Tuesday, 26 May 2020

Preparing Lunch for guests

అతిథులను  భోజనానికి  మన ఇంటికి ఆహ్వానించినప్పుడు .

ఆలూరుకృష్ణప్రసాదు .

మనందరి  ఇళ్ళల్లో  తరచుగా అతిథులను మన ఇంటికి భోజనానికి  ఆహ్వానించడమనేది  మనందరికీ తరచుగా జరుగుతూనే ఉంటుంది .

Weekends లో సరదాగా  వారింటికి  వీరు  లేదా  వీరింటికి  వారు  families తో  విందు భోజనాలకి  వెళ్ళడమనేది  మామూలే.

ఆ సమయంలో  ఇంటి  ఇల్లాళ్ళకు ప్రధానమైన సమస్య ఏ ఏ పదార్ధాలు తయారు చెయ్యాలి ? 

మనం చేసిన పదార్ధాలు  వారికి  నచ్చుతాయో లేదో ? 

వారు  తింటారో  లేదో ?  అని.

ఇంకా  కొంచెం  మొహమాటం లేకుండా  చెప్పాలంటే   వచ్చే వారి  కులమును బట్టి కూడా పదార్ధాలు  మరియు  వాటిని  తయారు చేయు విధానము కూడా  మారుతుంటాయి.

అయితే  మనవి ప్రధానంగా శాఖాహార భోజన సంఘ సభ్యుల గ్రూపులు కనుక , మనమంతా  శాఖాహారుల  పదార్థములు  గురించి మాత్రమే  ఇక్కడ  ప్రస్తావించడం జరుగుతుంది .

ప్రధానంగా ఈ విందు భోజనాలు  రెండు రకాలు.

మధ్యాహ్నం  విందు  LUNCH.

రాత్రి  విందు  DINNER.

షుమారు  15  మంది లోపు Guest ల కైతే , ఆ ఇంటి ఇల్లాలు  ఆరేడు  ఐటమ్స్  అవలీలగా  వండేస్తారు.

ఏదైనా  ప్రధానంగా  functions  సమయంలో , వచ్చే అతిథులు 25 సంఖ్య దాటినా , వంట మనిషిని పెట్టుకుని చేయించుకోవడం కానీ  లేదా క్యాటరింగ్  ఇవ్వడం  కాని  తప్పని సరి.

మధ్యాహ్నం  భోజనం Lunch కు , రాత్రి  భోజనం  Dinner కు  ఐటమ్స్   మారుతుంటాయి.

లోగడ నన్ను ఐదారుగురు , " రేపు  మా అబ్బాయి పుట్టినరోజు  లేదా మా అమ్మాయి  function ,  ఒక పాతిక మందికి ఏ ఏ ఐటమ్స్ వండితే బాగుంటుందో చెప్పండి  " అని  అడిగారు.

అప్పుడు నాకున్న అవగాహన మేరకు వారికి   ఐటమ్స్  చెప్పాను.

అయితే అచ్చంగా  మన తెలుగింటి  భోజనము  వండి  తృప్తిగా  వచ్చిన అతిధులకు పెట్టాలనుకునే వారికి  మాత్రమే,   నేను ఈ దిగువున  అతిథులను మన ఇంటికి ఆహ్వానించి నప్పుడు ఏ ఏ పదార్ధములు తయారు చేస్తే బాగుంటుందో తెలియచేస్తున్నాను .

మీకు సంతృప్తిగా  నచ్చితేనే  ఇందులో కొన్ని  ఐటమ్స్  అయినా  చేసి పెట్టండి.

ఆ ఇందంతా trash , ఈ రోజుల్లో  ఇవి ఎవడు తింటాడు ? పళ్ళాలు విసిరేస్తారు.
విస్తళ్ళముందు నించి  లేచి పోతారు . మా పిల్లలకు పిలిచే అతిధులకు Northern Dishes కావాలి అనే వాళ్ళు , కామెంట్  చేసే వాళ్ళకు  ఒకటే నా సవినయ విజ్ఞప్తి .

" అయ్యా / అమ్మా .

ఈ పోస్టింగు  మీ కొరకు  కాదు.
మాలాంటి ఛాందస భావాలు కలిగిన పాత తరం వారికి .  మీ వంటి ఆధునిక భావాలు కలవారు దయచేసి ఈ పోస్టింగు  చదవవద్దు. ఒకవేళ చదివినా  మీరు పట్టించుకోవద్దు. దయచేసి ఏ విధమైన  negative Comment చేయవద్దు. మీకు తోచిన పద్ధతిలోనే మీరు సాగిపోండి . "

ఇంక అసలు విషయానికి  వద్దాము.

అతిథులను భోజనానికి  పిలిచినప్పుడు మీ ఇంట్లో ఐటమ్స్  లో వెల్లుల్లి  వాడే అలవాటు ఉన్నా మీరు ఆ రోజు వంటల్లో వెల్లుల్లి  వేయకండి. ఎందుకంటే  వెల్లుల్లి  అసలు తినని వారు చాలా మంది ఉంటున్నారు. అటువంటి వారు ఆ ఐటమ్ వేసుకోరు. తెలియక మనం చేసి వారికి  వడ్డించినా  వారు తినకుండా పారేస్తారు. పదార్ధం వృధా అవడమే గాక వారికి మనకి అసంతృప్తి .

సాధ్యమయినంత వరకు  పెద్ద ఉల్లి పాయను కూడా పదార్ధాలలో ఆ రోజు వాడకుండా ఉంటే మంచిది . చాలా మంది గురువారము , శనివారము పెద్ద ఉల్లిపాయ తినరు. ఈ మధ్య కొంతమంది   " మేము  అసలు  ఉల్లిపాయ  తినము , ఉల్లిపాయలు  వేయని  ఐటమ్స్  చెప్పండి ". అని  అంటున్నారు .

వెజిటబుల్  బిర్యానీ వంటి మసాలా పదార్ధాన్ని చేసే కన్నా , చింతపండు  పులిహోర కానీ  నిమ్మకాయ పులిహోర కానీ లేదా మామిడి  కాయ తురుముతో పులిహోర కానీ  చక్కగా  జీడిపప్పులు  మరియు వేరుశనగ  గుళ్ళు  వేసుకుని , ఒక ఐటమ్ గా చేసుకుంటే బాగుంటుంది.

మరో ఐటమ్ గా గారెలు వంటి Heavy ఐటమ్ కంటే  అరటికాయతో బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది.

స్వీట్  చేయాలనుకుంటే  సేమియా , సగ్గు బియ్యం  కలిపి పాయసం చేసుకుంటే బాగుంటుంది.

పిండి వంటలు ఇంతవరకు  చాలు.

గారెలు , పూర్ణం బూరెలు , సజ్జప్పాలు  ఇటువంటివి ఏవైనా ప్రత్యేక సందర్భాలలో  మాత్రమే వడ్డనకు బాగుంటాయి. 

విడి రోజుల్లో  ఇంతకన్నా అవసరం లేదు.

ఇంక అతిధులు Lunch కు వచ్చే పక్షంలో
మధ్యాహ్నము  భోజనానికి .

1. దోసకాయ పప్పు లేదా టమోటో  పప్పు లేదా మామిడి  కాయ పప్పు ( ఈ మూడింటిలో  పెద్ద ఉల్లిపాయ వేయకుండా )  ఒక ఐటమ్  వండు కోవచ్చును.

సాధారణంగా  functions  లో  ముద్దపప్పు వండరు. కలగలపు పప్పు మాత్రమే వండుతారు.

ఈ  మూడు పప్పులలో ఎది  వండినా  ఊర మిరపకాయలు  మరియు గుమ్మడి వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది.

2. ఇంక కూర విషయానికి వస్తే నూటికి  80 శాతం మంది  ఏ functions  లో అయినా  మొట్టమొదటగా ఇష్టపడేది  వంకాయ కూర. తర్వాత దొండకాయ కూర. మూడో పక్షం బెండకాయ కూర.

వంకాయలు పుచ్చులు లేకుండా కాయలు లేతగా ఉంటే , ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర మరియు ఇంగువ వేసుకుని  నూనెలో వేయించి  తగినంత  ఉప్పువేసుకుని పొడి కొట్టుకుని కాయలలో కూరుకుని నూనెలో మగ్గపెట్టుకుని కూర చేసుకుంటే , ఈ వంకాయ కాయల పళంగా కూర అందరూ ఇష్ట పడతారు. ఇది అందరూ మెచ్చుకునే కూర.

కాని పక్షంలో  దొండకాయ చీలికలుగా తరిగి ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకును నూనెలో వేసుకుని  ముక్కలను మగ్గపెట్టి చివరలో తగినంత ఉప్పు కారం వేసుకుని  పోపు కూర చేసుకోవచ్చును. ఈ కూర కూడా  చాలా మంది ఇష్ట పడతారు.

చివరగా బెండకాయ జిగురు అని చాలా మంది పోపు కూర ఇష్టపడరు. పై రెండు వీలుకాని పక్షంలో బెండకాయ ముక్కలు తరిగి  నూనెలో  fry చేసి పావు చిప్ప ఎండుకొబ్బరి కోరాముతో కోరి  అందులో వేసి , ఒక పదిహేను జీడిపప్పు  పలుకులు వేసి , ఉప్పు కారం చల్లుకుంటే  కూర కలర్ ఫుల్ గా కనపడటమే కాకుండా  రుచిగా  కూడా ఉంటుంది .

ఇంక అతిధులను భోజనానికి  పిలిచినప్పుడు సాధారణంగా  ఆకు కూరలతో పప్పు , మరియు కాకరకాయ , క్యాబేజీ , క్యాలీఫ్లవర్ వంటివి  వండరు. ఆ కూరలు వారికి ఇష్టమో కాదో తెలియనప్పుడు అవి  చేయకపోవడమే మంచిది.

3. పచ్చడులు.

దోసకాయ ముక్కలుగా తరిగి కొత్తిమీర  వేసుకుని ముక్కల పచ్చడి చేసుకుంటే బాగుంటుంది.
 
లేదా

మామిడి కాయ  ముక్కలతో మెంతి బద్దలు వేసుకుని  మామిడి  కాయ ముక్కల పచ్చడి బాగుంటుంది.

లేదా 

కొబ్బరి పచ్చడి కాని  కొబ్బరి మామిడి కాయ పచ్చడి కాని  చేసుకున్నా బాగుంటుంది .

లేదా

గోంగూర  అకు -  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు , ఇంగువ నూనెలో వేసి గోంగూర ఆకు మరియు కొద్దిగా  పసుపు వేసి మగ్గబెట్టి , తగినంత ఉప్పు వేసి పచ్చడి చేసుకొనవచ్చును .

ఈ పచ్చడి కూడా  పుల్ల పుల్లగా ఉంటుంది కనుక అతిధులకు  నచ్చుతుంది.

ఇంక ఈ వేసవికాలం ఆవకాయల సీజన్ లో  కొత్తావకాయ  మరియు  నోరూరించే  మాగాయ వంటివి  విడిగా  bowl లో తీసి పెడితే  ఇంక చెప్పే దేముంది ?

4.  లిక్విడ్ ఐటమ్ .

అతిధులు  వచ్చినప్పుడు చారు కన్నా ముక్కల పులుసు వండితేనే  బాగుంటుంది. చింతపండు  రసములో అన్ని ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపు వేసి ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , కొంచెం  మెంతులు , కొంచెం  జీలకర్ర  , ఎండు కొబ్బరి , ఇంగువ వేసుకుని నూనెలో వేయించి  పొడి కొట్టుకుని ఆ పొడి మరుగుతున్న పులుసులో వేసుకుని  పులుసు పెట్టుకుంటే ఆ పులుసు రుచే వేరు.

5. అతిథులు వచ్చినప్పుడు  మజ్జిగ  కన్నా పెరుగు బాగుంటుంది. ఈ వేసవికాలం పెరుగు  అన్నంలో తయారైన బంగినపల్లి మామిడి పండు ముక్కలు కోసి అతిధులకు వడ్డిస్తే విందుకు శోభ వస్తుంది.

6. తాంబూలము లేదా కిళ్ళీలు గా చుట్టి ఇస్తే అతిధులు సంతోషిస్తారు.

7.  నేను చెప్పినది  మధ్యాహ్నం  భోజనం  Lunch  లో items ఏం చేస్తే బాగుంటుందో సూచనా ప్రాయంగా నా సలహా మాత్రమే. 

8. రాత్రి  Dinner కు అతిథులను ఆహ్వానిస్తే menu కొద్దిగా  మారుతుంది . ఈ పోస్టింగు  మీకు నచ్చితే  త్వరలో Dinner items ఏమి చేయాలో కూడా తెలియచేస్తాను.

9.  కమ్మని  నెయ్యి తో  పైన  తెలిపిన  పదార్ధాలను  వడ్డించారా !!  ఇక  అతిధులు  తృప్తిగా  భోజనము  చేసి  " అన్నదాతా  సుఖీభవ !!  " అని  అనకుండా  ఉంటారా చెప్పండి.

10.  చివరగా  " తాళము వేసితిని  గొళ్ళెము మరచితిని " అనే సామెత చెప్పినట్లు  మల్లెపూవు లాంటి  వేడి వేడి అన్నం వండటం మాత్రం  మరచి పోకండి.

చివరగా  అతిథులను  భోజనానికి  ఆహ్వానించే వారికి  నా  విజ్ఞప్తి. " గంగి గోవు పాలు  గరిటెడైనను  చాలు  కడివెడైన  నేమి  ఖరము  పాలు  "  అన్నట్లుగా   మీరు వడ్డించే  పదార్ధాలు  తక్కువ  ఐటమ్స్  ఐనా  మీరు  ఆప్యాయంగా  నవ్వుతూ  వడ్డిస్తే  భుజించే  వారు  బ్రహ్మానందపడిపోతారు.

మహిళలందరికీ  కృతజ్ఞతాపూర్వకధన్యవాదములు.
ఆలూరుకృష్ణప్రసాదు .
కారణం వండే శ్రమంతా  మీదే కనుక.

Friday, 22 May 2020

మజ్జిగ పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ  రోజు  స్పెషల్.

మజ్జిగ   పులుసు.

తయారు  చేయు  విధానము .

ముందుగా  అర లీటరు  కమ్మని పెరుగు చక్కగా కవ్వంతో గిలక్కొట్టి  గడ్డలు లేకుండా  చూసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన  పెట్టి ఉంచుకోవాలి,

పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు.

అందులో పావు స్పూన్ లో సగం  పసుపు వేసుకుని  గరిటతో బాగా కలపండి.

ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు . పావు స్పూనులో సగం ఆవాలు. పావు స్పూను లో సగం జీలకర్ర , చిన్న అల్లంముక్క, పావు చిప్ప పచ్చి కొబ్బరిముక్క వేసి ఒక అరగంట కాసిని నీళ్ళు పోసి నానబెట్టి ,  ఆ తర్వాత ఆ నీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఆ ముద్దని మజ్జిగ  లో కలపండి.

నాలుగు  పచ్చిమిరపకాయలు  తీసుకుని నిలువుగా చీలికలు గా తరిగి మజ్జిగ ముద్దలో వేయండి. 

కరివేపాకు  రెండు రెమ్మలు తీసుకుని ఆకులు  దూసుకుని  కడిగి మజ్జిగ  లో వేయండి.

తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.

ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి  అందులో రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని , రెండు ఎండు మిరపకాయలు ముక్కలుగా  చేసుకుని  . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకర్ర. ఆవాలు కొద్దిగా ,  కొద్దిగా  ఇంగువ,   మరియు  కొంచెం కరివేపాకు  వేసి పోపు పెట్టి మజ్జిగ లో కలపండి.

ఆనపకాయ పై చెక్కు  తీసుకుని , ముక్కలు  చిన్నవిగా తరిగి ఉంచుకొని  విడిగా కుక్కర్ లో మెత్తగా  ఉడికించి బాగా చల్లారాక మజ్జిగ  లో కలపండి.

రెండు టమోటాలు మరియు రెండు క్యారెట్లు చెక్కుతీసి , టమోటో లు మరియు క్యారెట్లు ముక్కలుగా కూడా తరిగి  మజ్జిగలో వేసుకోండి.

ఇప్పుడు  ఈ  మజ్జిగ  పులుసును
stove మీద పెట్టి పొంగకుండా గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వండి.

 మజ్జిగ  పులుసు  పొంగి  క్రింద పడిపోతే  పై  నురుగు లోని  taste  పోతుంది .

బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి   దింపిన మజ్జిగ  పులుసు లో వేసి  మూత పెట్టి ఉంచాలి . 

వేడి  వేడి అన్నంలో కలుపుకుని తింటే  ఆ  రుచి  అద్భుతం . 

ఒక్క విషయం అన్నీ వేసాక stove మీద ఎందుకు  పెట్టమన్నానంటే ముందుగానే  పెడితే  కొన్ని సార్లు  మజ్జిగ  పులుసు విరిగిపోతుంది.

ఈ మజ్జిగ  పులుసు  మరుసటి  రోజుకు  కూడా   రుచిగా  ఉంటుంది.

అంతే  . ఎంతో  రుచిగా  ఉండే  మజ్జిగ  పులుసు సర్వింగ్  కు  సిద్ధం.

వేసవి కాలంలో  భోజనము లోకి మజ్జిగ  పులుసు  వంటివి  తయారు చేసుకుంటే చలువ చేస్తుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు  విధానము  మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

Monday, 18 May 2020

ఆవకాయ Avaiaya

ఆవకాయై నమః

ఆవకాయ, మాగాయ కోసం అందరిలాగే నేను కూడా పుట్టింటి వైపు (అమరావతి-విజయవాడ) చూస్తూ కూర్చున్నా. సాధారణంగా మా వాళ్ళు ఏప్రిల్ చివరి వారంలో మామిడికాయ నూజివీడు పెద్దరసాలతో మాగాయ, మే నెల మొదటి వారంలో చిన్న రసాలతో ఆవకాయ పెడతారు. మే రెండో వారం వచ్చినా‌‌.. రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నా.. పుట్టింటి నుంచి ఆ శుభవార్త వినబడటంలేదు. దీంతో ఉండబట్టలేక చిన్నబ్బాయిని అడిగేశా ఆవకాయ, మాగాయ పెట్టారా? అని. 'లేదు డాడీ, మన ఏరియా అంతా క్వారంటైన్ లో ఉందిగా, బయటకు వెళ్ళట్లేదు, మామిడికాయలు కొనలేదు' అన్నాడు‌. ఆశలు వదులుకోలేక భాగ్యనగరంలోని బంధువులకు ఫోన్ చేశా. నేరుగా అడిగితే బాగుండదని.. ఏవేవో ముచ్చట్లు చెప్పి.. అడిగితే.. 'మామిడి కాయలను ముక్కలు కొట్టేచోట సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు బావా! అందుకని ఈసారి డ్రాప్ అయ్యాం' అని సమాధానం. ఎక్కడో చైనాలో పుట్టిన 'కత్రినా' ఇక్కడకు వచ్చి తరతరాల మన సంప్రదాయాన్ని భంగపరుస్తోందనే భావన కలగ్గానే మనసు చివుక్కుమంది. ఇంతలో మా వీధి చివర కూరగాయల కొట్లో నిన్న చామ దుంపలు కొంటుంటే షాపువాడు 'పచ్చడి మామిడి కాయలు ఉన్నాయి. కావాలా సార్' అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే వెళ్ళి నాలుగు కాయలు కొన్నా. పక్కనే ఉన్న కిరాణా షాపు లో ఓ కిలో సన్న ఆవాలు, ఓ కిలో 'మహేష్' బ్రాండ్ రాళ్ళ ఉప్పు కొన్నాను. అటు నుంచి అటే వెళ్లి మోర్ సూపర్ మార్కెట్లో ఐటీసీ ఆశీర్వాద్ గుంటూరు కారం, ఓ లీటర్ ఏ.ఎస్. బ్రాండ్ నువ్వుల నూనె తెచ్చి పడేశా.‌ మా బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఉండే సూర్యచంద్రుల దగ్గరి బంధువు ఆంటీ గారికి చెప్పి ఆవాలు, ఉప్పు ఎండలో పెట్టించా. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యాగం మొదలుపెట్టా. మిక్సీలో వేర్వేరుగా ఆవాలు, ఉప్పు మెత్తగా పట్టి సిద్ధం చేశా. కూరగాయలను తరిగే చాకుతో ముదురు టెంక కలిగిన మామిడికాయలను ఖండించడానికి బాహుబలి లాగా బిల్డప్ ఇవ్వడం సరికాదని అనిపించింది. గ్యాస్  స్టౌ  మీద వంట గిన్నెలు దించే పట్టకారును సాయం అడిగా. అది సరే అంది. మామిడికాయ ముక్కలు రెడీ అయ్యాయి. ఆవకాయ  పెట్టుడు పని సగం పూర్తి అయిందనిపించింది‌. అమ్మ ఆవకాయ పెట్టే రోజులను గుర్తు చేసుకుంటూ కొలతలు సరిచూసుకున్నా. ఓ బేసిన్ లో రెండు గ్లాసుల ఆవపిండి, మూడు గ్లాసుల కారం, ఓ గ్లాసున్నర ఉప్పు వేసి ఉండలు రాకుండా మూడూ పూర్తిగా కలిసేలా చేతితోనే కలుపుకున్నా. మామిడికాయ ముక్కలను కూడా చేర్చి మరోసారి కలియబెట్టా. ఆ మిశ్రమంలో నువ్వుల నూనె వేస్తూ గరిటెతో కలియబెట్టా. ఓ టేబుల్ స్పూన్ మెంతులను బాండీలో నూనె లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకూ వెయించి తీసి ఆవకాయలో కలిపా. అంతే అమృతం రెడీ. విజయ దరహాసం మెరిసింది. కొత్త ఆవకాయపై మోజుతో.. వేడి వేడి అన్నంలో దుర్గా నెయ్యి, హెరిటేజ్ పెరుగుతో సాయంత్రం 7.30కే డిన్నర్ ముగించా. చాలా కష్టపడి అలసిపోయానని అనిపించింది.  అమ్మ గుర్తొచ్చింది.. 'నేను వంద కాయలతో పెట్టే దాన్ని, నువ్వు నాలుగు కాయలతో పెట్టి ఇంత స్టోరీ చెప్పావా?' అంటున్నట్లు అనిపించింది. నవ్వుకుంటూ నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నా. 
........‌.

సూచన:
కొలతల కోసం మానికలు, సోలలు ఇప్పుడు లేవు. గ్రాములలో తూయడానికి కాటాలు ఉండవు. అయినా లెక్క ప్రకారం చేయాలి. రోజూ అన్నం వండుకునేందుకు బియ్యం కొలిచే గ్లాసును ప్రామాణికంగా తీసుకుని.. మామిడికాయ ముక్కలను కొలిస్తే ఐదు గ్లాసులు వచ్చాయి. దానికి రెండు గ్లాసుల ఆవపిండి (రెండు గ్లాసుల ఆవాలను మిక్సీ పెడితే రెండుంబావు గ్లాసుల పిండి వచ్చింది), రమూడు గ్లాసుల కారం, గ్లాసున్నర ఉప్పు మిశ్రమం, లీటరు నువ్వుల నూనె సరిపోయింది. రెండు రోజులు గడిస్తే.. మామిడికాయ ముక్కల్లో పులుపు ఊరి ఆ మిశ్రమంలో కలిసిన తర్వాతే ఆవకాయ అసలు రుచి తెలుస్తుంది. అప్పుడు కావాలంటే కారంగాని, ఉప్పుగానీ అదనంగా కలుపుకోవచ్చు. గుంటూరు మిర్చి కారంలో ఘాటు ఎక్కువ. బళ్ళారి మిర్చి వాడితే కారం తక్కువ అనిపించినా ఎరుపురంగు బాగా వస్తుంది. ఆవకాయ కలిపేటప్పుడు కొందరు ఆ రెండు రకాల కారాలను వాడతారు.  నేను పెట్టిన ఆవకాయ లుక్ చూస్తే కారం ఇంకొంచెం కలపాలేమో అనిపిస్తోంది.

(పోస్ట్ లో ఎడిట్ చేశాను) )
ఇవాళ ఆవకాయ రుచి చూసి కొలతలలో ఈ మార్పు చేశా‌: 1) కారం మరో గ్లాసు, 2) ఉప్పు మరో అరగ్లాసు, 3) మిగతా పావు లీటరు నువ్వుల నూనె కలిపి ఆవకాయను తిరగదీశా. 

అంటే..‌ మొత్తం  
ఆవపిండి 2 గ్లాసులు
కారం 3 గ్లాసులు
ఉప్పు ఒకటిన్నర గ్లాసులు కలిపాను. 

ఆవకాయలో ముక్కల కన్నా పిండి (ఆవపిండి-కారం-ఉప్పు మిశ్రమం) కొంచెం ఎక్కువ ఉండేలా కలిపాను. మామిడికాయ పులుపుతో సరిపోతుంది. అన్నంలో కలుపుకునేటప్పుడు ముక్క ఒకటి వేసుకుని పిండి ఎక్కువ వచ్చేలా వేసుకుంటాం. అలాగే ఇడ్లీలు, దోశల్లోకి కూడా ముక్క లేకుండా ఆవకాయ వేసుకోవచ్చు.

గతంలో అమ్మ వాళ్ళు, పెద్దలు చేసినట్లు రుచి రాకపోవచ్చు. ఏడాది నిల్వ ఉండక పోవచ్చు (అంటే‌ ఇలా నాలుగు కాయలతో పెడితే ఏడాదంతా ఎలా సరిపోతుంది?) ముక్కలు కొట్టేవాడు లేక పూర్తిగా  మానేసే బదులు ఇలా ఆవకాయ పెట్టుకోవచ్చు.

ఖర్చు:
మామిడికాయలు 4 (నాలుగు)..       ₹   80/-
సన్న ఆవాలు.                        కిలో.. ₹ 120/-
రాళ్ళ ఉప్పు                          కిలో..  ₹   12/-
ఐటీసీ ఆశీర్వాద్ కారం 200 గ్రాములు ₹  60/-
ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె కిలో .. ₹  333/-
మెంతులు ఒక టేబుల్ స్పూను

(మొత్తం ఆవాలు వాడలేదు, 2 గ్లాసులను మాత్రమే మిక్సీపట్టాను)

గ్లాసుతో కొలతలు ఇలా వచ్చాయి:
1) సన్న ఆవాలు కిలో 1కి - 7 గ్లాసులు (అంటే గ్లాసుకి 142 గ్రాములు)
2) మెత్తగా పట్టిన ఉప్పు కిలో 1కి - 5 గ్లాసులు (గ్లాసుకి 200 గ్రాములు)
3) కారం 200 గ్రాములకి - 3 గ్లాసులు (గ్లాసుకి 66 గ్రాములు)

ఫొటో, రెసిపీ నా స్వంతం

నిడుమోలు వెంకటేశ్వరరావు

పనసపొట్టు కూర

పనసకాయల్లో  కూర కాయలు  మరియు  పండు కాయలు  రెండూ  వేరుగా  ఉంటాయి.

కూరకు  పనికి  వచ్చే  పనస కాయల  కణుపులు  దగ్గరగా  ఉంటాయని , అదే  పండుకు పనికి  వచ్చే  కాయల కణుపులు  కాస్త  ఎడంగా  ఉంటాయి. పనస కాయ  నుండి పనన పొట్టు  కొట్టడానికి  ప్రత్యేకమైన  కత్తి  ఉంటుంది . దానినే  పనస కత్తి అని  అంటారు.
పనస పొట్టు  కొట్టగానే  పనస పొట్టు పైన  వెంటనే  కొద్దిగా  నూనె , పసుపు  మరియు  కొద్దిగా  ఉప్పును  వేసుకుని  చేతితో  పొట్టు  అంతటికీ  బాగా పట్టించాలి.

వాళ్ళు  గిద్దలు  లెక్కన  అమ్ముతారు. షుమారుగా  గిద్ద రూ. 15 /- లకు  అమ్ముతారు.
రెండు  గిద్దల  పొట్టు  ఈనాటి  కొలతల ప్రకారము  షుమారుగా  పావుకిలో  అనగా  250 గ్రాములు  ఉండవచ్కూచు. 
కూర పనస కాయ జిగురు అంటకుండా  చేతికి  నూనె  రాసుకుని  కత్తిపీటతో  పైన  చెక్కు తీసేసి  చిన్న చిన్న ముక్కలుగా  తరుగుకుంటాము.

పనస పొట్టు  కూర.
*****************

కావలసినవి .

పనస పొట్టు  -  250 గ్రాములు.
చింతపండు  -  40 గ్రాములు.
చింతపండును  విడదీసుకుని , గింజలను మరియు ఈనెలను  తీసి వేసుకుని , ఒక పావుగంట సేపు  వేడి నీళ్ళలో  నానబెట్టుకుని , ఒక అర కప్పు చిక్కని  రసం తీసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పనస పొట్టు  కూర  తయారు  చేయబోయే  ముందే  కూరలో  పెట్టుకోవడానికి  ఆవ ను  సిద్ధం  చేసుకోవాలి . పనస పొట్టు  కూరకు  ఆవ పెడితేనే  కూరకు  అసలు సిసలు  రుచి  వస్తుంది.

ముందుగా  అన్నీ సిద్ధం చేసుకున్నాకే  పనస పొట్టుకూర తయారు చేసుకోవాలి .

ఆవ  తయారు  చేసుకోవడం.
*************************

ఆవాలు  ఒక స్పూను , పచ్చిమిర్చి  ఒకటి , ఎండు మిర్చి  ఒకటి , పసుపు కొద్దిగా , ఉప్పు కొద్దిగా  మిక్సీలో  మెత్తగా  వేసుకుని తర్వాత అందులోనే  కొద్దిగా  నీళ్ళు పోసుకుని మిక్సీలో  మెత్తగా  తిప్పుకుని  ఆవను  సిద్ధం  చేసుకుని ,  ఒక కప్పు లోకి  తీసుకోవాలి .

ఇక  పనస పొట్టు కూర తయారు చేసుకునే  ముందు  సిద్ధం  చేసుకోవలసిన  మిగిలినవి .

మినప్పిండి చిన్న వడియాలు -  ఒక అర కప్పు తీసుకుని ,  నూనెలో మాడకుండా బంగారు రంగులో వేయించుకుని  విడిగా  ఉంచుకోవాలి .

పచ్చిమిరపకాయలు  - 6
తొడిమలు  తీసి  నిలువుగా  ముక్కలు  తరిగి  ఉంచుకోవాలి ,

కరివేపాకు  -  నాలుగు  రెమ్మలు .
ఆకు  దూసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పోపునకు.

ఎండుమిరపకాయలు -  8
ముక్కలుగా చేసుకోవాలి .

నూనె  -  ఆరు  స్పూన్లు.

పచ్చిశనగపప్పు - మూడు  స్పూన్లు.

చాయమినపప్పు - స్పూనున్నర.

ఆవాలు  -  స్పూను.

ఇంగువ  -  పావు  స్పూను లో సగం.

కారము  -  స్పూను .

పసుపు  -  పావు స్పూను.

ఉప్పు  -  తగినంత .

ముందుగా  పనస పొట్టులో  కొద్దిగా  నూనె , కొద్దిగా  పసుపు  మరియు  కొద్దిగా ఉప్పు  వేసుకోవాలి.  చేతితో  బాగా కలుపు కోవాలి.

కొన్న పనస పొట్టులో  అమ్మే  వారు  పై వన్నీ  ముందుగానే కలిపి  అమ్ముతారు  కనుక  మనము  ప్రత్యేకంగా  కలుపుకోవలసిన  అవసరము  లేదు.

ఈ పనసపొట్టులో  తగినన్ని  నీళ్ళు పోసి స్టౌ  మీద పెట్టి  మెత్తగా  ఉడికేవరకు  ఉడకబెట్టుకోవాలి .

తర్వాత  ఉడికిన పనస పొట్టును  వార్చుకోవాలి.  పొట్టులో  నీళ్ళు  లేకుండా  పైన  పళ్ళెం పెట్టి  గట్టిగా  నొక్కుకోవాలి.

ఈ  ఉడికిన పనస పొట్టును  వేరుగా  ఒక  పళ్ళెంలోకి  తీసుకోవాలి .

పైవన్నీ  సిద్ధం చేసుకున్న తర్వాత  --

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టుకుని  మొత్తము  నూనెను  వేసుకుని  నూనెను  బాగా  కాగనివ్వాలి.

నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండు మిరపకాయల  ముక్కలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు   మరియు కరివేపాకును  వేసుకుని  పోపు  వేయించుకోవాలి.

వేయించిన  పోపులోనే  చింతపండు  రసము , పసుపు  , తగినంత  ఉప్పు  మరియు  కారమును  వేసుకుని  అందులోనే  ఉడికించిన  పనస పొట్టును కూడా వేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిముషాలు పాటు కూరను  మగ్గ నివ్వాలి.

ఇప్పుడు  స్టౌ ఆపి  నూరి  సిద్ధముగా  ఉంచుకున్న ఆవ ,  కూర  మీద వేసుకుని  , ఆవపై  ఒక  స్పూను  పచ్చి నూనె  వేసుకోవాలి . తర్వాత  గరిటెతో  ఆవ కూరంతటికీ  పట్టే  విధముగా  బాగా  కలుపుకోవాలి.

అంతే . మీకు  ఇప్పుడు  ఎంతో  రుచిగా  ఉండే  పనసపొట్టు  కూర  సిద్ధమైంది.

వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న  చిట్టి  మినప వడియాలు  కూర వడ్డించుకునే  ముందు  కూరలో  వేసుకుని  ఒకసారి  గరిటెతో  కలుపుకుని  వడ్డించుకుంటే , తింటున్నప్పుడు  వడియాలు  మెత్తపడకుండా  కర కర లాడుతూ  చాలా రుచిగా  ఉంటాయి.
Catering  వారు  మినప వడియాలకు బదులుగా జీడిపప్పును  నేతిలో  వేయించి  కూరలో  కలుపుతున్నారు. 
వేరు శనగ గుళ్ళు వేస్తే మాత్రము  పనసపొట్టు కూరలో  బాగుండదు.
ఆలూరుకృష్ణప్రసాదు .

Tuesday, 5 May 2020

చలిమిడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చలిమిడి .
*******

ఆడపిల్లను  అత్తవారింటికి  పంపే  సందర్భాలలో ప్రతి సారీ  కన్నతల్లి , తన కూతురికి  చలిమిడి  పెట్టి  పంపిస్తారు.

అలాగే  తన  కూతురు  గర్భవతై   మూడవ నెల  రాగానే కన్న తల్లి  వియ్యాల వారి ఇంటికి  వెళ్ళి ,  దొంగ చలిమిడి  అని కూతురి  ఒడిలో  చలిమిడి పెడతారు .  ఎవ్వరికీ  తెలుపకుండా చలిమిడి  పెడతారు కనుక దొంగ చలిమిడి  అనే  పేరు  వచ్చింది.

అలాగే  కూతురుకు  ఏడవ నెల  లేదా  తొమ్మిదివ నెల రాగానే   సీమంతం  చేసే   సందర్భాలలో కూడా ఆడంబరంగా అందరు ముత్తైదువులనూ పేరంటానికి పిలిచి  అమ్మాయికి  మరియు  వచ్చిన ముత్తైదువులందరికీ  గాజులు తొడిగించి , చలిమిడి , నానబెట్టిన శనగలు , పసుపు , కుంకుమ , పువ్వులు , తమలపాకులు , పండ్లు  తాంబూలముగా పంచి  సీమంతం పేరంటం చేస్తారు.

అలాగే  తన కుమార్తెకు  అమ్మాయి కాని  లేదా  అబ్బాయి కాని  పుట్టాక  , మూడవ నెలలో కాని  లేదా  ఐదవ నెలలో  కాని తమ కూతురును  పుట్టిన  బిడ్డతో  సహా  తిరిగి  అత్తవారింటికి  పంపుతున్న సమయంలో   చొంగ  చక్కిలాలు  అంటారుఅవి తయారు చేసి ,  వాటితో  సహా  ఇచ్చి  పంపే  సందర్భంలో కూడా  చలిమిడి కూడా  తయారు చేసి అమ్మాయికి  ఇచ్చి  అత్త వారింటికి  పంపుతారు.

ఇలా  అన్ని  శుభ సందర్భాలలో   చలిమిడి  కూతురుకు  పెట్టి పంపడం అనేది తర తరాలుగా మన ఇళ్ళల్లో వస్తున్న సాంప్రదాయం .

ఇ లా చలిమిడి  పెట్టి  పంపడం తన బిడ్డకు కడుపు చలవే కాకుండా , ఇరు కుటుంబాలకు క్షేమకరం  అని  పెట్టి పంపుతారు .

 వివాహం  ఐన  తర్వాత ఆడపిల్ల  పుట్టింటికి  వచ్చిన  ప్రతి సారి  ఇలా   పుట్టింటి  వారు  చలిమిడి  పెట్టి  పంపడం  అనేది  చాలా మంది  ఇళ్ళల్లో  ఈనాటికీ  సాంప్రదాయంగా పాటిస్తున్నారు.

అసలు  ఆడపిల్లకు   ప్రతి  సందర్భంలో చలిమిడి  పెట్టి  అత్తారింటికి పంపడం  అనేది , కడుపు చలవ అంటారు.

అలా చలిమిడి  ఆడపిల్ల ఒడిలో పెట్టే  సందర్భాలలో  , చలిమిడి  ముందు రోజు  మధ్యాహ్నము  కల్లా  తయారు చేసి , ఆ రోజు రాత్రి  చలిమిడిని  పుట్టింట్లోనే  నిద్ర చేయించి  మరుసటి  రోజు  అమ్మాయి భోజనము చేసిన తర్వాత కొత్త చీర , గాజులు , పసుపు , కుంకుమ , పూలు , పండ్లతో సహా , అమ్మాయి నుదుటిన  కుంకుమను పెట్టి  చలిమిడితో సహా అమ్మాయి  ఒడిలో  పెడతారు.

అమ్మాయి  సంతోషంగా  పుట్టింటి నుండి  అత్తవారింటికి  వెడితే , ఇటు పుట్టింటి వారికి  , అటు  అత్తింటి  వారికి కూడా  ఆనందదాయకమే కదా.

అయితే  ఈ  చలిమిడి  చేసే  విధానము   చాలా  మందికి   తెలియదు .

అందువలన  పెద్దలను  సంప్రదించి   మీ  అందరికీ  చలిమిడి తయారు చేయు  విధానము నేను  వివరంగా  తెలియచేస్తున్నాను .

చలిమిడి  తయారు చేయు  విధానము .
***************************

కావలసినవి .

బియ్యము   --  ఒక  కె. జి .

బెల్లం   --   ముప్పావు  కిలో

గసగసాలు  --  రెండు  స్పూన్లు .

స్టౌ  మీద బాండి పెట్టి  స్పూను  నెయ్యి వేసుకుని నెయ్యి కాగగానే  గసగసాలు వేసుకుని  వేయించుకుని   విడిగా  తీసుకోవాలి .

గసగసాలు చలిమిడి లో వేయడానికి  ఇష్ట పడని వారు  గసగసాలు  వేయకుండా  చలిమిడి  తయారు  చేసుకొనవచ్చును .  శుభ సందర్భాలలో నువ్వుపప్పు వాడరు . అందువలన నువ్వుపప్పు  చలిమిడి లో  వేయరు.
   
ఎండు కొబ్బరి  --  ఒక చిప్ప.
  
చిన్న ముక్కలుగా  తరిగి స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  తరిగిన  కొబ్బరి ముక్కలు   వేసుకుని  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన ముక్కలను  విడిగా ఒక  ప్లేటులో కి  తీసుకోవాలి.

లేదా  ఈ మధ్యన కొంతమంది  జీడిపప్పు ను కూడా  నేతిలో  వేయించి  వేసుకుంటున్నారు.  

ఆ విధముగా  ఎండు కొబ్బరి  ముక్కలతో పాటుగా  జీడిపప్పును కూడా  వేయించి  వేసుకొనవచ్చును .

ఇలా   గసగసాలు , ఎండు కొబ్బరి  ముక్కలు  మరియు  జీడిపప్పు  నేతిలో వేయించు కోవడం అనేది చలిమిడి తయారు చేయడానికి  ముందుగా  పాకం  పట్టే  సమయంలో   వేయించుకోవాలి .

వేరు శనగ గుళ్ళు చలిమిడి లో  వాడరు. 

యాలకులు  --  ఎనిమిది  యాలకులు  తీసుకుని  మెత్తని పొడిగా   చేసుకోవాలి . స్పూనున్నర  కొలతగా  తీసుకోవాలి .

తయారీ  విధానము .

ఒక  కె. జి . బియ్యము   తగినన్ని  నీళ్ళు పోసి  ముందు  రోజు  రాత్రి  నానబెట్టుకోవాలి .

కావలసినవి  సామగ్రి  అన్నీ  సిద్ధం  చేసుకున్నాక మరుసటి  రోజు   బియ్యము  వడకట్టి  పిండి  మరపెట్టించాలి .

మరపట్టించే  అవకాశము  లేని  వారు  మిక్సీ లో  వేసుకొనవచ్చు. 

పిండి  తడిగా  ఉన్నప్పుడు  బాగా  నొక్కి  పట్టి  ఉంచాలి .

బెల్లం  గడ్డలను   పొడిలా  పచ్చడి  బండతో  దంచుకోవాలి .

స్టౌ  మీద  గిన్నె  పెట్టి   నలగొట్టిన  బెల్లం  వేసి , బెల్లం   మునిగే  వరకు  నీళ్ళు పోసి జాగ్రత్తగా  చూసి  కదుపుతూ  బాగా  ఉండ పాకం  రానివ్వాలి .

ఉండపాకం  అంటే  ఒక  పళ్ళెంలో  నీళ్ళు  వేసి  ఉడుకుతున్న  కొద్ది   పాకం నీళ్ళల్లో  వేసి  చేతితో  చూస్తే  పాకం  బాగా  ఉండలా  రావాలి .

ఈ లోగా తడిపిండి  బాగా  జల్లించుకుని  బరకగా  ఉన్నది విడిగా  తీసేసుకోవాలి .

ఉండపాకం  రాగానే  స్టౌ  కట్టేసి  దించి   పాకంలో  వేయించిన  కొబ్బరి ముక్కలు , గసగసాలు ,  జీడిపప్పు మరియు యాలకులపొడి  వేసి ,   కొద్ది  కొద్దిగా  గుప్పెడు  గుప్పెడు  బియ్యపు  పిండిని పాకంలో  వేసుకుంటూ ఆపకుండా వెంటనే  అట్లకాడ  గాని లేదా గరిటెతో కాని  పాకం   కలుపుకుంటూ చలిమిడి    సరియైన  విధంగా వచ్చేటట్లు  చూసుకోవాలి .

తర్వాత  పిండిలో  మూడు  చెంచాలు   నెయ్యి వేసుకోవాలి .

పిండి  చాలా  మృదువుగా   వస్తుంది .

తరువాత  సందర్భానుసారం  ఉండలుగా  చేసుకోవచ్చు .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  చలిమిడి  సిద్ధం.

ఇష్టమైనవారు  జీడిపప్పు నేతితో  వేయించుకుని  వేసుకోవచ్చు .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము   తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.