Monday, 4 March 2019

చింతపండు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు  పచ్చడి .

చింతపండు  పచ్చడి . నాకు  తెలిసినంత వరకు  ఈ పచ్చడి ఫక్తు  గుంటూరు  జిల్లా పచ్చడి .

చిన్నప్పుడు  బామ్మ చేసి పెట్టేది .

నాకు అప్పుడు   ఐదారు  ఏళ్ళ వయస్సు ఉండేదేమో .

అందులో  ఏమేమి  వేసి చేసేదో  అర్ధం అయ్యేది  కాదు . ఆ ఆలోచన కూడా ఉండేది కాదు.

కందిపచ్చడి  చేసినప్పుడు , నెయ్యి వేసి కందిపప్పు  వేయించి కుంపటి మీద కంచు గిన్నెలో  ముద్ద పప్పు వండినప్పుడు , శనగపప్పు  ఉడకపెట్టి   పోపు వేసి  అందులో  పచ్చి కొబ్బరి తురుము  వేసి  కూర  చేసినప్పుడు ,  మా బామ్మ తప్పనిసరిగా  పక్కన  చింతపండు  పచ్చడి  చేసేది .

పైన  చెప్పిన  వంటకాలలో  చింతపండు  పచ్చడి ఈ వంటకాల పక్కన  ఆదరువుగా  అద్భుతంగా  ఉండేది .

ఆరోజుల్లో  ఫ్రిజ్ లు ఎక్కడవి ?

మడి  అంటే  ముట్టుకోరని  ఆ పేరు మీద  రాచ్చిప్పల్లో  దాచేవారు .

ఈ చింతపండు  పచ్చడి  చెక్కు  చెదరకుండా  ఐదారు రోజులు  పైనే  నిల్వ ఉండేది .

ఆ తర్వాత పచ్చడి  ఇంకా  మిగిలితే  ఉల్లిపాయలు  చిన్న చిన్న  ముక్కలుగా  తరిగి  నూనెలో  మినపప్పు , ఎండుమిర్చి , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు తో  పోపు  వేసి అందులో  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు  వేసి పోపులో  మగ్గనిచ్చి , తర్వాత పోపును  ఈ చింతపండు  పచ్చడిలో  వేసి  స్పూనుతో  బాగా  కలిపి  స్కూళ్ళకు  హడావుడిగా  పరిగెత్తే  మాకు  అన్నం లోకి  వేసి  పెట్టేది .

తియ్య తియ్యగా  ఉండే  ఆ పచ్చడి వేసుకుని  తిని , కంచాలు  కూడా నాకేసి  స్కూళ్ళకు  బ్యాగ్ లు  భుజాన వేసుకొని  పరిగెత్తే వాళ్ళం.

ఆ నాటి నుండి  ఈ  చింతపండు  పచ్చడి  రుచి  అలా ఉండి పోయింది .

చాలా  సార్లు  మా ఇంట్లో , అప్పుడప్పుడు  ఇతరుల  ఇళ్ళల్లో  తిన్నా , ఆ రుచి  బలంగా బుర్రలో  ఉండి పోవడం వలన బాగుంది కాని  బామ్మ చేసిన పచ్చడి రుచి రాలేదు  అని తిన్న  ప్రతిసారి అనుకునే వాణ్ణి .

ఆ లోటును   మా బామ్మకు  వరుసకు  మనవరాలు నాకు వరుసకు అక్క అయిన ఆమె  ఈ మధ్యనే  తీర్చింది .

ఇటీవల  ఓ పెళ్ళిలో  కలిసినప్పుడు  మా బామ్మ చేసిన చింతపండు  పచ్చడి గురించి  చాలా సేపు వర్ణించి మరీ చెప్పాను .

ఏం మాట్లాడకుండా అన్నీ నవ్వుతూ  వింది.

చివరలో  ఓ ఆదివారం మా ఇంటికి  భోజనానికి  రమ్మంది .

నేను అలాగే అంటూ  రెండుసార్లు  వాయిదా వేసినా , తనే ఫోను చేసి  ఈ  ఆదివారం మా ఇంటికి  భోజనానికి  వస్తున్నావు అంతే . ఇంకేం మాట్లాడకు  అని ఫోను పెట్టేసింది .

మరీ అంతగా మాటిమాటికి బ్రతిమాలించుకోవడం సభ్యత కాదని  భోజనానికి  వెళ్ళాను .

మెనూ అంతా  బామ్మదే .
ముద్ద పప్పు , గుత్తివంకాయ  పొడి కొట్టి కూరిన కూర , ముక్కల పులుసు , చింతపండు  పచ్చడి  మరియు పెరుగు .

పక్కనే  నేతి గిన్నెలో  ఘమ ఘమ లాడుతున్న  వెన్న కాచిన నెయ్యి .

అరటి ఆకులో అచ్చంగా  తెలుగు భోజనము  నోరూరిస్తూ  ఆహ్వానిస్తోంది .

ముందుగా  పచ్చడి  బాగా నెయ్యి వేసి కలుపుకునే అలవాటు ఉన్న నాకు  చింతపండు  పచ్చడి కలుపుకొబేయే ముందు  వేలితో  నాలిక్కి రాసుకుని చూద్దును కదా అద్భుతం .

