Wednesday, 11 December 2019

మజ్జిగ పులుసు

మజ్జిగ  పులుసు.

తయారీ విధానము.

అర లీటరు  పెరుగులో  ఒకటిన్నర  గ్లాసు నీళ్ళు పోసి  కవ్వంతో  మజ్జిగ  గిలకొట్టుకోవాలి.

రెండు స్పూన్లు  పచ్చిశనగపప్పు  , చిన్న అల్లం  ముక్క , చాలా కొంచెం ఆవాలు  ఒక గంట ముందు పావు గ్లాసు నీళ్ళల్లో  నాన బెట్టు కోవాలి.

(రెండు క్యారెట్లు  పై చెక్కు  తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి).

చిన్న లేత ఆనపకాయ ముక్క పై చెక్కు  తీసి  ముక్కలుగా తరుగుకోవాలి.

(రెండు  టమోటోలు   ముక్కలుగా  తరుగుకోవాలి).

నాలుగు  పచ్చి మిర్చి  ముక్కలుగా  తరుగు కోవాలి.

మూడు  రెమ్మల కరివేపాకు  , ఒక చిన్నకట్ట కొత్తిమీర , కొద్దిగా  పసుపు  మరియు తగినంత ఉప్పు సిద్ధంగా ఉంచుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  పది మెంతి గింజలు , రెండు ఎండు మిరపకాయలు , స్పూను  శనగపప్పు ,  స్పూను  ధనియాలు , కొద్దిగా  ఇంగువ , పావుచిప్ప పచ్చి కొబ్బరి వేసి  పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే  పోపు మొత్తము  మిక్సీలో వేసుకుని పావుగ్లాసు నీరు పోసుకుని  మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఈ పొడిలోనే  నానబెట్టిన పచ్చిశనగపప్పు , అల్లంముక్క అందులోని  నీళ్ళతో సహా మిక్సీలో వేసి మెత్తగా  ముద్దలా  మిక్సీవేసుకోవాలి.

ఇప్పుడు  ఒక గిన్నె  తీసుకుని  అందులో మజ్జిగ , పసుపు , తగినంత  ఉప్పు , కరివేపాకు  , తరిగిన  పచ్చి మిరపకాయలు , (క్యారట్  ముక్కలు ), ఆనపకాయ ముక్కలు, (టమోటో ముక్కలు)  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  సిద్ధంగా  ఉంచుకున్న  ముద్దను కూడా  మజ్జిగలో వేసి  మరో గ్లాసు నీళ్ళు పోసి గరిటెతో  బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిర్చి , ఆవాలు మరియు కరివేపాకు  వేసి పోపు వేసుకుని  ఈ పోపు మజ్జిగలో కలపాలి.

ఇప్పుడు  స్టౌ మీద పోపుతో సహా  అన్నీ  వేసిన మజ్జిగ  పులుసు గిన్నెను పెట్టి, సెగ మీడియం  పెట్టి గరిటెతో మధ్యలో  కదుపుతూ  పొంగిపోకుండా చూసుకుంటూ  ముక్కలు  మెత్త పడే దాకా పులుసును బాగా తెర్ల నివ్వాలి.

చివరలో కొత్తిమీర  వేసి దింపుకోవాలి.

అంతే ఎంతో రుచిగా  ఉండే  మజ్జిగ  పులుసు  సర్వింగ్ కు సిద్ధం.

పుల్లగా  ఇష్టమైన వారు  పుల్లని పెరుగుతో  మరియు  కమ్మగా  ఇష్టపడే  వారు కమ్మని పెరుగుతో  మజ్జిగ  పులుసు పెట్టుకోవచ్చును,

ఈ మజ్జిగ  పులుసు  పెట్టిన రోజు కన్నా  మరుసటి రోజు  మరింత  రుచిగా  ఉంటుంది.

No comments:

Post a Comment