Wednesday, 11 December 2019

మజ్జిగ పులుసు

మజ్జిగ  పులుసు.

తయారీ విధానము.

అర లీటరు  పెరుగులో  ఒకటిన్నర  గ్లాసు నీళ్ళు పోసి  కవ్వంతో  మజ్జిగ  గిలకొట్టుకోవాలి.

రెండు స్పూన్లు  పచ్చిశనగపప్పు  , చిన్న అల్లం  ముక్క , చాలా కొంచెం ఆవాలు  ఒక గంట ముందు పావు గ్లాసు నీళ్ళల్లో  నాన బెట్టు కోవాలి.

(రెండు క్యారెట్లు  పై చెక్కు  తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి).

చిన్న లేత ఆనపకాయ ముక్క పై చెక్కు  తీసి  ముక్కలుగా తరుగుకోవాలి.

(రెండు  టమోటోలు   ముక్కలుగా  తరుగుకోవాలి).

నాలుగు  పచ్చి మిర్చి  ముక్కలుగా  తరుగు కోవాలి.

మూడు  రెమ్మల కరివేపాకు  , ఒక చిన్నకట్ట కొత్తిమీర , కొద్దిగా  పసుపు  మరియు తగినంత ఉప్పు సిద్ధంగా ఉంచుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  పది మెంతి గింజలు , రెండు ఎండు మిరపకాయలు , స్పూను  శనగపప్పు ,  స్పూను  ధనియాలు , కొద్దిగా  ఇంగువ , పావుచిప్ప పచ్చి కొబ్బరి వేసి  పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే  పోపు మొత్తము  మిక్సీలో వేసుకుని పావుగ్లాసు నీరు పోసుకుని  మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఈ పొడిలోనే  నానబెట్టిన పచ్చిశనగపప్పు , అల్లంముక్క అందులోని  నీళ్ళతో సహా మిక్సీలో వేసి మెత్తగా  ముద్దలా  మిక్సీవేసుకోవాలి.

ఇప్పుడు  ఒక గిన్నె  తీసుకుని  అందులో మజ్జిగ , పసుపు , తగినంత  ఉప్పు , కరివేపాకు  , తరిగిన  పచ్చి మిరపకాయలు , (క్యారట్  ముక్కలు ), ఆనపకాయ ముక్కలు, (టమోటో ముక్కలు)  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  సిద్ధంగా  ఉంచుకున్న  ముద్దను కూడా  మజ్జిగలో వేసి  మరో గ్లాసు నీళ్ళు పోసి గరిటెతో  బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిర్చి , ఆవాలు మరియు కరివేపాకు  వేసి పోపు వేసుకుని  ఈ పోపు మజ్జిగలో కలపాలి.

ఇప్పుడు  స్టౌ మీద పోపుతో సహా  అన్నీ  వేసిన మజ్జిగ  పులుసు గిన్నెను పెట్టి, సెగ మీడియం  పెట్టి గరిటెతో మధ్యలో  కదుపుతూ  పొంగిపోకుండా చూసుకుంటూ  ముక్కలు  మెత్త పడే దాకా పులుసును బాగా తెర్ల నివ్వాలి.

చివరలో కొత్తిమీర  వేసి దింపుకోవాలి.

అంతే ఎంతో రుచిగా  ఉండే  మజ్జిగ  పులుసు  సర్వింగ్ కు సిద్ధం.

పుల్లగా  ఇష్టమైన వారు  పుల్లని పెరుగుతో  మరియు  కమ్మగా  ఇష్టపడే  వారు కమ్మని పెరుగుతో  మజ్జిగ  పులుసు పెట్టుకోవచ్చును,

ఈ మజ్జిగ  పులుసు  పెట్టిన రోజు కన్నా  మరుసటి రోజు  మరింత  రుచిగా  ఉంటుంది.

Thursday, 5 December 2019

Sajjanar

పురుషులందు పుణ్య పురుషులు కాదు.. 
జనుల యందు 'సజ్జను'లు వేరయా 
విశ్వదాభిరామ వినురవేమ

Friday, 29 November 2019

వంకాయ పచ్చి పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ పచ్చి పులుసు .

