Friday, 19 July 2019

తెలగ పిండి కూర

తెలగపిండి  కూర.

తెలగ పిండి అంటే నువ్వుల నూనె తయారు చేసిన తర్వాత వచ్చే పిప్పి లేదా పిండి. సాధారణంగా నూనె  గానుగ (ఆయిల్ మిల్లు)లో ఇది దొరుకుతుంది.

బాలింతలకు  పాలు బాగా పడతాయని మా బామ్మ, అమ్మ చెప్పేవాళ్లు. ఇతర కూరల మాదిరిగా నే ఈ తెలగపిండి కూరను  కూడా అన్నంలో కలుపుకుని తినొచ్చు.

తయారీ విధానం:

ఓ గిన్నెలో 1 కప్పు తెలగపిండిని ఒకటిన్నర కప్పు నీటిలో ఉండలు లేకుండా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, అర టీ స్పూన్ మెంతులు, కొద్దిగా బెల్లం ముక్క చేర్చి సన్నటి సెగ మీద ఉడికించాలి. నీరు తగ్గి తడిఆరే వరకూ ఉడికించాలి.

వేరే బాండీ తాళింపు సిద్ధం చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కగానే.. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపగుళ్లు వేయాలి. అవి కొద్దిగా దోరగా వేగుతున్న సమయంలో ముక్కలు చేసిన రెండు/మూడు ఎండుమిరపకాయలు, కర్వేపాకు చేర్చాలి. అనంతరం, ఉడికిన తెలగపిండిని దాంట్లో వేసి కలియబెట్టాలి. బాండీపై మూతపెట్టాలి. తెలగపిండి తడి ఆరగానే (మగ్గిన తర్వాత) బాండి లోంచి తెలగ పిండి కూరను వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. అంతే, కమ్మటి తెలగపిండి కూర రెడీ.