మళ్ళీ మా బామ్మ చేసిన పచ్చడే గుర్తుకు  వచ్చింది .

పెళ్ళిలో  మా బామ్మ చేసిన చింతపండు  పచ్చడి  గురించి   అక్కతో తెగ మాట్లాడాను కదా .

ఆ విషయం తన  బుర్రలో  రికార్డయి పోయిందేమో .
నవ్వుతూ అడిగింది  ఎలా ఉంది పచ్చడి ?  అమ్మమ్మ చేసిన పచ్చడిలా  ఉందా ? లేదా ?  అని .

ఏమనాలో తెలియక  మా బామ్మని  మరిపించావు ? అన్నాను .

బామ్మ దగ్గర  ఎప్పుడు  నేర్చుకున్నావు  ? అని  అడిగాను .

లేదు  మా అమ్మ నేర్పింది  అంది .

భోజనము  పూర్తయ్యాక ఇంటికి  వెళ్ళబోతుంటే  ఒక్క నిముషం  ఉండు  అని  GDR  ఇంగువ  డబ్బా  పెట్టే  పైన  Container నిండా  చింతపండు  పచ్చడి  పెట్టి , ఇంటికి  తీసుకెళ్ళు అని  నా చేతిలో  పెట్టింది .

అప్పుడు  మనసులో  పర్వాలేదు  ఇంకా  బంధువుల్లో ఆనాటి  రుచులూ , అభిమానాలు కొందరిలో నైనా  మిగిలి  ఉన్నాయి అనుకుంటూ ఇల్లు చేరాను .

****************************
ఆలూరుకృష్ణప్రసాదు .

ఇంక చింతపండు  పచ్చడి  తయారీ  విధానము .

చింతపండు  పచ్చడి .

కావలసినవి .

చింతపండు  -- 50  గ్రాములు .

ఎండు మిరపకాయలు -- 30 గ్రాములు   లేదా  షుమారుగా  - 20 .

బెల్లం  --  40  గ్రాములు .

ఉప్పు  --  తగినంత .

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
మెంతులు  --  పావుస్పూను
ఆవాలు  --  స్పూను .
ఇంగువ  --  తగినంత .
పసుపు  --  కొద్దిగా .

తయారీ  విధానము .

ముందుగా  పావుగంట సేపు చింతపండు  విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం చేసుకొని  ఒక  గిన్నెలో  పావు గ్లాసు  కన్నా  తక్కువ  నీళ్ళు  పోసుకుని  తడిపి  ఉంచుకోవాలి .

తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి , మెంతులు , ఆవాలు మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .

తర్వాత  బెల్లంను చిన్న చిన్న  ముక్కలుగా  దంపుకోవాలి.

ఇప్పుడు  పోపు  చల్లారగానే  మిక్సీ లో  ఈ పోపు  అంతా వేసుకుని  , తగినంత  ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  అందులో  నానబెట్టిన  చింతపండు  నీళ్ళతో సహా  వేసుకోవాలి .

పొడిగా చేసుకున్న  బెల్లం కూడా  వేసుకొని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

నీళ్ళు  తక్కువగా  పోస్తే  పచ్చడి  గట్టిగా  భోజనము  లో  కలుపు కోవడానికి  వీలుగా  ఉంటుంది .

ఈ పచ్చడి లో  అల్లం , మామిడి  అల్లం వంటివి  వెయ్యరు .

ఈ పచ్చడిలో  ధనియాలు, మినపప్పు , శనగపప్పు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు  వంటివి కూడా  వెయ్యరు .

ఈ పచ్చడి లో  తిరిగి  పోపు  పెట్టనవసరం లేదు .

ఈ పచ్చడి  ఫ్రిజ్  లో పెట్టకపోయినా  వారం రోజులు  నిల్వ  ఉంటుంది .

ఈ పచ్చడిలో  తీపి వేసుకుంటేనే  బాగుంటుంది .

అసలు  వాడని వారు  తీపి లేకుండా  చేసుకోండి .

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎందులోకైనా  బాగుంటుంది .

ఇదే  మా అక్క దగ్గర  తిని ఎలా చెయ్యాలో  రెసిపి  రాసుకుని  వచ్చిన  అసలు  సిసలైన  చింతపండు  పచ్చడి .

ఫోటో  ఈ రోజు  ఉదయం  అక్క చెప్పిన  పద్థతిలో  తయారు  చేసిన  చింతపండు  పచ్చడి .

సంబంధించిన  రెసిపీ  మరియు  ఫోటో  నా స్వంతం .

4 comments:

  1. with whose permission are you copying our content to blog? did he ask u to do so? what is ur fb id? Krishnaprasad garu is my father. mail me immediately to acchamgatelugu@gmail.com. we reported ur blog to google.

    ReplyDelete
  2. I am a big fan of A Krishna Prasad Gari vantalaku...request this blog admin don’t copy his content...if you want copy his content in this blog, blog admin must take permission from Krishna Prasad Garu...hereafter don’t copy his content..this is gentle note and warning...Akshar and Nagg

    ReplyDelete
  3. Looks like you are a journalist. Hope you will apologise to Sh Krishna prasad garu and stop copying further.

    ReplyDelete