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత
పసుపు  --  కొద్దిగా

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసి వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క తీసిన వంకాయలు  తొడిమలు  తీసి  అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి   కాంబినేషన్  గా  కందిపచ్చడి  చాలా రుచిగా  ఉంటుంది.

Friday, 27 September 2019

పచ్చి మిరపకాయల కారం

పచ్చి  మిరపకాయల కారం.

కావలసినవి .

పచ్చిమిరపకాయలు  -   150 గ్రా
చింతపండు   -  50  గ్రా
ఉప్పు   --  తగినంత
బెల్లం   -   చిన్న ముక్క (  ఇష్టం  లేని వారు  మానేయవచ్చు . )
పసుపు  -   కొద్దిగా
నూనె  --   అయిదు  స్పూన్లు

పోపుకు .

పొట్టు  మినపప్పు /  లేదా
చాయమినపప్పు   --     రెండు స్పూన్లు .
ఆవాలు  -   అర స్పూను
మెంతులు  --  పావు  స్పూను
ఇంగువ  --   మరి  కాస్త

తయారీ  విధానము .

పచ్చిమిర్చి   తొడిమలు  తీసి  కడిగి తడి లేకుండా   ఆర నివ్వాలి .

స్టౌ  మీద  బాండీ పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా  కాగగానే   పచ్చిమిర్చి   వేసి  మూత పెట్టు  కోవాలి.

మూత  పెట్టకపోతే  పచ్చిమిర్చి   పేలతాయి.

మూడువంతులు  పైగా  మగ్గాక  కొద్దిగా   పసుపు  వేసి   దింపుకోవాలి.

చింతపండు   విడదీసుకుని  ఉంచుకోవాలి .

తర్వాత  స్టౌ  మిద  బాండీ  పెట్టి మిగిలిన  రెండు  స్పూన్లు  నూనె  వేసి
మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  వేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  కారం  కాబట్టి  పోపులో  ఎండుమిర్చి   వేయనక్కరలేదు .

ఇప్పుడు  మిక్సీ లో  మగ్గబెట్టిన  పచ్చిమిర్చి , చింతపండు ,  సరిపడా ఉప్పు మరియు చిన్న బెల్లం ముక్క( ఇష్టమైన వారు  ) వేసి   మరీ మెత్తగా  కాకుండా  కొంచెం  కచ్చా పచ్చాగా వేసుకోవాలి .

చివరగా  పోపు కూడా  వేసి  పచ్చడి  మరోసారి మిక్సీ  వేసుకోవాలి .

ఈ పచ్చడి  చాలా  రుచిగా  ఉంటుంది.

చింతపండు   సమంగా  పడకపోతే  కారంగా  ఉంటుంది .

Friday, 19 July 2019

తెలగ పిండి కూర

తెలగపిండి  కూర.

తెలగ పిండి అంటే నువ్వుల నూనె తయారు చేసిన తర్వాత వచ్చే పిప్పి లేదా పిండి. సాధారణంగా నూనె  గానుగ (ఆయిల్ మిల్లు)లో ఇది దొరుకుతుంది.

బాలింతలకు  పాలు బాగా పడతాయని మా బామ్మ, అమ్మ చెప్పేవాళ్లు. ఇతర కూరల మాదిరిగా నే ఈ తెలగపిండి కూరను  కూడా అన్నంలో కలుపుకుని తినొచ్చు.

తయారీ విధానం:

ఓ గిన్నెలో 1 కప్పు తెలగపిండిని ఒకటిన్నర కప్పు నీటిలో ఉండలు లేకుండా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, అర టీ స్పూన్ మెంతులు, కొద్దిగా బెల్లం ముక్క చేర్చి సన్నటి సెగ మీద ఉడికించాలి. నీరు తగ్గి తడిఆరే వరకూ ఉడికించాలి.

వేరే బాండీ తాళింపు సిద్ధం చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కగానే.. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపగుళ్లు వేయాలి. అవి కొద్దిగా దోరగా వేగుతున్న సమయంలో ముక్కలు చేసిన రెండు/మూడు ఎండుమిరపకాయలు, కర్వేపాకు చేర్చాలి. అనంతరం, ఉడికిన తెలగపిండిని దాంట్లో వేసి కలియబెట్టాలి. బాండీపై మూతపెట్టాలి. తెలగపిండి తడి ఆరగానే (మగ్గిన తర్వాత) బాండి లోంచి తెలగ పిండి కూరను వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. అంతే, కమ్మటి తెలగపిండి కూర రెడీ.

