అతిథులను భోజనానికి మన ఇంటికి ఆహ్వానించినప్పుడు .
ఆలూరుకృష్ణప్రసాదు .
మనందరి ఇళ్ళల్లో తరచుగా అతిథులను మన ఇంటికి భోజనానికి ఆహ్వానించడమనేది మనందరికీ తరచుగా జరుగుతూనే ఉంటుంది .
Weekends లో సరదాగా వారింటికి వీరు లేదా వీరింటికి వారు families తో విందు భోజనాలకి వెళ్ళడమనేది మామూలే.
ఆ సమయంలో ఇంటి ఇల్లాళ్ళకు ప్రధానమైన సమస్య ఏ ఏ పదార్ధాలు తయారు చెయ్యాలి ?
మనం చేసిన పదార్ధాలు వారికి నచ్చుతాయో లేదో ?
వారు తింటారో లేదో ? అని.
ఇంకా కొంచెం మొహమాటం లేకుండా చెప్పాలంటే వచ్చే వారి కులమును బట్టి కూడా పదార్ధాలు మరియు వాటిని తయారు చేయు విధానము కూడా మారుతుంటాయి.
అయితే మనవి ప్రధానంగా శాఖాహార భోజన సంఘ సభ్యుల గ్రూపులు కనుక , మనమంతా శాఖాహారుల పదార్థములు గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది .
ప్రధానంగా ఈ విందు భోజనాలు రెండు రకాలు.
మధ్యాహ్నం విందు LUNCH.
రాత్రి విందు DINNER.
షుమారు 15 మంది లోపు Guest ల కైతే , ఆ ఇంటి ఇల్లాలు ఆరేడు ఐటమ్స్ అవలీలగా వండేస్తారు.
ఏదైనా ప్రధానంగా functions సమయంలో , వచ్చే అతిథులు 25 సంఖ్య దాటినా , వంట మనిషిని పెట్టుకుని చేయించుకోవడం కానీ లేదా క్యాటరింగ్ ఇవ్వడం కాని తప్పని సరి.
మధ్యాహ్నం భోజనం Lunch కు , రాత్రి భోజనం Dinner కు ఐటమ్స్ మారుతుంటాయి.
లోగడ నన్ను ఐదారుగురు , " రేపు మా అబ్బాయి పుట్టినరోజు లేదా మా అమ్మాయి function , ఒక పాతిక మందికి ఏ ఏ ఐటమ్స్ వండితే బాగుంటుందో చెప్పండి " అని అడిగారు.
అప్పుడు నాకున్న అవగాహన మేరకు వారికి ఐటమ్స్ చెప్పాను.
అయితే అచ్చంగా మన తెలుగింటి భోజనము వండి తృప్తిగా వచ్చిన అతిధులకు పెట్టాలనుకునే వారికి మాత్రమే, నేను ఈ దిగువున అతిథులను మన ఇంటికి ఆహ్వానించి నప్పుడు ఏ ఏ పదార్ధములు తయారు చేస్తే బాగుంటుందో తెలియచేస్తున్నాను .
మీకు సంతృప్తిగా నచ్చితేనే ఇందులో కొన్ని ఐటమ్స్ అయినా చేసి పెట్టండి.
ఆ ఇందంతా trash , ఈ రోజుల్లో ఇవి ఎవడు తింటాడు ? పళ్ళాలు విసిరేస్తారు.
విస్తళ్ళముందు నించి లేచి పోతారు . మా పిల్లలకు పిలిచే అతిధులకు Northern Dishes కావాలి అనే వాళ్ళు , కామెంట్ చేసే వాళ్ళకు ఒకటే నా సవినయ విజ్ఞప్తి .
" అయ్యా / అమ్మా .
ఈ పోస్టింగు మీ కొరకు కాదు.
మాలాంటి ఛాందస భావాలు కలిగిన పాత తరం వారికి . మీ వంటి ఆధునిక భావాలు కలవారు దయచేసి ఈ పోస్టింగు చదవవద్దు. ఒకవేళ చదివినా మీరు పట్టించుకోవద్దు. దయచేసి ఏ విధమైన negative Comment చేయవద్దు. మీకు తోచిన పద్ధతిలోనే మీరు సాగిపోండి . "
ఇంక అసలు విషయానికి వద్దాము.
అతిథులను భోజనానికి పిలిచినప్పుడు మీ ఇంట్లో ఐటమ్స్ లో వెల్లుల్లి వాడే అలవాటు ఉన్నా మీరు ఆ రోజు వంటల్లో వెల్లుల్లి వేయకండి. ఎందుకంటే వెల్లుల్లి అసలు తినని వారు చాలా మంది ఉంటున్నారు. అటువంటి వారు ఆ ఐటమ్ వేసుకోరు. తెలియక మనం చేసి వారికి వడ్డించినా వారు తినకుండా పారేస్తారు. పదార్ధం వృధా అవడమే గాక వారికి మనకి అసంతృప్తి .
సాధ్యమయినంత వరకు పెద్ద ఉల్లి పాయను కూడా పదార్ధాలలో ఆ రోజు వాడకుండా ఉంటే మంచిది . చాలా మంది గురువారము , శనివారము పెద్ద ఉల్లిపాయ తినరు. ఈ మధ్య కొంతమంది " మేము అసలు ఉల్లిపాయ తినము , ఉల్లిపాయలు వేయని ఐటమ్స్ చెప్పండి ". అని అంటున్నారు .
వెజిటబుల్ బిర్యానీ వంటి మసాలా పదార్ధాన్ని చేసే కన్నా , చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ లేదా మామిడి కాయ తురుముతో పులిహోర కానీ చక్కగా జీడిపప్పులు మరియు వేరుశనగ గుళ్ళు వేసుకుని , ఒక ఐటమ్ గా చేసుకుంటే బాగుంటుంది.
మరో ఐటమ్ గా గారెలు వంటి Heavy ఐటమ్ కంటే అరటికాయతో బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది.
స్వీట్ చేయాలనుకుంటే సేమియా , సగ్గు బియ్యం కలిపి పాయసం చేసుకుంటే బాగుంటుంది.
పిండి వంటలు ఇంతవరకు చాలు.
గారెలు , పూర్ణం బూరెలు , సజ్జప్పాలు ఇటువంటివి ఏవైనా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వడ్డనకు బాగుంటాయి.
విడి రోజుల్లో ఇంతకన్నా అవసరం లేదు.
ఇంక అతిధులు Lunch కు వచ్చే పక్షంలో
మధ్యాహ్నము భోజనానికి .
1. దోసకాయ పప్పు లేదా టమోటో పప్పు లేదా మామిడి కాయ పప్పు ( ఈ మూడింటిలో పెద్ద ఉల్లిపాయ వేయకుండా ) ఒక ఐటమ్ వండు కోవచ్చును.
సాధారణంగా functions లో ముద్దపప్పు వండరు. కలగలపు పప్పు మాత్రమే వండుతారు.
ఈ మూడు పప్పులలో ఎది వండినా ఊర మిరపకాయలు మరియు గుమ్మడి వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది.
2. ఇంక కూర విషయానికి వస్తే నూటికి 80 శాతం మంది ఏ functions లో అయినా మొట్టమొదటగా ఇష్టపడేది వంకాయ కూర. తర్వాత దొండకాయ కూర. మూడో పక్షం బెండకాయ కూర.
వంకాయలు పుచ్చులు లేకుండా కాయలు లేతగా ఉంటే , ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర మరియు ఇంగువ వేసుకుని నూనెలో వేయించి తగినంత ఉప్పువేసుకుని పొడి కొట్టుకుని కాయలలో కూరుకుని నూనెలో మగ్గపెట్టుకుని కూర చేసుకుంటే , ఈ వంకాయ కాయల పళంగా కూర అందరూ ఇష్ట పడతారు. ఇది అందరూ మెచ్చుకునే కూర.
కాని పక్షంలో దొండకాయ చీలికలుగా తరిగి ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకును నూనెలో వేసుకుని ముక్కలను మగ్గపెట్టి చివరలో తగినంత ఉప్పు కారం వేసుకుని పోపు కూర చేసుకోవచ్చును. ఈ కూర కూడా చాలా మంది ఇష్ట పడతారు.
చివరగా బెండకాయ జిగురు అని చాలా మంది పోపు కూర ఇష్టపడరు. పై రెండు వీలుకాని పక్షంలో బెండకాయ ముక్కలు తరిగి నూనెలో fry చేసి పావు చిప్ప ఎండుకొబ్బరి కోరాముతో కోరి అందులో వేసి , ఒక పదిహేను జీడిపప్పు పలుకులు వేసి , ఉప్పు కారం చల్లుకుంటే కూర కలర్ ఫుల్ గా కనపడటమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది .
ఇంక అతిధులను భోజనానికి పిలిచినప్పుడు సాధారణంగా ఆకు కూరలతో పప్పు , మరియు కాకరకాయ , క్యాబేజీ , క్యాలీఫ్లవర్ వంటివి వండరు. ఆ కూరలు వారికి ఇష్టమో కాదో తెలియనప్పుడు అవి చేయకపోవడమే మంచిది.
3. పచ్చడులు.
దోసకాయ ముక్కలుగా తరిగి కొత్తిమీర వేసుకుని ముక్కల పచ్చడి చేసుకుంటే బాగుంటుంది.
లేదా
మామిడి కాయ ముక్కలతో మెంతి బద్దలు వేసుకుని మామిడి కాయ ముక్కల పచ్చడి బాగుంటుంది.
లేదా
కొబ్బరి పచ్చడి కాని కొబ్బరి మామిడి కాయ పచ్చడి కాని చేసుకున్నా బాగుంటుంది .
లేదా
గోంగూర అకు - ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు , ఇంగువ నూనెలో వేసి గోంగూర ఆకు మరియు కొద్దిగా పసుపు వేసి మగ్గబెట్టి , తగినంత ఉప్పు వేసి పచ్చడి చేసుకొనవచ్చును .
ఈ పచ్చడి కూడా పుల్ల పుల్లగా ఉంటుంది కనుక అతిధులకు నచ్చుతుంది.
ఇంక ఈ వేసవికాలం ఆవకాయల సీజన్ లో కొత్తావకాయ మరియు నోరూరించే మాగాయ వంటివి విడిగా bowl లో తీసి పెడితే ఇంక చెప్పే దేముంది ?
4. లిక్విడ్ ఐటమ్ .
అతిధులు వచ్చినప్పుడు చారు కన్నా ముక్కల పులుసు వండితేనే బాగుంటుంది. చింతపండు రసములో అన్ని ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపు వేసి ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , కొంచెం మెంతులు , కొంచెం జీలకర్ర , ఎండు కొబ్బరి , ఇంగువ వేసుకుని నూనెలో వేయించి పొడి కొట్టుకుని ఆ పొడి మరుగుతున్న పులుసులో వేసుకుని పులుసు పెట్టుకుంటే ఆ పులుసు రుచే వేరు.
5. అతిథులు వచ్చినప్పుడు మజ్జిగ కన్నా పెరుగు బాగుంటుంది. ఈ వేసవికాలం పెరుగు అన్నంలో తయారైన బంగినపల్లి మామిడి పండు ముక్కలు కోసి అతిధులకు వడ్డిస్తే విందుకు శోభ వస్తుంది.
6. తాంబూలము లేదా కిళ్ళీలు గా చుట్టి ఇస్తే అతిధులు సంతోషిస్తారు.
7. నేను చెప్పినది మధ్యాహ్నం భోజనం Lunch లో items ఏం చేస్తే బాగుంటుందో సూచనా ప్రాయంగా నా సలహా మాత్రమే.
8. రాత్రి Dinner కు అతిథులను ఆహ్వానిస్తే menu కొద్దిగా మారుతుంది . ఈ పోస్టింగు మీకు నచ్చితే త్వరలో Dinner items ఏమి చేయాలో కూడా తెలియచేస్తాను.
9. కమ్మని నెయ్యి తో పైన తెలిపిన పదార్ధాలను వడ్డించారా !! ఇక అతిధులు తృప్తిగా భోజనము చేసి " అన్నదాతా సుఖీభవ !! " అని అనకుండా ఉంటారా చెప్పండి.
10. చివరగా " తాళము వేసితిని గొళ్ళెము మరచితిని " అనే సామెత చెప్పినట్లు మల్లెపూవు లాంటి వేడి వేడి అన్నం వండటం మాత్రం మరచి పోకండి.
చివరగా అతిథులను భోజనానికి ఆహ్వానించే వారికి నా విజ్ఞప్తి. " గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు " అన్నట్లుగా మీరు వడ్డించే పదార్ధాలు తక్కువ ఐటమ్స్ ఐనా మీరు ఆప్యాయంగా నవ్వుతూ వడ్డిస్తే భుజించే వారు బ్రహ్మానందపడిపోతారు.
మహిళలందరికీ కృతజ్ఞతాపూర్వకధన్యవాదములు.
ఆలూరుకృష్ణప్రసాదు .
కారణం వండే శ్రమంతా మీదే కనుక.
No comments:
Post a Comment