ఆవకాయై నమః
ఆవకాయ, మాగాయ కోసం అందరిలాగే నేను కూడా పుట్టింటి వైపు (అమరావతి-విజయవాడ) చూస్తూ కూర్చున్నా. సాధారణంగా మా వాళ్ళు ఏప్రిల్ చివరి వారంలో మామిడికాయ నూజివీడు పెద్దరసాలతో మాగాయ, మే నెల మొదటి వారంలో చిన్న రసాలతో ఆవకాయ పెడతారు. మే రెండో వారం వచ్చినా.. రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నా.. పుట్టింటి నుంచి ఆ శుభవార్త వినబడటంలేదు. దీంతో ఉండబట్టలేక చిన్నబ్బాయిని అడిగేశా ఆవకాయ, మాగాయ పెట్టారా? అని. 'లేదు డాడీ, మన ఏరియా అంతా క్వారంటైన్ లో ఉందిగా, బయటకు వెళ్ళట్లేదు, మామిడికాయలు కొనలేదు' అన్నాడు. ఆశలు వదులుకోలేక భాగ్యనగరంలోని బంధువులకు ఫోన్ చేశా. నేరుగా అడిగితే బాగుండదని.. ఏవేవో ముచ్చట్లు చెప్పి.. అడిగితే.. 'మామిడి కాయలను ముక్కలు కొట్టేచోట సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు బావా! అందుకని ఈసారి డ్రాప్ అయ్యాం' అని సమాధానం. ఎక్కడో చైనాలో పుట్టిన 'కత్రినా' ఇక్కడకు వచ్చి తరతరాల మన సంప్రదాయాన్ని భంగపరుస్తోందనే భావన కలగ్గానే మనసు చివుక్కుమంది. ఇంతలో మా వీధి చివర కూరగాయల కొట్లో నిన్న చామ దుంపలు కొంటుంటే షాపువాడు 'పచ్చడి మామిడి కాయలు ఉన్నాయి. కావాలా సార్' అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే వెళ్ళి నాలుగు కాయలు కొన్నా. పక్కనే ఉన్న కిరాణా షాపు లో ఓ కిలో సన్న ఆవాలు, ఓ కిలో 'మహేష్' బ్రాండ్ రాళ్ళ ఉప్పు కొన్నాను. అటు నుంచి అటే వెళ్లి మోర్ సూపర్ మార్కెట్లో ఐటీసీ ఆశీర్వాద్ గుంటూరు కారం, ఓ లీటర్ ఏ.ఎస్. బ్రాండ్ నువ్వుల నూనె తెచ్చి పడేశా. మా బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఉండే సూర్యచంద్రుల దగ్గరి బంధువు ఆంటీ గారికి చెప్పి ఆవాలు, ఉప్పు ఎండలో పెట్టించా. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యాగం మొదలుపెట్టా. మిక్సీలో వేర్వేరుగా ఆవాలు, ఉప్పు మెత్తగా పట్టి సిద్ధం చేశా. కూరగాయలను తరిగే చాకుతో ముదురు టెంక కలిగిన మామిడికాయలను ఖండించడానికి బాహుబలి లాగా బిల్డప్ ఇవ్వడం సరికాదని అనిపించింది. గ్యాస్ స్టౌ మీద వంట గిన్నెలు దించే పట్టకారును సాయం అడిగా. అది సరే అంది. మామిడికాయ ముక్కలు రెడీ అయ్యాయి. ఆవకాయ పెట్టుడు పని సగం పూర్తి అయిందనిపించింది. అమ్మ ఆవకాయ పెట్టే రోజులను గుర్తు చేసుకుంటూ కొలతలు సరిచూసుకున్నా. ఓ బేసిన్ లో రెండు గ్లాసుల ఆవపిండి, మూడు గ్లాసుల కారం, ఓ గ్లాసున్నర ఉప్పు వేసి ఉండలు రాకుండా మూడూ పూర్తిగా కలిసేలా చేతితోనే కలుపుకున్నా. మామిడికాయ ముక్కలను కూడా చేర్చి మరోసారి కలియబెట్టా. ఆ మిశ్రమంలో నువ్వుల నూనె వేస్తూ గరిటెతో కలియబెట్టా. ఓ టేబుల్ స్పూన్ మెంతులను బాండీలో నూనె లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకూ వెయించి తీసి ఆవకాయలో కలిపా. అంతే అమృతం రెడీ. విజయ దరహాసం మెరిసింది. కొత్త ఆవకాయపై మోజుతో.. వేడి వేడి అన్నంలో దుర్గా నెయ్యి, హెరిటేజ్ పెరుగుతో సాయంత్రం 7.30కే డిన్నర్ ముగించా. చాలా కష్టపడి అలసిపోయానని అనిపించింది. అమ్మ గుర్తొచ్చింది.. 'నేను వంద కాయలతో పెట్టే దాన్ని, నువ్వు నాలుగు కాయలతో పెట్టి ఇంత స్టోరీ చెప్పావా?' అంటున్నట్లు అనిపించింది. నవ్వుకుంటూ నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నా.
.........
సూచన:
కొలతల కోసం మానికలు, సోలలు ఇప్పుడు లేవు. గ్రాములలో తూయడానికి కాటాలు ఉండవు. అయినా లెక్క ప్రకారం చేయాలి. రోజూ అన్నం వండుకునేందుకు బియ్యం కొలిచే గ్లాసును ప్రామాణికంగా తీసుకుని.. మామిడికాయ ముక్కలను కొలిస్తే ఐదు గ్లాసులు వచ్చాయి. దానికి రెండు గ్లాసుల ఆవపిండి (రెండు గ్లాసుల ఆవాలను మిక్సీ పెడితే రెండుంబావు గ్లాసుల పిండి వచ్చింది), రమూడు గ్లాసుల కారం, గ్లాసున్నర ఉప్పు మిశ్రమం, లీటరు నువ్వుల నూనె సరిపోయింది. రెండు రోజులు గడిస్తే.. మామిడికాయ ముక్కల్లో పులుపు ఊరి ఆ మిశ్రమంలో కలిసిన తర్వాతే ఆవకాయ అసలు రుచి తెలుస్తుంది. అప్పుడు కావాలంటే కారంగాని, ఉప్పుగానీ అదనంగా కలుపుకోవచ్చు. గుంటూరు మిర్చి కారంలో ఘాటు ఎక్కువ. బళ్ళారి మిర్చి వాడితే కారం తక్కువ అనిపించినా ఎరుపురంగు బాగా వస్తుంది. ఆవకాయ కలిపేటప్పుడు కొందరు ఆ రెండు రకాల కారాలను వాడతారు. నేను పెట్టిన ఆవకాయ లుక్ చూస్తే కారం ఇంకొంచెం కలపాలేమో అనిపిస్తోంది.
(పోస్ట్ లో ఎడిట్ చేశాను) )
ఇవాళ ఆవకాయ రుచి చూసి కొలతలలో ఈ మార్పు చేశా: 1) కారం మరో గ్లాసు, 2) ఉప్పు మరో అరగ్లాసు, 3) మిగతా పావు లీటరు నువ్వుల నూనె కలిపి ఆవకాయను తిరగదీశా.
అంటే.. మొత్తం
ఆవపిండి 2 గ్లాసులు
కారం 3 గ్లాసులు
ఉప్పు ఒకటిన్నర గ్లాసులు కలిపాను.
ఆవకాయలో ముక్కల కన్నా పిండి (ఆవపిండి-కారం-ఉప్పు మిశ్రమం) కొంచెం ఎక్కువ ఉండేలా కలిపాను. మామిడికాయ పులుపుతో సరిపోతుంది. అన్నంలో కలుపుకునేటప్పుడు ముక్క ఒకటి వేసుకుని పిండి ఎక్కువ వచ్చేలా వేసుకుంటాం. అలాగే ఇడ్లీలు, దోశల్లోకి కూడా ముక్క లేకుండా ఆవకాయ వేసుకోవచ్చు.
గతంలో అమ్మ వాళ్ళు, పెద్దలు చేసినట్లు రుచి రాకపోవచ్చు. ఏడాది నిల్వ ఉండక పోవచ్చు (అంటే ఇలా నాలుగు కాయలతో పెడితే ఏడాదంతా ఎలా సరిపోతుంది?) ముక్కలు కొట్టేవాడు లేక పూర్తిగా మానేసే బదులు ఇలా ఆవకాయ పెట్టుకోవచ్చు.
ఖర్చు:
మామిడికాయలు 4 (నాలుగు).. ₹ 80/-
సన్న ఆవాలు. కిలో.. ₹ 120/-
రాళ్ళ ఉప్పు కిలో.. ₹ 12/-
ఐటీసీ ఆశీర్వాద్ కారం 200 గ్రాములు ₹ 60/-
ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె కిలో .. ₹ 333/-
మెంతులు ఒక టేబుల్ స్పూను
(మొత్తం ఆవాలు వాడలేదు, 2 గ్లాసులను మాత్రమే మిక్సీపట్టాను)
గ్లాసుతో కొలతలు ఇలా వచ్చాయి:
1) సన్న ఆవాలు కిలో 1కి - 7 గ్లాసులు (అంటే గ్లాసుకి 142 గ్రాములు)
2) మెత్తగా పట్టిన ఉప్పు కిలో 1కి - 5 గ్లాసులు (గ్లాసుకి 200 గ్రాములు)
3) కారం 200 గ్రాములకి - 3 గ్లాసులు (గ్లాసుకి 66 గ్రాములు)
ఫొటో, రెసిపీ నా స్వంతం
నిడుమోలు వెంకటేశ్వరరావు
No comments:
Post a Comment