Monday, 24 August 2020

పెసరపచ్చడి

 విధానము .

100  గ్రాముల పెసర పప్పును ఒక  గిన్నెలోకి తీసుకుని ఒకసారి  నీటితో  కడిగి , అందులో  పప్పు మునిగే  వరకు  నీళ్ళను పోసి  రెండు గంటల  సేపు  నాన బెట్టుకోవాలి.

తర్వాత  నీటిని  పారబోసి   పప్పును  వడగట్టు కోవాలి.

ఇప్పుడు  మిక్సీ లో  పది ఎండుమిరపకాయలు ,  ముప్పాను స్పూను జీలకర్ర , పావును స్పూనులో సగం ఇంగువను మరియు తగినంత  ఉప్పును   వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  అందులో  నానబెట్టిన పెసరపప్పును మరియు  కొద్దిగా  నీళ్ళు  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఈ పచ్చడిని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

పెసరపప్పు  అంటే ఏమిటని  కొందరు అడుగుతున్నారు. పై పొట్టు తీసిన పెసర పప్పును  చాయపెసరపప్పు  అని కూడా అంటారు.

అంతే. భోజనము లోకి ఎంతో  రుచిగా ఉండే పెసరపప్పు పచ్చడి రెడీ. కొందరు  ఈ పచ్చడితో  అట్టు వేసుకుని  వేడి వేడి అన్నంలో  నెయ్యి  వేసుకుని  నంచుకుని  తింటారు. ఇంగువ వాసనతో  ఈ దోశెలు కూడా  భోజనము లోకి  చాలా రుచిగా  ఉంటాయి

Wednesday, 19 August 2020

కందిపొడి

స్టౌ  మీద  బాండీ పెట్టుకుని అందులో ఒక పావు కిలో కందిపప్పు , 20 ఎండుమిరపకాయలు , రెండు స్పూన్లు  జీలకర్ర  వేసుకుని , నూనె  వేయకుండా  కంది పప్పు  మాడకుండా అట్లకాడతో  కదుపుతూ, కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

చల్లారగానే మిక్సీ లో ఈ మిశ్రమమును వేసుకుని  అందులో  పావు స్పూను ఇంగువను మరియు  తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత ఈ పొడిని  ఒక బేసిన్ లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకుని  ఒక సీసాలోకి  తీసుకోవాలి .

ఈ కందిపొడి  మూడు నెలలు  నిల్వ ఉంటుంది.

వేడి వేడి  అన్నంలో  నెయ్యి కాని , పప్పు నూనె కాని  వేసుకుని  తింటే  చాలా రుచిగా ఉంటుంది.

ఈ పొడికి  కాంబినేషన్ గా దోసావకాయ కాని , కొత్తావకాయ  కాని , పచ్చి పులుసు కాని  చాలా రుచిగా  ఉంటుంది.

Monday, 10 August 2020

కొబ్బరి వాక్కాయ పచ్చడి

కావలసినవి

కొబ్బరి కాయ  -- ఒకటి .  పగుల కొట్టి  పచ్చి కొబ్బరి  కోరాముతో  తురుము కోవాలి.

వాక్కాయలు --  100 గ్రాములు
శుభ్రం చేసుకుని  లోపల గింజను తీసి వేసుకుని  ముక్కలుగా తరుగు కోవాలి.

ఎండుమిరపకాయలు  -- 8
పచ్చి మిరపకాయలు  --  6
మినపప్పు  --  స్పూనున్నర 
ఆవాలు  --  అర స్పూను 
మెంతులు  --  పావు స్పూను 
జీలకర్ర  --  పావు  స్పూను
ఇంగువ  --  కొద్దిగా 
పసుపు --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
నూనె  --  మూడు స్పూన్లు 
కరివేపాకు  --  రెండు రెమ్మలు .

తయారీ  విధానము .
 
ముందుగా  కొబ్బరి  తురుము ,  వాక్కాయ ముక్కలు  సిద్ధం చేసుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ  మరియు కరివేపాకు వేసి  పోపు వేయించుకొని   పోపు వేగగానే  అందులో  పచ్చి మిరపకాయలు  కూడా  వేసి రెండు నిముషములు మగ్గనిచ్చి   దింపుకోవాలి .

ఇప్పుడు ముందుగా  మిక్సీ లో ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు మరియు పోపు వేసి పచ్చడి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత వాక్కాయ ముక్కలు , పచ్చిమిర్చి , పసుపు వేసి  మరి మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

ఇపుడు  చివరగా  కొబ్బరి  తురుము కూడా  వేసి   మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత పచ్చడి వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  పుల్ల పుల్లగా  ఇంగువ వాసనతో ఎంతో రుచిగా  ఉండే  కొబ్బరి  వాక్కాయ పచ్చడి రెడీ.

Wednesday, 5 August 2020

కొబ్బరితురుము పెరుగు పచ్చడి

కావలసినవి.
కొబ్బరి  కాయ -- ఒకటి  పగుల కొట్టి  రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి తురుముతో  తురుము కోవాలి .
పెరుగు  --  అర  లీటరు .

పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగు , పచ్చడి  కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగు వాడు కోవచ్చును. 

పచ్చి మిరపకాయలు  --  8
అల్లం  -- చిన్న ముక్క ఒకటి 
కొత్తిమీర  --  చిన్న కట్టలు రెండు .
ఉప్పు  --  తగినంత .

పోపునకు.
నెయ్యి --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  4 .   చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
చాయమినపప్పు  --  స్పూను .
జీలకర్ర  --  పావు స్పూను .
ఆవాలు --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా 
కరివేపాకు  --  మూడు రెమ్మలు .

తయారీ విధానము
పచ్చిమిరపకాయలు తొడిమలు  తీసి ఉంచుకోవాలి.
అల్లం  చెక్కు  తీసి , ముక్కలుగా చేసుకోవాలి .
కొత్తిమీర  విడదీసి శుభ్రం చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీలో పచ్చిమిరపకాయలు , తరిగిన  అల్లం  ముక్కలు , కొత్తిమీర లో మూడు వంతులు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఇప్పుడు  ఒక గిన్నెలో సిద్ధంగా  ఉంచుకున్న  పెరుగు, తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి తురుము , మిగిలిన ఒక వంతు కొత్తిమీర  మరియు  మిక్సీ  వేసుకున్న మిశ్రమము వేసి  గరిటతో బాగా కలుపుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి  మొత్తము  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు, చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు పెట్టి , కొబ్బరి పెరుగు పచ్చడి లో కలుపుకోవాలి .

అద్భుతమైన  కొత్తిమీర  సువాసనతో  రుచిగా ఉండే ఈ కొబ్బరి తురుము పెరుగు పచ్చడి  భోజనము లోకి ఎంతో బాగుంటుంది 

Sunday, 2 August 2020

వంకాయ పచ్చడి పులుసు

 పచ్చి పులుసు .

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత 
పసుపు  --  కొద్దిగా 

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు 
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసి వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క తీసిన వంకాయలు  తొడిమలు  తీసి  అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి కాంబినేషన్  గా  కందిపచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది.