ఆలూరుకృష్ణప్రసాదు .
చింతపండు పచ్చడి .
చింతపండు పచ్చడి . నాకు తెలిసినంత వరకు ఈ పచ్చడి ఫక్తు గుంటూరు జిల్లా పచ్చడి .
చిన్నప్పుడు బామ్మ చేసి పెట్టేది .
నాకు అప్పుడు ఐదారు ఏళ్ళ వయస్సు ఉండేదేమో .
అందులో ఏమేమి వేసి చేసేదో అర్ధం అయ్యేది కాదు . ఆ ఆలోచన కూడా ఉండేది కాదు.
కందిపచ్చడి చేసినప్పుడు , నెయ్యి వేసి కందిపప్పు వేయించి కుంపటి మీద కంచు గిన్నెలో ముద్ద పప్పు వండినప్పుడు , శనగపప్పు ఉడకపెట్టి పోపు వేసి అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కూర చేసినప్పుడు , మా బామ్మ తప్పనిసరిగా పక్కన చింతపండు పచ్చడి చేసేది .
పైన చెప్పిన వంటకాలలో చింతపండు పచ్చడి ఈ వంటకాల పక్కన ఆదరువుగా అద్భుతంగా ఉండేది .
ఆరోజుల్లో ఫ్రిజ్ లు ఎక్కడవి ?
మడి అంటే ముట్టుకోరని ఆ పేరు మీద రాచ్చిప్పల్లో దాచేవారు .
ఈ చింతపండు పచ్చడి చెక్కు చెదరకుండా ఐదారు రోజులు పైనే నిల్వ ఉండేది .
ఆ తర్వాత పచ్చడి ఇంకా మిగిలితే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో మినపప్పు , ఎండుమిర్చి , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు తో పోపు వేసి అందులో తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసి పోపులో మగ్గనిచ్చి , తర్వాత పోపును ఈ చింతపండు పచ్చడిలో వేసి స్పూనుతో బాగా కలిపి స్కూళ్ళకు హడావుడిగా పరిగెత్తే మాకు అన్నం లోకి వేసి పెట్టేది .
తియ్య తియ్యగా ఉండే ఆ పచ్చడి వేసుకుని తిని , కంచాలు కూడా నాకేసి స్కూళ్ళకు బ్యాగ్ లు భుజాన వేసుకొని పరిగెత్తే వాళ్ళం.
ఆ నాటి నుండి ఈ చింతపండు పచ్చడి రుచి అలా ఉండి పోయింది .
చాలా సార్లు మా ఇంట్లో , అప్పుడప్పుడు ఇతరుల ఇళ్ళల్లో తిన్నా , ఆ రుచి బలంగా బుర్రలో ఉండి పోవడం వలన బాగుంది కాని బామ్మ చేసిన పచ్చడి రుచి రాలేదు అని తిన్న ప్రతిసారి అనుకునే వాణ్ణి .
ఆ లోటును మా బామ్మకు వరుసకు మనవరాలు నాకు వరుసకు అక్క అయిన ఆమె ఈ మధ్యనే తీర్చింది .
ఇటీవల ఓ పెళ్ళిలో కలిసినప్పుడు మా బామ్మ చేసిన చింతపండు పచ్చడి గురించి చాలా సేపు వర్ణించి మరీ చెప్పాను .
ఏం మాట్లాడకుండా అన్నీ నవ్వుతూ వింది.
చివరలో ఓ ఆదివారం మా ఇంటికి భోజనానికి రమ్మంది .
నేను అలాగే అంటూ రెండుసార్లు వాయిదా వేసినా , తనే ఫోను చేసి ఈ ఆదివారం మా ఇంటికి భోజనానికి వస్తున్నావు అంతే . ఇంకేం మాట్లాడకు అని ఫోను పెట్టేసింది .
మరీ అంతగా మాటిమాటికి బ్రతిమాలించుకోవడం సభ్యత కాదని భోజనానికి వెళ్ళాను .
మెనూ అంతా బామ్మదే .
ముద్ద పప్పు , గుత్తివంకాయ పొడి కొట్టి కూరిన కూర , ముక్కల పులుసు , చింతపండు పచ్చడి మరియు పెరుగు .
పక్కనే నేతి గిన్నెలో ఘమ ఘమ లాడుతున్న వెన్న కాచిన నెయ్యి .
అరటి ఆకులో అచ్చంగా తెలుగు భోజనము నోరూరిస్తూ ఆహ్వానిస్తోంది .
ముందుగా పచ్చడి బాగా నెయ్యి వేసి కలుపుకునే అలవాటు ఉన్న నాకు చింతపండు పచ్చడి కలుపుకొబేయే ముందు వేలితో నాలిక్కి రాసుకుని చూద్దును కదా అద్భుతం .
మళ్ళీ మా బామ్మ చేసిన పచ్చడే గుర్తుకు వచ్చింది .
పెళ్ళిలో మా బామ్మ చేసిన చింతపండు పచ్చడి గురించి అక్కతో తెగ మాట్లాడాను కదా .
ఆ విషయం తన బుర్రలో రికార్డయి పోయిందేమో .
నవ్వుతూ అడిగింది ఎలా ఉంది పచ్చడి ? అమ్మమ్మ చేసిన పచ్చడిలా ఉందా ? లేదా ? అని .
ఏమనాలో తెలియక మా బామ్మని మరిపించావు ? అన్నాను .
బామ్మ దగ్గర ఎప్పుడు నేర్చుకున్నావు ? అని అడిగాను .
లేదు మా అమ్మ నేర్పింది అంది .
భోజనము పూర్తయ్యాక ఇంటికి వెళ్ళబోతుంటే ఒక్క నిముషం ఉండు అని GDR ఇంగువ డబ్బా పెట్టే పైన Container నిండా చింతపండు పచ్చడి పెట్టి , ఇంటికి తీసుకెళ్ళు అని నా చేతిలో పెట్టింది .
అప్పుడు మనసులో పర్వాలేదు ఇంకా బంధువుల్లో ఆనాటి రుచులూ , అభిమానాలు కొందరిలో నైనా మిగిలి ఉన్నాయి అనుకుంటూ ఇల్లు చేరాను .
****************************
ఆలూరుకృష్ణప్రసాదు .
ఇంక చింతపండు పచ్చడి తయారీ విధానము .
చింతపండు పచ్చడి .
కావలసినవి .
చింతపండు -- 50 గ్రాములు .
ఎండు మిరపకాయలు -- 30 గ్రాములు లేదా షుమారుగా - 20 .
బెల్లం -- 40 గ్రాములు .
ఉప్పు -- తగినంత .
పోపునకు .
నూనె -- నాలుగు స్పూన్లు
మెంతులు -- పావుస్పూను
ఆవాలు -- స్పూను .
ఇంగువ -- తగినంత .
పసుపు -- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా పావుగంట సేపు చింతపండు విడదీసి గింజలు లేకుండా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో పావు గ్లాసు కన్నా తక్కువ నీళ్ళు పోసుకుని తడిపి ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , మెంతులు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .
తర్వాత బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా దంపుకోవాలి.
ఇప్పుడు పోపు చల్లారగానే మిక్సీ లో ఈ పోపు అంతా వేసుకుని , తగినంత ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత అందులో నానబెట్టిన చింతపండు నీళ్ళతో సహా వేసుకోవాలి .
పొడిగా చేసుకున్న బెల్లం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
నీళ్ళు తక్కువగా పోస్తే పచ్చడి గట్టిగా భోజనము లో కలుపు కోవడానికి వీలుగా ఉంటుంది .
ఈ పచ్చడి లో అల్లం , మామిడి అల్లం వంటివి వెయ్యరు .
ఈ పచ్చడిలో ధనియాలు, మినపప్పు , శనగపప్పు , జీలకర్ర , పచ్చిమిరపకాయలు వంటివి కూడా వెయ్యరు .
ఈ పచ్చడి లో తిరిగి పోపు పెట్టనవసరం లేదు .
ఈ పచ్చడి ఫ్రిజ్ లో పెట్టకపోయినా వారం రోజులు నిల్వ ఉంటుంది .
ఈ పచ్చడిలో తీపి వేసుకుంటేనే బాగుంటుంది .
అసలు వాడని వారు తీపి లేకుండా చేసుకోండి .
ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , రోటీలు , చపాతీలు మరియు భోజనము లోకి ఎందులోకైనా బాగుంటుంది .
ఇదే మా అక్క దగ్గర తిని ఎలా చెయ్యాలో రెసిపి రాసుకుని వచ్చిన అసలు సిసలైన చింతపండు పచ్చడి .
ఫోటో ఈ రోజు ఉదయం అక్క చెప్పిన పద్థతిలో తయారు చేసిన చింతపండు పచ్చడి .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .