Sunday, 24 December 2017

ఉసిరికాయ పచ్చడి

ఉసిరికాయ పచ్చడి . (  రోటి పచ్చడి )

మామూలుగా   సీజన్  లో  ఉసిరికాయ ముక్కలు గా   మెత్తగా   రోటిలో  దంపుకుని  గింజలను తీసి తొక్కిన ముక్కలను  ఒక జాడీలో  బాగా  నొక్కి పెట్టి , మూడు రోజులు  అలాగే   కదపకుండా  ఉంచి  నాలుగవ  రోజు  ఒక  బేసిన్  లోకి   తీసుకుని   సరిపడా  ఉప్పు  మరియు  పసుపు  వేసి  తిరిగి  జాడీలోకి  తీసుకుని  నొక్కి   పెట్టుకుంటాము.

దానిని  ఉసిరికాయ  నూరని  పచ్చడి  అంటాము .

ఈ  పచ్చడి  పూర్తిగా  సంవత్సరం  నిల్వ ఉంటుంది .

ఎవరికైన  పొరపాటున   జాడిపై  పొర  లాగా  కట్టినా , అది  బూజు  అనుకుని  పచ్చడి  మొత్తము   పారేయవద్దు .

అది  ఉసిరికాయ  పచ్చడి  సహజ  లక్షణం .

ఆ  పై  పొర  తీసేస్తే  లోపల  పచ్చడి  అంతా  Fresh  గా  ఉంటుంది .

ఇక  ఉసిరికాయ  రోటి  పచ్చడి  తయారీ  విధానము

కావలసినవి.

నూరని  ఉసిరి కాయ  పచ్చడి  --  ఒక   కప్పు .
ఎండుమిరపకాయలు  --  10 .
మెంతులు  ---  పావు  స్పూను
మినపప్పు  --   స్పూను
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా 
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి   నూనె మొత్తము వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు  , మినపప్పు  , మెంతులు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .

పోపు  చల్లారగానే  రోటి లో  ముందుగా   ఎండుమిరపకాయలు  వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి .

తర్వాత  మిగిలిన పోపు  , మరియు  ఉసిరి కాయ  పచ్చడి  కూడా  వేసి  బండతో  నూరుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  పచ్చడి  తీసుకోవాలి .

నిల్వ  పచ్చడి  పెట్టే సమయంలో నే  సరిపడా  ఉప్పు వేసుకుంటాము  కనుక  ఇంక   మరలా ఉప్పు  వేయనవసరం  లేదు.

అంతే  పుల్ల  పుల్ల గా  ఎంతో  రుచిగా  ఉండే  ఉసిరి కాయ  పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం .

ఈ నూరిన పచ్చడి  నాలుగు  రోజులు  నిల్వ  ఉంటుంది .

భోజనము లో  మొట్టమొదట గా  ముందు  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని  కలుపుకు  తినాలి .

అద్భుతమైన   రుచిగా  ఉంటుంది .

Thursday, 21 December 2017

హాట్ కేక్ Egg less

గుడీవినింగ్ ఫ్రెండ్స్..
హాట్ కేక్ లా...అంటారు కదా..
       ఇదిగో అదే నేను చేసిన హాట్ హాట్ కేక్.
ఎగ్లెస్ నట్టీ చాక్లెట్ కేక్.
           తెలియని వారి కోసం రెసిపీ:
మైదా :2 కప్పులు
సుగర్ పౌడర్ 1/2 కప్పు
కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు.
రెగ్యులర్ మిల్క్ 1, కప్పు.
కోకో పౌడర్1/2 కప్పు
బేకింగ్ పౌడర్ పావు చెంచా,బేకింగ్ సోడా పావుచెంచా..నట్స్ మనకిష్టమైనన్ని.
నెయ్యి అరకప్పు(బటర్ కూడా వాడచ్చు)
         ముందుగా సుగర్ పౌడర్ ,నెయ్యి బాగా కలిపి క్రీం లా చెయ్యాలి.  మైదా , కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ కలిపి జల్లించుకొని
సుగర్ పౌడర్ మిశ్రమం లో కొద్ది కొద్దిగా వేస్తూ..
పాలూ,కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి.
డ్రైఫ్రూట్స్ కొన్ని కలిపాలి.గిన్నెకి నెయ్యి రాసి   కొంచెం మైదా తో డస్టింగ్ చేసి కలుపుకున్న కేక్ మిశ్రమం సగం వరకూ నింపి  ముగిలిన నట్స్ పైన వేసి బేక్ చెయ్యాలి.
         అన్నట్టు నేనిది కుక్కర్ లో నే చేసానండీ..
కుక్కర్ లో అడుగున ఉప్పు వేసి దానిమీద మనం టేబుల్ మీద పెట్టే స్టీల్ స్టాండ్ పెట్టి దానిమీద గిన్నె పెట్టాలి.కుక్కర్ మూత కి గేస్కెట్ ,విజిల్ పెట్టకూడదు.
  మీడియం ఫ్లేమ్ లో నలభై నిమిషాలు పడుతుంది .

