నిమ్మకాయ కారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ మజా ఏ వేరు. అయితే, అన్ని సార్లూ ఆ ఊరగాయ లభ్యపడకపోవచ్చు. అందుకే ఇవాళ instant నిమ్మకాయ కారం పోస్ట్ చేస్తున్నాను. దీనికి ముక్కలు ఊరవేయడం, ఎండబెట్టడం అవసరంలేదు. One week వరకు నిలువ ఉంటుంది. ఈ instant pickle చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుందని posting. ఒకటి లేదా రెండు నిమ్మకాయల తో అయినా చేసేసుకోవచ్చు.
నిమ్మకాయలు పెద్దవి - 2
ఉప్పు, కారం 1:1 ratio lo తీసుకోవాలి. కాస్త మెంతిపిండి , ఇష్టమైతే ఆవపిండి కూడా కలుపుకోవచ్చు. (ఆవపిండి optional). ముందుగా రసం తీసుకుని అందులో నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు వేసుకొని , ఆ రసంలో ఉప్పు , కారం , మెంతిపిం డి వేసి తరువాత అందులో తాలింపు పెట్టుకోవడమే. తాలింపు నువ్వుల నూనె తో అయితే బాగుంటుంది. ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి , ఇంగువ తిరగమోత వేసుకొని కలిపేసుకోడమే. (నిమ్మరసం తీయగానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ఒక పూట ఊరాక మరింత బాగుంటుంది. అల్లం ముక్కలు వేసుకోవడం కూడా optional) . Instant pickle కాబట్టి ఆ పూటే తినేయచ్చు.
Thursday, 30 August 2018
Instant నిమ్మకాయ కారం
Sunday, 19 August 2018
దోసకాయ పచ్చడి
దోసకాయ ముక్కల పచ్చడి .
కావలసినవి .
పసుపు రంగు గట్టి దోసకాయ --- ఒకటి.
పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
చిన్న నిమ్మకాయంత చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి ..
పచ్చిమిరపకాయలు -- 10
కొత్తి మీర --- రెండు చిన్న కట్టలు .
మరి కాస్త వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది .
కట్టలు విడదీసి కాడలు తీసేసి కొత్తిమీర శుభ్రం చేసుకోవాలి .
ఉప్పు --- తగినంత
పసుపు --- కొద్దిగా .
పోపుకు .
ఎండుమిరపకాయలు -- 6
మినపప్పు --- స్పూను
మెంతులు --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- 50 గ్రాములు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోయాలి.
నూనె బాగా కాగనివ్వాలి .
నూనె బాగా కాగగానే మెంతులు , ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు బాగా వేగనివ్వాలి .
ఎక్కువ నూనె ఉంటే ఆఖరున పచ్చడిలో కలుపుకోవచ్చు.
బాండీ లోనే ఉంచేయండి
పోపు చల్లారగానే ముందుగా రోటి లో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు మరియు పసుపు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.
తరువాత పచ్చిమిర్చి , తడిపిన చింతపండు మరియు పోపును రోటిలోలో వేసి మరో సారి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.
చివరగా దోసకాయ ముక్కలు మరియు కొత్తిమీర వేసి ఒకే ఒక్కసారి దోసకాయ ముక్కలు నలగ కుండా పైపైన బండతో నూరుకోవాలి .
తర్వాత నూరిన పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకుని బాండీలో కాగిన మిగిలిన నూనె అందులో పోసి గరిటతో ముక్కలు పచ్చడి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయముక్కలు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
Friday, 17 August 2018
Modi about Atalji
Monday, 13 August 2018
కొబ్బరి కారం/కొబ్బరి పొడి
కావాల్సినవి:
ఎండు కొబ్బరి చిప్పలు --- 2
ఎండుమిరపకాయలు -- 15
జీలకర్ర -- స్పూనున్నర
వెల్లుల్లి పాయ రెబ్బలు -- 15
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .
ముందుగా స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టుకోవాలి .
ఎండు కొబ్బరి చిప్పలు స్టౌ మీద పెట్టి వెనుక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన వచ్చేదాకా కాల్చుకోవాలి .
ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడి పోవచ్చును లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం ఉంది .
కొబ్బరి చిప్పలు చల్లారగానే ఎండు కొబ్బరి తురుముతో తురుము కోవాలి .
లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఎండుమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
వెల్లుల్లి పాయలు పై పొట్టు తీయకుండా రెబ్బలుగా వలుచుకోవాలి .
ఇప్పుడు మిక్సీలో వేగిన ఎండుమిరపకాయలు , జీలకర్ర , తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు / లేక తురిమిన ఎండు కొబ్బరి మిక్సీ లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి .
తర్వాత ఒక సీసాలో భద్రపర్చుకోవాలి .
వెల్లుల్లి ఇష్టం లేని వారు మరో అర స్పూను జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు .
ఈ కొబ్బరి పొడి షుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది .
ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది.
Monday, 6 August 2018
నిమ్మకాయ కారం
నిమ్మకాయ కారం. రోటి పచ్చడి .
కావలసినవి .
ఎండుమిరపకాయలు -- పది
నిమ్మకాయలు -- 4
పొట్టు మినపప్పు -- 40 గ్రాములు
మెంతులు -- మూడు స్పూన్లు
ఆవాలు -- పావు స్పూను
పసుపు -- కొద్దిగా
ఇంగువ -- మరి కాస్త
జీలకర్ర -- పావు స్పూను
నూనె -- మూడు స్పూన్లు
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందు నిమ్మకాయలు అడ్డంగా కోసుకొని ఒక గిన్నెలో రసము తీసుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె కాగగానే ముందుగా మెంతులు, పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు వేసి కమ్మని వాసన వచ్చే దాకా వేయించుకోవాలి.
ఆ తర్వాత జీలకర్ర , ఇంగువ , వేసి వేగాక దింపి దానిపై కొద్దిగా పసుపు వేసుకోవాలి.
చల్లారగానే రోటిలో వేగిన పోపు , తగినంత ఉప్పు వేసి పప్పులు తగిలే విధంగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసిన నిమ్మరసం తో కలిపాలి.
స్పూను తో బాగా కలుపుకోవాలి .
ఈ నిమ్మకాయ కారం గట్టిగా ఉంటే బాగుంటుంది .
పల్చగా కావాలను కునే వారు మరో కాయ నిమ్మరసం పిండుకోండి.
ఈ నిమ్మకాయ కారం రోటిలో రోకలితో దంపుకుని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది .
ఈ కారం అన్నం లోకి , ఇడ్లీల లోకి , దోశెల లోకి , దిబ్బ రొట్టె లోకి కూడా చాలా బాగుంటుంది .
కందిపప్పు రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకుని , తగినన్ని నీళ్ళు పోసుకుని , ముద్దపప్పు లా వండుకుని , వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని , పప్పు కలుపుకుని, ఈ నిమ్మకాయ కారం నంచుకొని తిని ఎలా ఉందో చెప్పండి.
Friday, 3 August 2018
కంది పచ్చడి
షుమారు 100 సంవత్సరాల నుండి పెద్దలు తయారు చేసే కంది పచ్చడి .
కందిపచ్చడి.
తయారీ విధానము .
150 గ్రాముల కందిపప్పు , స్పూనున్నర జీలకర్ర , పది ఎండుమిరపకాయలు బాండిలో నూనె లేకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
చల్లారగానే తగినంత ఉప్పు వేసి , కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
రోటి సౌకర్యం ఉన్నవారు మధ్య మధ్య లో నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది .
నిజానికి కందిపచ్చడి , కొబ్బరి పచ్చడి రోట్లో రుబ్బుకుంటేనే రుచిగా ఉంటాయి ,
ఇష్టమైన వారు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పచ్చడి రుబ్బేటప్పుడు కాని లేదా మిక్సీ వేసుకునేటప్పుడు కాని వేసుకోవచ్చును.
రుచికరమైన కందిపచ్చడి దోశెల లోకి, గారెల లోకి, ఇడ్లీల లోకి , చపాతీలలోకి మరియు భోజనము లోకి సిద్ధం.
ఎవరి అభిరుచి అనుసారంగా కొద్దిగా చింతపండు వేయడం , కరివేపాకు వేసి రుబ్బడం మరియు పైన పోపు వేసుకోవడం చేసుకొనవచ్చును .
అవి అన్నీ కాలానుగుణంగా వచ్చిన మార్పులు .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.