Friday, 15 March 2019

మినప సున్నుండలు

,మినప  సున్నుండలు .

తయారీ  విధానము  .

ఒక  కె. జి  .    మినప  గుళ్ళు  (  పొట్టు  తీసినవి  ) బాండీ లో   నూనె  వేయకుండా   కమ్మని  వాసన  వచ్చే దాకా  వేయించుకోవాలి .

ఆ తర్వాత  మిక్సీ  లో  గాని  లేదా  పిండి  మరలో  గాని  మెత్తని    పొడిగా   వేసుకుని   ఆ పొడి  డబ్బాలో  పోసుకుని  గట్టిగా   మూత  పెట్టు కోవాలి .

మనం  ఎప్పుడు  మినప  సున్నుండలు  చేసుకోవాలని  అనుకుంటే  అప్పుడు  కప్పు  మినప సున్నికి  అర కప్పు  బాగా  మెత్తగా   దంచిన  బెల్లపు  పొడి  గాని  , మెత్తగా   గ్రైండ్   చేసిన  పంచదార  కాని  పొడిలో  వేసి  బాగా  చేత్తో   కలుపు కోవాలి  .

షుమారు  పావు  కప్పు   బాగా  కాగిన  వేడి  వేడి  కల్తీ లేని  మంచి  నెయ్యి  పిండిలో  పోసుకుంటూ  చేత్తో  గట్టిగా   ఉండలు  కట్టు కోవాలి .

బాలింతలకు  కూడా  నడుము  గట్టి  పడుతుందని  ఈ   సున్నుండలు  పెడతారు .

పెద్ద, చిన్న , పిల్లలూ  అందరూ  ఎంతో  ఇష్టంగా  తినే  మినప  సున్నుండలు  రెడీ .

ఒక్కసారి  ఎక్కువ   మోతాదులో   కలుపుకునే  కన్నా  మన  ఇంట్లో  జనాన్ని  బట్టి  కాస్త  కాస్త  కలుపుకుంటే  తాజా  తాజా గా  ఉంటాయి .

మినపసున్నిలో  పంచదార కన్నా  బెల్లపు  పొడి  వేసుకుంటేనే  రుచిగా  ఉంటుంది .

ఆరోగ్యానికి   కూడా  మంచిది.

Sunday, 10 March 2019

గుత్తి కాకరకాయ కూర

కాకరకాయ  శనగపిండి --  ఉల్లిపాయతో  కూర.  (   Fry  )

ఒక  350  గ్రాముల  కాకరకాయలను  మధ్యకి  తరిగి  ముక్కలు  చేయకుండా  మధ్యలో  గాటు  పెట్టుకోండి.

ఒక  నాలుగు   పెద్ద ఉల్లిపాయలు   ముక్కలుగా  తరుగు కోండి.

ఒక  అర  కప్పు  శనగపిండి  తీసుకోండి .

అందులో  తగినంత   ఉప్పు , రెండు స్పూన్లు   కారం  వేసి చేత్తో   బాగా  కలుపుకోండి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి ఒక  100 గ్రా. నూనె వేసి , నూనె  బాగా  కాగగానే  సగానికి  తరిగి   గాటు పెట్టిన  కాకరకాయలను   నూనెలో  వేసి అన్ని వైపులా ఎర్రగా   వేయించుకోండి.

ఒక  పళ్ళెంలో విడిగా  ఉంచుకోండి.

మళ్ళీ బాండీలో  నూనె  వేసి  నూనె  కాగగానే  ముక్కలుగా   తరిగి  ఉంచిన  ఉల్లిపాయలు వేసి  బంగారు  రంగు  వచ్చే వరకు  వేయించుకోండి .

ముక్కలు  వేగగానే  ఉప్పు , కారం  కలిపిన  శనగపిండి  వేసి , శనగపిండి  పచ్చి  వాసన  పోయి  ఉల్లిపాయల  తో  కలసి  కమ్మని  వాసన  వచ్చేదాక  వేయించుకోండి .

చల్లారగానే  ఈ  మిశ్రమాన్ని   వేయించిన  కాకరకాయల్లో  కూరండి .  విడిగా  కొంత  పొడి  ఉంచుకోండి.

స్టౌ  మీద  బాండీ పెట్టి  నూనెపోసి  నూనె  పొగలు  రాగానే  ఒక్కో  ముక్కలో  రెండు  స్పూన్లు   వేడి  నూనె  పోసుకోండి.

అంతే  కాకరకాయ తో  శనగపిండి  మరియు  ఉల్లిపాయ   కూర  సర్వింగ్  కు  సిద్ధం.

వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని  
విడిగా  ఉంచిన కూరపొడితో   కలుపుకుని  శనగపిండి ఉల్లిపాయలతో  కూరిన  కాకరకాయలు  తింటుంటే  చాలా రుచిగా  ఉంటుంది .

Monday, 4 March 2019

చింతపండు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు  పచ్చడి .

చింతపండు  పచ్చడి . నాకు  తెలిసినంత వరకు  ఈ పచ్చడి ఫక్తు  గుంటూరు  జిల్లా పచ్చడి .

చిన్నప్పుడు  బామ్మ చేసి పెట్టేది .

నాకు అప్పుడు   ఐదారు  ఏళ్ళ వయస్సు ఉండేదేమో .

అందులో  ఏమేమి  వేసి చేసేదో  అర్ధం అయ్యేది  కాదు . ఆ ఆలోచన కూడా ఉండేది కాదు.

కందిపచ్చడి  చేసినప్పుడు , నెయ్యి వేసి కందిపప్పు  వేయించి కుంపటి మీద కంచు గిన్నెలో  ముద్ద పప్పు వండినప్పుడు , శనగపప్పు  ఉడకపెట్టి   పోపు వేసి  అందులో  పచ్చి కొబ్బరి తురుము  వేసి  కూర  చేసినప్పుడు ,  మా బామ్మ తప్పనిసరిగా  పక్కన  చింతపండు  పచ్చడి  చేసేది .

పైన  చెప్పిన  వంటకాలలో  చింతపండు  పచ్చడి ఈ వంటకాల పక్కన  ఆదరువుగా  అద్భుతంగా  ఉండేది .

ఆరోజుల్లో  ఫ్రిజ్ లు ఎక్కడవి ?

మడి  అంటే  ముట్టుకోరని  ఆ పేరు మీద  రాచ్చిప్పల్లో  దాచేవారు .

ఈ చింతపండు  పచ్చడి  చెక్కు  చెదరకుండా  ఐదారు రోజులు  పైనే  నిల్వ ఉండేది .

ఆ తర్వాత పచ్చడి  ఇంకా  మిగిలితే  ఉల్లిపాయలు  చిన్న చిన్న  ముక్కలుగా  తరిగి  నూనెలో  మినపప్పు , ఎండుమిర్చి , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు తో  పోపు  వేసి అందులో  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు  వేసి పోపులో  మగ్గనిచ్చి , తర్వాత పోపును  ఈ చింతపండు  పచ్చడిలో  వేసి  స్పూనుతో  బాగా  కలిపి  స్కూళ్ళకు  హడావుడిగా  పరిగెత్తే  మాకు  అన్నం లోకి  వేసి  పెట్టేది .

తియ్య తియ్యగా  ఉండే  ఆ పచ్చడి వేసుకుని  తిని , కంచాలు  కూడా నాకేసి  స్కూళ్ళకు  బ్యాగ్ లు  భుజాన వేసుకొని  పరిగెత్తే వాళ్ళం.

ఆ నాటి నుండి  ఈ  చింతపండు  పచ్చడి  రుచి  అలా ఉండి పోయింది .

చాలా  సార్లు  మా ఇంట్లో , అప్పుడప్పుడు  ఇతరుల  ఇళ్ళల్లో  తిన్నా , ఆ రుచి  బలంగా బుర్రలో  ఉండి పోవడం వలన బాగుంది కాని  బామ్మ చేసిన పచ్చడి రుచి రాలేదు  అని తిన్న  ప్రతిసారి అనుకునే వాణ్ణి .

ఆ లోటును   మా బామ్మకు  వరుసకు  మనవరాలు నాకు వరుసకు అక్క అయిన ఆమె  ఈ మధ్యనే  తీర్చింది .

ఇటీవల  ఓ పెళ్ళిలో  కలిసినప్పుడు  మా బామ్మ చేసిన చింతపండు  పచ్చడి గురించి  చాలా సేపు వర్ణించి మరీ చెప్పాను .

ఏం మాట్లాడకుండా అన్నీ నవ్వుతూ  వింది.

చివరలో  ఓ ఆదివారం మా ఇంటికి  భోజనానికి  రమ్మంది .

నేను అలాగే అంటూ  రెండుసార్లు  వాయిదా వేసినా , తనే ఫోను చేసి  ఈ  ఆదివారం మా ఇంటికి  భోజనానికి  వస్తున్నావు అంతే . ఇంకేం మాట్లాడకు  అని ఫోను పెట్టేసింది .

మరీ అంతగా మాటిమాటికి బ్రతిమాలించుకోవడం సభ్యత కాదని  భోజనానికి  వెళ్ళాను .

మెనూ అంతా  బామ్మదే .
ముద్ద పప్పు , గుత్తివంకాయ  పొడి కొట్టి కూరిన కూర , ముక్కల పులుసు , చింతపండు  పచ్చడి  మరియు పెరుగు .

పక్కనే  నేతి గిన్నెలో  ఘమ ఘమ లాడుతున్న  వెన్న కాచిన నెయ్యి .

అరటి ఆకులో అచ్చంగా  తెలుగు భోజనము  నోరూరిస్తూ  ఆహ్వానిస్తోంది .

ముందుగా  పచ్చడి  బాగా నెయ్యి వేసి కలుపుకునే అలవాటు ఉన్న నాకు  చింతపండు  పచ్చడి కలుపుకొబేయే ముందు  వేలితో  నాలిక్కి రాసుకుని చూద్దును కదా అద్భుతం .

మళ్ళీ మా బామ్మ చేసిన పచ్చడే గుర్తుకు  వచ్చింది .

పెళ్ళిలో  మా బామ్మ చేసిన చింతపండు  పచ్చడి  గురించి   అక్కతో తెగ మాట్లాడాను కదా .

ఆ విషయం తన  బుర్రలో  రికార్డయి పోయిందేమో .
నవ్వుతూ అడిగింది  ఎలా ఉంది పచ్చడి ?  అమ్మమ్మ చేసిన పచ్చడిలా  ఉందా ? లేదా ?  అని .

ఏమనాలో తెలియక  మా బామ్మని  మరిపించావు ? అన్నాను .

బామ్మ దగ్గర  ఎప్పుడు  నేర్చుకున్నావు  ? అని  అడిగాను .

లేదు  మా అమ్మ నేర్పింది  అంది .

భోజనము  పూర్తయ్యాక ఇంటికి  వెళ్ళబోతుంటే  ఒక్క నిముషం  ఉండు  అని  GDR  ఇంగువ  డబ్బా  పెట్టే  పైన  Container నిండా  చింతపండు  పచ్చడి  పెట్టి , ఇంటికి  తీసుకెళ్ళు అని  నా చేతిలో  పెట్టింది .

అప్పుడు  మనసులో  పర్వాలేదు  ఇంకా  బంధువుల్లో ఆనాటి  రుచులూ , అభిమానాలు కొందరిలో నైనా  మిగిలి  ఉన్నాయి అనుకుంటూ ఇల్లు చేరాను .

****************************
ఆలూరుకృష్ణప్రసాదు .

ఇంక చింతపండు  పచ్చడి  తయారీ  విధానము .

చింతపండు  పచ్చడి .

కావలసినవి .

చింతపండు  -- 50  గ్రాములు .

ఎండు మిరపకాయలు -- 30 గ్రాములు   లేదా  షుమారుగా  - 20 .

బెల్లం  --  40  గ్రాములు .

ఉప్పు  --  తగినంత .

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
మెంతులు  --  పావుస్పూను
ఆవాలు  --  స్పూను .
ఇంగువ  --  తగినంత .
పసుపు  --  కొద్దిగా .

తయారీ  విధానము .

ముందుగా  పావుగంట సేపు చింతపండు  విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం చేసుకొని  ఒక  గిన్నెలో  పావు గ్లాసు  కన్నా  తక్కువ  నీళ్ళు  పోసుకుని  తడిపి  ఉంచుకోవాలి .

తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి , మెంతులు , ఆవాలు మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .

తర్వాత  బెల్లంను చిన్న చిన్న  ముక్కలుగా  దంపుకోవాలి.

ఇప్పుడు  పోపు  చల్లారగానే  మిక్సీ లో  ఈ పోపు  అంతా వేసుకుని  , తగినంత  ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  అందులో  నానబెట్టిన  చింతపండు  నీళ్ళతో సహా  వేసుకోవాలి .

పొడిగా చేసుకున్న  బెల్లం కూడా  వేసుకొని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

నీళ్ళు  తక్కువగా  పోస్తే  పచ్చడి  గట్టిగా  భోజనము  లో  కలుపు కోవడానికి  వీలుగా  ఉంటుంది .

ఈ పచ్చడి లో  అల్లం , మామిడి  అల్లం వంటివి  వెయ్యరు .

ఈ పచ్చడిలో  ధనియాలు, మినపప్పు , శనగపప్పు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు  వంటివి కూడా  వెయ్యరు .

ఈ పచ్చడి లో  తిరిగి  పోపు  పెట్టనవసరం లేదు .

ఈ పచ్చడి  ఫ్రిజ్  లో పెట్టకపోయినా  వారం రోజులు  నిల్వ  ఉంటుంది .

ఈ పచ్చడిలో  తీపి వేసుకుంటేనే  బాగుంటుంది .

అసలు  వాడని వారు  తీపి లేకుండా  చేసుకోండి .

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎందులోకైనా  బాగుంటుంది .

ఇదే  మా అక్క దగ్గర  తిని ఎలా చెయ్యాలో  రెసిపి  రాసుకుని  వచ్చిన  అసలు  సిసలైన  చింతపండు  పచ్చడి .

ఫోటో  ఈ రోజు  ఉదయం  అక్క చెప్పిన  పద్థతిలో  తయారు  చేసిన  చింతపండు  పచ్చడి .

సంబంధించిన  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

Sunday, 3 March 2019

పచ్చి శనగపప్పు తో కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చిశనగపప్పు తో కొబ్బరి  కూర .
************************

పచ్చిశనగపప్పు  ఒక కప్పుడు తీసుకుని  సరిపడా నీరు పోసి చేత్తో పట్టుకుంటే బద్ద చితికే వరకు  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత నీరు వార్చు కోవాలి .

పచ్చి కొబ్బరి  ఒక చిప్ప కొబ్బరి  తురుముతో తురుము కోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  మూడు ఎండు మిరపకాయలు  ముక్కలుగా  తుంపి , స్పూను చాయమినపప్పు , అర స్పూను  ఆవాలు , పావు స్పూను  జీలకర్ర , కొద్దిగా  ఇంగువ , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు  పచ్చిమిర్చి  మూడు ముక్కలుగా చేసి వేసుకుని  పోపు వేసుకోవాలి .

అందులో ఉడక పెట్టిన పచ్చిశనగపప్పు , కొద్దిగా  పసుపు ,  తగినంత  ఉప్పు , స్పూను కారం వేసుకుని ఓ అయిదు నిముషాలు మూతపెట్టి మీడియం సెగన మగ్గ నివ్వాలి .

చివరలో తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి  తురుము వేసుకుని  మరో మూడు నిముషాలు ఉంచి  దింపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పచ్చిశనగపప్పు తో కొబ్బరి కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ కూరకు కాంబినేషన్ గా చింతపండు  పచ్చడి కాని అల్లం పచ్చడి కాని చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Saturday, 2 March 2019

Maddur vada మద్దూర్ వడ

కొత్తగా ఏదైనా వండాలి అనిపించింది. త్వరగా అయ్యేది ‘ మద్దూర్ వడ’ గుర్తుకొచ్చింది.

తయారీ:
1/2 కప్పు బియ్యంపిండి, 1/2 కప్పు మైదా పిండి, 1/4 కప్పు శనగపిండి , 2 చంచాల పచ్చిమిర్చితరుగు, 4 చంచాల కొతిమేర, 1 చంచా mirchi flakes, 1/2 కప్పు వుల్లితరుగు1 చంచా అల్లం తరుగు, 1/2 థనియా, 1/2 చంచా జీర powders, 6 చంచాల జీడిపప్పు ముక్కలు, 4 చంచాల వేడి నూనె, తగిన వుప్పు వేసి నీళ్ళు పోసి గట్టిగా ‘ పప్పుచక్కల ‘ పిండి మాదిరి క లుపు కోవాలి. చేతికి నూనె రాసుకొన చిన్న
వుండలుగా చేసి పెట్టు కోవాలి.

భాళ్ళీ వేడిచేసి తగిన నూనె వేసి నూనె కాగాక వుండలని
చక్కల మాదిరి plastic
Paper పై తట్టి నూనె లో వేసి వేయించి Golden  brown colourరాగానే తీసి tissue paper లో పెట్టు కోవాలి.  అన్ని వండిన తరువాత చక్కగా అందమైన tiffin plate లో పెట్టుకొని మాగాయతోనో, అల్లంపచ్చడితోనో తింటే.......ఆనందం....బ్రహ్మనందం.

Tuesday, 19 February 2019

నిమ్మకాయ నిల్వ పచ్చడి

నిమ్మకాయలు కడిగి ఆరబెట్టాలి. తరువాత ఒకొక్క కాయని నాలుగు లేదా ఎనిమిది ముక్కలు చేసి, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 3వ రోజు ఉదయం ముక్కలు చేత్తో గట్టిగా పిండి ఎండలో పెట్టాలి. అలాగే ఊరిన రసం కూడా వేరేగా వెడల్పాటి గిన్నెలో పోసి ఎండలో పెట్టాలి. అలా రెండు మూడు రోజులు ఎండ పెట్టాలి. ఆ తర్వాత, ఒక చెంచాడు మెంతులు వేయించి, పొడి చేసుకోవాలి. అపుడు మూకుడులో గరిటెడు నూనె పోసి కాగాక అందులో ఆవాలు, మెంతులు వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్ది సేపు తరువాత అందులో కారం పొడి తగినంత వేసి కలిపి దించేయాలి. అందులో మెంతిపొడి, ఎండిన ముక్కలు, రసం వేసి బాగా కలపాలి. అంతే... ఘుమఘుమలాడే నిమ్మకాయ నోరూరిస్తూ మీ కోసం!

Saturday, 16 February 2019

పచ్చి పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చిపులుసు.

కావలసినవి .

చింతపండు  ---  30 గ్రా. లేదా  నిమ్మకాయంత.
పెద్ద ఉల్లిపాయలు --  రెండు
ఉప్పు  తగినంత
బెల్లం  --  20  గ్రా ( తీపి ఇష్ట పడని వారు  బెల్లం  వేయకుండా చేసుకొనవచ్చును . )
తరిగిన  కొత్తిమీర  సరిపడా

పోపు .

ఎండుమిరపకాయలు  - 5
జీలకర్ర   --  అర స్పూను
నూనె  --  రెండు స్పూన్లు
కరివేపాకు   -  రెండు  రెబ్బలు 

తయారీ  విధానము .

చింతపండు   లో  నీళ్ళు  పోసి  పది నిముషములు  నాన బెట్టు కోవాలి.

రసం  తీసుకొని   వడ కట్టుకొని  ఒక  అర  లీటరు  ప్రమాణం  వచ్చేలా  అందులో  నీళ్ళు  కలుపు కోవాలి .

ఒక  గిన్నెలోకి  తీసుకోవాలి.

అందులో  తగినంత   ఉప్పు  మరియు  బెల్లం  పొడి చేసి  కలుపుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరిగి   అందులో  కలుపుకోవాలి.

సన్నగా  తరిగిన   కొత్తిమీర   అందులో  కలుపుకోవాలి.

స్టౌ మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , జీలకర్ర   వేసి  వేగాక  కరివేపాకు  కూడా  వేసి  వేయించు కోవాలి .

తర్వాత  మిక్సీలో  ఈ  వేగిన  పోపు  వేసి  మెత్తగా   పొడి  చేసుకొని  ఆ పొడి  పచ్చి పులుసు లో  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

ఉల్లిపాయలు  వేయించనక్కర  లేదు .
పులుసు  వెచ్చబెట్టే  అవసరం లేదు .
ఇంక  వేరే  పోపు  వేయనక్కర  లేదు.
పచ్చి మిర్చి  వేయనక్కర లేదు .
ఇంగువ  వేసే  అవసరం  లేదు.

ఎంతో  రుచిగా  ఉండే  పచ్చి  పులుసు  రెడీ .

కాంబినేషన్ గా  కందిపొడి  గాని , కంది పచ్చడి కాని చాలా రుచిగా  ఉంటుంది .

పచ్చి ఉల్లిపాయలు  తినడం ఇష్టం లేని వారు ,  ఉల్లిపాయల  ముక్కలు  బాండీ లో రెండు స్పూన్లు  నూనె వేసి నూనె  బాగా కాగగానే  ఉల్లిపాయ  ముక్కలు వేసి  పచ్చి వాసన పోయే వరకు  వేయించి  పులుసులో  కలుపుకోండి.

మిగిలిన  పద్థతి  పై చెప్పిన విధముగానే.

Tuesday, 8 January 2019

మజ్జిగ పులుసు

మజ్జిగ   పులుసు.

తయారు  చేయు  విధానము .

ముందుగా అర లీటరు  పెరుగు చక్కగా కవ్వంతో గిలకొట్టి  గడ్డలు లేకుండా  చూసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన  పెట్టి ఉంచుకోవాలి,

పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు.

అందులో పావు టీ స్పూన్ పసుపు కలిపి గరిటతో బాగా కలపండి.

ముందుగా చిన్న గిన్నెలో రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు , స్పూను  చాయపెసరపప్పు , స్పూను  బియ్యం ,పావు స్పూను లో సగం ఆవాలు. చిన్న అల్లంముక్క, చిన్న పచ్చి కొబ్బరిముక్కను వేసి  పావు గ్లాసు  నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టి ,  ఆ తర్వాత ఆ నీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఆ ముద్దని మజ్జిగ  లో కలపండి.

నాలుగు పచ్చిమిరపకాయలు  తీసుకుని నిలువుగా చీలికలు  గా తరిగి మజ్జిగ ముద్దలో వేయండి.

కరివేపాకు  రెండు రెమ్మలు తీసుకుని ఆకులు  దూసుకుని  కడిగి మజ్జిగ  లో వేయండి.

తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.

ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకఱ్ర . ఆవాలు కొద్దిగా  వేసి  కొంచెం కరివేపాకు  వేసి కొంచెం నూనె వేసి పోపు పెట్టి మజ్జిగ లో కలపండి.

పావు కిలో ఆనపకాయ ముక్క పై చెక్కు  తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి.

రెండు క్యారెట్ లు  పై చెక్కు తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి.

రెండు టమోటో లు  ముక్కలుగా  తరుగుకుని  మజ్జిగ  పులుసులో వేసుకోవాలి.

ఆనపకాయ ముక్కలు  మరియు క్యారెట్ ముక్కలు  తగినన్ని  నీళ్ళు పోసుకుని    విడిగా కుక్కర్ లో మెత్తగా  ఉడికించి బాగా చల్లారాక మజ్జిగ లో కలపండి.

ఇప్పుడు  ఈ  మజ్జిగ  పులుసును
stove మీద పెట్టి పొంగకుండా గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వండి.

క్రింద పొంగితే  పై  నురుగు లోని  tase  పోతుంది .

బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి మజ్జిగ  దింపిన పులుసు లో వేసి  మూత పెట్టి ఉంచాలి .

వేడి   వేడి అన్నంలో కలుపుకుని తింటే  ఆ  రుచి  అద్భుతం .

ఒక్క విషయం అన్నీ వేసాక stove మీద ఎందుకు  పెట్టమన్నానంటే ముందుగానే  పెడితే  మజ్జిగ  పులుసు విరిగిపోతుంది.

లేదా  మజ్జిగ  పులుసు తెర్లాక క్రిందకు  దింపి  పోపు గరిటెలో  పోపు వేసుకుని , పోపు చల్లారాక పులుసులో కలపాలి .

అప్పుడు  మజ్జిగ  పులుసు విరగదు.