Wednesday, 20 December 2017

తొక్కుడు లడ్డూ

లడ్డు తయారీ:

అన్ని ఒక కప్పు కొలత అండీ.

౧. ముందుగా సెనగపిండి జల్లించుకొని, పొయ్యి మీద pan sim లో పెట్టుకొని నెయ్యి వేసుకొని, ఆ పిండిని కొంచెం కొంచెం గా వేసుకుంటూ దోరగా  వేయించుకున్నాను. (మంచి వేగిన వాసన వచ్చే వరకు)
౨. అందులో కొంచెం యాలకుల పొడి కలిపాను.
౩. మూకుడు తీసుకొని , పొయ్యి మీద పెట్టుకొని అందులో పంచదార వేసి అది తడిసే వరకు నీరు పోసి , తీగపాకం(మొదటి దశ) రానివ్వాలి.
౪. ఇప్పుడు వేయించిన శనగపిండి మిశ్రమాన్ని అందులో క్రమంగా కలుపుకోవాలి.
౫. మరికొంచెం నెయ్యి వేసినా బాగుంటుంది. నాకు నెయ్యి అంటే అమితముగా ఇష్టమండీ, అందుకే కొంచెం ఎక్కువ వేసాను.
౬. శనగపిండి ,పాకం కలిసి చక్కగా మూకుడుకు అంటుకోకుండా ఉంటుంది.
౭. అలా అయిందంటే, లడ్డు చేయడానికి మిశ్రమం తయారయినట్లు.
౮. కాసేపు ఆ మిశ్రమాన్ని చల్లారనిచ్చి, గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవడమే 🙂🙂

Monday, 18 December 2017

కొత్తిమీర నిల్వ పచ్చడి

కొత్తిమీర  నిల్వ పచ్చడి .

కావలసినవి .

కొత్తిమీర  --  రెండు పెద్ద కట్టలు .

వేర్లు కట్ చేసుకుని  కాడలతో సహా ఆకును  శుభ్రంగా  కడిగి  ఒక గుడ్డమీద వేసి తడి లేకుండా రెండు గంటల సేపు  ఎండ బెట్టు కోవాలి .

ఆ తర్వాత కాడలతో సహా  కత్తిరించుకోవాలి .

ఆ తర్వాత  ఆ మొత్తము  ఆకును  నూనె వేయకుండా  బాండీలో  మొత్తము  ఆకు  ముద్దగా  దగ్గర  పడే వరకు వేయించుకోవాలి .

తర్వాత  కొత్తిమీర  ముద్ద  తొక్కులుగా  ఉండకుండా ఈ వేయించిన  ముద్దను  రోటిలో  వేసుకుని కొంచెం  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .

చింతపండు  --  75 గ్రాములు తీసుకుని  ఒక ముప్పావు  గ్లాసు నీళ్ళు పోసుకుని  స్టౌ మీద పెట్టి  బాగా  చిక్కపడేంత వరకు  ఉడికించి  చిక్కగా రసము  వేరే గిన్నెలో కి తీసుకుని   మిగిలిన  పిప్పి  పార వేయాలి .

పై  కొత్తిమీర  మరియు చింతపండు  రసము బాగా చల్లారనివ్వాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ  పెట్టి ఒక 100  గ్రాముల నువ్వుల నూనె కాని , వేరు శనగ  నూనె కాని పోసుకుని  నూనె  బాగా  కాగగానే  అందులో నాలుగు  ఎండుమిరపకాయలు , స్పూనున్నర  మెంతిపిండి  , స్పూను జీలకర్ర , స్పూనున్నర  ఆవాలు   వేసుకుని పోపు  వేగగానే  రసము తీసి ఉడికించి ఉంచుకున్న  చింతపండు  రసము పోపులో  వేయాలి .

అందులో చెంచా  పసుపు , నాలుగు  స్పూన్లు కారం, తగినంత  ఉప్పు  (  షుమారు  నాలుగు స్పూన్లు  ఉప్పు  ) మరియు  75  గ్రాముల  బెల్లపు పొడి  అందులో వేయాలి .

అట్ల కాడతో  బాగా  అన్నీ కలిసి దగ్గర  పడేంతవరకు కలుపుకుని ,  సిద్ధంగా  ఉంచుకున్న  కొత్తిమీర  ముద్దను  ఆ పోపులో  వేసి  బాగా  కలుపుకోవాలి .

బాగా  చల్లారగానే  తీసుకుని  వేరేగా  ఒక జాడీలో గాని , ఒక  సీసాలో కానీ   తీసుకోవాలి .

అంతే  అద్భుతమైన  రుచిగా  ఉండే  కొత్తిమీర   నిల్వ పచ్చడి సిద్ధం.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , చపాతీలు , రోటీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా ఉండే   అద్భుతమైన , రుచికరమైన  కొత్తిమీర  నిల్వ పచ్చడి  సిద్ధం.

ఈ పచ్చడి  ఏడాది అంతా  నిల్వ  ఉంటుంది .

ఇంట్లో  కొత్తిమీర   లేనప్పుడు  ఒక  స్పూను  ఈ కొత్తిమీర  పచ్చడి  చారు కాని , పులుసుల్లో కాని  వేసుకుంటే  అదే  మామూలు కొత్తిమీర   వేసుకున్న  రుచి వస్తుంది .

Saturday, 16 December 2017

చుక్కకూర పచ్చడి

చుక్కకూర  పచ్చడి .

కావలసినవి .

చుక్కకూర  --  రెండు కట్టలు.
పచ్చిమిర్చి  --  8
నూనె  --  అయిదు  స్పూన్లు
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

పోపునకు.

ఎండుమిరపకాయలు  --  6
చాయమినపప్పు -- స్పూనున్నర
మెంతులు  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా  చుక్కకూరలో ముదురు కాడలు  తీసి వేసి శుభ్రం చేసుకుని సిద్ధంగా  ఉంచుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  చుక్కకూర , పచ్చిమిర్చి , పసుపు వేసి మూత పెట్టి  ఆకును మగ్గ నివ్వాలి .

తర్వాత  మగ్గిన ఆకును విడిగా ప్లేటులో తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు, మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి  పోపు వేసుకోవాలి .

ఈ  వేయించిన పోపును  రోటిలో వేసి , తగినంత  ఉప్పును వేసి  పచ్చడి బండతో  మెత్తగా  దంపు కోవాలి .

తర్వాత  మగ్గిన చుక్క కూర , పచ్చిమిర్చి  వేసి బండతో నూరుకోవాలి .

తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.

ఇష్టమైన వారు  మినపప్పు  , ఆవాలు  మరియు ఎండుమిర్చి  వేసి తిరిగి పైన పోపు  వేసుకోవచ్చు .

ఈ చుక్కకూర పచ్చడిలో  ఆకులో  పులుపు ఉంటుంది  కనుక  చింతపండు  వేయనవసరము లేదు.

ఈ పచ్చడి దోశెలు, చపాతీలు మరియు భోజనము  లోకి ఎంతో రుచిగా  ఉంటుంది .

Friday, 8 December 2017

బియ్యపు పిండి సగ్గుబియ్యం చక్రాలు

ఉత్త బియ్యప్పిండి, జీలకర్ర, ధనియాలు, నానేసిన సగ్గుబియ్యం.. ఇంగువ, మిరియాల తో చక్రాలు.. పొరపాటున నాలుగు మెంతి గింజలు పడ్డాయ్.. చిరుచేదు... మొత్తానికి బాగున్నాయి

Wednesday, 6 December 2017

పండు మిరపకాయ కారం (పచ్చడి)

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా రోటిలో పొత్రముతో  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.