంటుంది .

తర్వాత  సీసాలో భద్రపర్చుకుని , ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి .

అవసరమైనప్పుడు  ఫ్రిజ్  లోనుండి తీసుకుని  అవసరమైన  యెడల కొద్ది ఉప్పు కలుపుకుని  కూరల్లో పెట్టుకోవాలి .

ఈ  కూరపొడి  కూడా  రెండు నెలల పైన  నిల్వ ఉంటుంది .

మనం కూరల్లో  కూరే ముందు  పొడి  నాలుక పై వేసుకుని  రుచి చూస్తే  ఉప్పగా  తగిలితే  వేగిన కూరలో సరిపోతుంది .

వంకాయ మెంతి కూర

కావలసిన  పదార్థములు.

లేత నీలం రంగు  వంకాయలు  ---
అర కిలో

పచ్చి శనగపప్పు  --  30  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

మెంతులు  ---  ఒక స్పూను .

జీలకర్ర  --  అర  స్పూను 

ఆవాలు  --  పావు  స్పూను 

ఇంగువ  --  కొద్దిగా 

ఎండు మిరపకాయలు  --  15

ఉప్పు  ---  తగినంత 

పసుపు  --  కొద్దిగా 

నూనె  --   150  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి 
ముందుగా  మెంతులు , ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , జీలకర్ర  , ఆవాలు ,  ఇంగువ  వేసి  మెంతులు  పచ్చి వాసన  పోయి  ,
పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు , కాస్త పసుపు , తగినంత  ఉప్పు వేసి ఫోటోలో చూపిన మాదిరిగా  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

వంకాయలు  కాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  , శుభ్రంగా  కడిగి  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి .

ముందుగా   సిద్ధం  చేసుకున్న  కూర  పొడి   కాయల్లో  కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు  పైన  జల్లు కోవడానికి  కాస్త  పొడి  విడిగా  ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  పొడి   కూరిన  వంకాయలు  వేసి  స్టౌ మీడియం  సెగన పెట్టి ,   వంకాయలు  మగ్గి  పొడి  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .

దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన పొడి  వేసి  వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే  మెంతి  వంకాయ కూర  భోజనము లోకి సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపి మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

Friday, 3 July 2020

గుత్తి కాకరకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

కాకరకాయ  కాయల పళంగా  కొబ్బరి  కారం  వేపుడు కూర.

కావలసినవి .

ముందు కొబ్బరి  కారానికి .

ఎండుమిరపకాయలు  -- 10  
పచ్చి  శనగపప్పు  --  మూడు స్పూన్లు .
చాయమినపప్పు  -  స్పూను
ధనియాలు  -  స్పూను 
జీలకర్ర  --  స్పూను .
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప . చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు  --  నాలుగు రెమ్మలు.

ఇవ్వన్నీ  నూనె  వేయకుండా  బాండిలో  కమ్మని వేపు  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీలో  వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని  మెత్తగా  పొడి  చేసుకోవాలి.

కాకరకాయలు  అరకిలో తీసుకుని  కాయ  మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి ,

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టి   150  గ్రాముల  నూనె వేసి  నూనె బాగా కాగగానే ముందుగా  కాకరకాయ లను  కాయల పళంగా నూనెలో వేసి  బాగా  ఎర్రగా వేగ నివ్వాలి .

తరువాత  సిద్ధంగా  ఉంచుకున్న  కొబ్బరి కారం పొడి  కాయలలో  కూరి , బాగా కాగుతున్న వేడి వేడి నూనె స్పూనున్నర  చొప్పునకారం కూరిన కాయలలో పోయాలి .

వెల్లుల్లి  ఇష్టమైన వారు  ఆరు  వెల్లుల్లి  రెబ్బలు  పొడిలో వేసుకుని మిక్సీ  వేసుకుంటే  ఈ కాకరకాయ  వేపుడు కూర చాలా రుచిగా  ఉంటుంది .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కాకరకాయ కాయల పళంగా  కొబ్బరి  కారం వేపుడు కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ వేపుడు  కూర వేడి వేడి  అన్నంలో నెయ్యి  వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .