Monday, 17 December 2018

పొంగలి

పొంగల్ . (  Ven  Pongal  )

తమిళ నాడు  అంతటా  ప్రతి రోజు  హోటళ్ళలో ఉప్మా  చేయరు.
పొంగల్  చేస్తారు .

కారణం  బొంబాయి రవ్వ , మైదా  పిండి  ఆరోగ్యరిత్యా  తగు  మోతాదులో   ఉపయోగించు  కోవాలని  అందరూ  చెప్తున్నారు .

ఈ  పొంగల్  బియ్యముతో  చేసుకుంటారు  కాబట్టి  ఆరోగ్యానికి  చాలా  మంచిది .

ఇంక  పొంగల్  తయారు  చేయడానికి  కావలసిన  వస్తువులు .

బియ్యము  --  ఒక  గ్లాసు
చాయపెసరపప్పు  --  అర  గ్లాసు
మిరియాలు  --   ఒకటిన్నర   స్పూను .
నెయ్యి  ---   ఒక  చిన్న  కప్పు.
ఉప్పు  --   తగినంత
అల్లం తరుగు  --  ఒకటిన్నర   స్పూను  జీలకర్ర   --  అర  స్పూను .
జీడిపప్పు  ---  30  గ్రాములు
కరివేపాకు   -  మూడు  రెమ్మలు 
పచ్చిమిర్చి   --  ఐదు  పొడుగ్గా   తరుగు కోవాలి .
ఇంగువ  ---   కొద్దిగా

ముందుగా  బియ్యాన్ని  , పెసరపప్పును  మునిగే వరకు  నీళ్ళు పోసి ఒక  గంట సేపు విడి  విడిగా  నానబెట్టు కోవాలి .

స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకొని  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసి   జీడిపప్పు ను  వేయించుకొని  పక్కన  పెట్టుకోవాలి .  

మిరియాలను  కొంచెం  కచ్చా పచ్చాగా  దంచుకొని  ఒక  ప్లేటులో  పెట్టుకోండి.

అదే  బాండిలో  మరో  రెండు స్పూన్లు   నెయ్యి వేసి  దంచి  పెట్టుకున్న  మిరియాలు  , జీలకర్ర  , అల్లం తరుగు ,  ఇంగువ , పచ్చి  మిర్చి  , కరివేపాకు  వేసి  పోపు వేగాక  ఒకటి  మూడు  చొప్పున  నీళ్ళు పోసి   అందులో  తగినంత   ఉప్పు వేసి అదే  నీళ్ళలో  నానబెట్టి  ఉంచుకున్న   బియ్యము  పెసరపప్పు  వేసి  మూత పెట్టి  మెత్తగా   ఉడకనివ్వాలి .

దింప బోయే  ముందు  మిగిలిన  నెయ్యి ,  వేయించి  ప్రక్కన  పెట్టుకున్న  జీడిపప్పు   వేసి  మరో  మూడు  నిముషాలు  ఉంచి  దింపు కోవాలి .

వేడి  వేడి  పొంగల్  సర్వింగ్  కు సిద్ధం .

ఇందులోకి  కొబ్బరి  చట్నీ ,  టమోటో  చట్నీ  రెండూ  బాగుంటాయి .

తమిళనాడు  అంతటా  అన్ని హోటళ్ళలోనూ  చక్కగా  లేత  అరిటాకు వేసి  పొంగల్  పెట్టి   పై రెండు  చట్నీలు  వేసి , వేడి  వేడిగా  పొగలు  కక్కుతున్న  సాంబారు  వేస్తారు .

ఎంత  రుచిగా  ఉంటుందో  !

మళ్ళీ  మధ్యాహ్నము  ఒంటి గంట  దాకా  ఆకలి  వెయ్యదు .

Tuesday, 11 December 2018

మీగడ జంతికలు

బియ్యపు పిండితో రుచికరమైన మీగడ చక్కిలాలు /  జంతికలు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు పిండితో  మీగడ  చక్కిలాలు.

కావలసినవి .

మర పట్టించిన బియ్యపు  పిండి --  నాలుగు  కప్పులు.

బియ్యము  నాన పెట్టే అవసరం లేదు.

మామూలు బియ్యమే  మర పట్టించాలి.

మీగడతో ఉన్న పెరుగు  --  ఒక కప్పు.

(  జంతికలు  పుల్లగా  తినడానికి  ఇష్ట పడే వారు  పుల్లని మీగడ పెరుగు  వేసుకోవచ్చును. )

మీగడ  పెరుగు  లభ్యం కాని యెడల  50 గ్రాముల  వెన్న  పిండి కలిపే సమయంలో వేసుకుని , మామూలు పెరుగు వేసుకుని  పిండి కలుపు కోవచ్చు.

ఉప్పు  -- తగినంత

కారము  -- ఒక స్పూను

వాము   --  ఒక  స్పూను

నువ్వుపప్పు  -  ఒక  స్పూను

నూనె   --  350  గ్రాములు.

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో మెత్తగా  మరపట్టించి జల్లెడ పోసుకున్న   బియ్యపు  పిండి ,  వాము , నువ్వుపప్పు , కారం,  వేసుకుని  అందులో  మీగడ పెరుగు / లేదా  వెన్న  మరియు పెరుగు వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని చేతితో  బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  అవసరమైతే కొద్దిగా   నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  పిండిని  గట్టిగా  కలుపుకోవాలి .

తర్వాత   కలిపిన  పిండిని  బాగా మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము   నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసుకునే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ ను  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్కిలాలు నూనెలో వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండే చల్ల చక్రాలు /  మీగడ చక్రాలు  అల్పాహారానికి  సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు   పైన నిల్వ ఉంటాయి.

Sunday, 25 November 2018

పల్లీలు-నువ్వు పప్పు పొడి / నువ్వుల పొడి

పల్లీలు  నువ్వుల పొడి.

పల్లీలు వేసుకోకుండా నువ్వుల పొడిగా కూడా చేసుకోవచ్చు.

కావలసినవి .

పల్లీలు  --  200 గ్రాములు
తెల్ల నువ్వులు --  100  గ్రాములు
ఎండుమిరపకాయలు  --  10
జీలకర్ర  --  స్పూను
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  పల్లీలు   స్టౌ  మీద  బాండి  పెట్టి  పల్లీలు  నూనె  వేయకుండా  కమ్మని వాసన  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  పై పొట్టు  తీసి  వేరుగా  ఉంచుకోవాలి .

మళ్ళీ   స్టౌ మీద బాండి  పెట్టి  తెల్ల నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్ర  నూనె  వేయకుండా    వేగిన  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చల్లారగానే  వేయించిన  పల్లీలు , నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  సరిపడే  ఉప్పువేసి   మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు  మరియు  భోజనము  లోకి  రుచికరమైన  పల్లీలు  నువ్వుపప్పు   పొడి  సిద్ధం.

Monday, 19 November 2018

వంకాయ పచ్చి పులుసు

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత
పసుపు  --  కొద్దిగా

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసివేసి కాయలను  వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క , తొడిమలు తీసిన వంకాయలు   అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  ఉల్లిపాయలు తో  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి   కాంబినేషన్  గా  కందిపచ్చడి లేదా కందిపొడి  చేసుకుంటారు .

చాలా రుచిగా  ఉంటుంది .

ఈ వంకాయ పచ్చిపులుసును వేడి  చెయ్యరు.

Tuesday, 9 October 2018

Sankarapali Sweet శంకరపాలి

హలో ఫ్రెండ్స్,

పెద్ద, చిన్న అందరూ తినగలిగే వంటకం ఇది. వంటకం పేరు "sankarapali" మహారాష్ట్ర తీపి పదార్థం. అదేనండి మనం మైదా చిప్స్ చేస్తాం కదా పాకం పట్టి కొంచెం అలాగే ...కానీ పాకం అవసరం లేదు. పిండిలోనే పంచదార పొడి కలిపి చిప్స్ చేసుకుని వేయుంచుకోవాలి.

బయట crispy గా, లోపల soft గా తినేకొద్ది తినాలనిపిస్తుంది అండీ. నేను స్వీట్ ప్రియురాలిని కదా కష్టపడి చేసి అన్ని తినేస్తే ఇంట్లో వాళ్లకు ఉండాలి కదా.. అందుకే డబ్బా దాచేసా..

మీరు ట్రై చేయండి ..

Recipe :  ఒక కప్ మైదా లో కొంచెం ఉప్పు వేసి జల్లించుకోవాలి. అందులో పావు కప్ వేడి నెయ్యి వేసి పిండిని బాగా కలపాలి. తరువాత 1/4 కప్ పంచదార పొడి, యాలకుల పొడి వేసి, వేడి పాలు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి ఒక 30 నిమిషాలు మూత పెట్టి తరువాత మందంగా చపాతీ లు చేసుకుని నూనె లో చిన్న మంట మీద వేయించుకోవాలి.

Sunday, 30 September 2018

Tamilnadu Special Asoka Halva అశోకా హల్వా

తమిళనాడు  స్పెషల్ .

అశోకా  హల్వా .

కావలసినవి .

చాయ పెసరపప్పు -- ఒక కప్పు
గోధుమ పిండి --  రెండు స్పూన్లు
యాలకులు  -- 5 మెత్తగా  పొడి చేసుకోవాలి.
పంచదార --  ఒక కప్పున్నర
నెయ్యి  --  ఒక కప్పు
జీడిపప్పు  --  15  పలుకులు .

తయారీ  విధానము .

స్టౌ వెలిగించి  బాండీ  పెట్టి  కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు  కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .

తర్వాత కుక్కర్లో  గిన్నె పెట్టి  వేయించిన  పప్పు వేసి  సరిపడా  నీళ్ళు పోసి  మూడు విజిల్స్  వచ్చే వరకు  ఉంచాలి .

తర్వాత  మెత్తగా  పప్పును యెనపాలి .

తర్వాత బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  విడిగా  ప్లేటులో తీసుకుని  ఉంచుకోవాలి .

తర్వాత  అదే బాండీలో  మరో స్పూను  నెయ్యి వేసి  గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకుని పక్కన  పెట్టు కోవాలి .

తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు  నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న  పెసర పప్పు  మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.

రెండూ దగ్గర  పడి  ఉడుకుతుండగానే  పది నిముషాల  తర్వాత  వేయించిన  గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని    మిఠాయి రంగు కొద్దిగా  పాలల్లో  కలుపుకుని   ఉడుకుతున్న హల్వాలో  పోసి గరిటతో  బాగా కలుపుకోవాలి .

తర్వాత  మిగిలిన  నెయ్యి  , జీడిపప్పు పలుకులు  వేసి  గరిటతో  బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  తమిళనాడు  స్పెషల్ అశోకా హల్వా  సర్వింగ్  కు సిద్ధం.

Wednesday, 26 September 2018

కొబ్బరి బర్ఫీ


కావాల్సినవి:
రెండు కప్పుల కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార, ఒక గ్లాసు పాలు.

బాండీలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి.. అది వేడెక్కగానే.. కొబ్బరి తురుము, పంచదార, పాలు వేసి కలపాలి. పంచదార కరిగి.. మొత్తం చిక్కబడి దగ్గరకు రాగానే (మైసూర్ పాక్ మాదిరిగా).. వేరే ప్లేట్ పై నెయ్యి రాసి దానిపై ఈ మిశ్రమాన్ని చేర్చాలి. మనకు కావలసిన సైజ్ లో కట్ చేసుకుంటే కొబ్బరి బర్ఫీ రెడీ.